పోడు సమస్యల శాశ్వత పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-09-23T04:55:47+05:30 IST

పోడు సమస్యల శాశ్వత పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలి

పోడు సమస్యల శాశ్వత పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సబితారెడ్డి

  • విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి

వికారాబాద్‌, సెప్టెంబరు 22: అటవీ సందపను సంరక్షించుకోవడంతో పాటు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణం గా పోడుభూముల శాశ్వత పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో పోడు భూముల జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో పోడు భూముల రెగ్యులరైజేషన్‌కు 21,761ఎకరాలకు 9,647 అర్జీలు వచ్చాయని, క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. 101 పంచాయతీలు, 128 హ్యాబిటేషన్లలో షెడ్యూల్‌ తెగలు 10,635 ఎకరాల్లో, ఇతరులు 1,1126 ఎకరాల్లో పోడు సాగు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. అటవీ భూములు అ క్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఫారెస్ట్‌ రైట్‌ కమిటీలు అర్హుల జాబితాను పంచాయతీ తీర్మానాలతో సబ్‌ డివిజనల్‌ కమిటీ ద్వారా జిల్లా కమిటీకి పంపాలని మంత్రి తెలిపారు. అర్హులకు పోడు భూముల పట్టాలు ఇచ్చే ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. శాశ్వత పరిష్కారానికి ఎమ్మెల్యేల సహకారం తీసుకొని పోడు రైతులకు అన్యాయం జరుగకుండా చూడాలని సూచించారు. ఇక మీదట అటవీ భూములు ఆక్రమించకుండా అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. కలెక్టర్‌ నిఖిల మాట్లాడుతూ.. ఇప్పటికే పోడు రైతుల సమస్యల పరిష్కారానికి గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలను వేశామన్నారు. వచ్చిన అర్జీలన్నీ పరిశీలించామని, అర్హులకు పట్టాల అందజేస్తామన్నారు. పోడు సాగు చేస్తున్న గిరిజనులు, ఇతర కులాల వారిని గుర్తించి ఫారెస్ట్‌, రెవెన్యూ శాఖలతో కలిసి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి, వికారాబాద్‌, పరిగి, చేవెళ్ల ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, కె.మహేశ్‌రెడ్డి, కాలె యాదయ్య, జడ్పీ వైస్‌చైర్మన్‌ విజయ్‌కుమార్‌, ఎస్పీ కోటిరెడ్డి, రైతు సమితి జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, అటవీ శాఖ అధికారి వెంకటశ్వర్‌రెడ్డి, ఇన్‌చార్జి డీఆర్వో అశోక్‌కుమార్‌, ఆర్డీవో విజయకుమారి, ఎస్టీ వెల్ఫేర్‌ అధికారి కోటాజీ, అటవీ శాఖ అధికారులు, తహసీల్దార్లు, ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


  • ప్రేమాభిమానం పంచేందుకే చీరల పంపిణీ

ఆడపడచులకు ప్రేమాభిమానాలు పంచేందుకే రాష్ట్ర ప్ర భుత్వం చీరల పంపిణీ చేస్తోందని మంత్రి సబితారెడ్డి అన్నా రు. కలెక్టరేట్‌లో బతుకమ్మ చీరల పంపిణీలో ఎమ్మెల్యేలు, అధికారులతో మంత్రి పాల్గొని అందజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత పండగలను ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. రూ.340కోట్లతో పేద ఆడ పడచులందరికీ చీరలు అందజేస్తున్నామని తెలిపారు. చీరల పంపిణీలో కేసీఆర్‌ ప్రేమాభిమానంతో పాటు నేత కార్మికుల కష్టాన్నీ చూడాలని కోరారు. జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో బతుకమ్మ పండగ ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించడం గొప్ప పరిణామమన్నారు. కలెక్టర్‌ నిఖిల మాట్లాడుతూ.. జిల్లాకు 3.35లక్షల చీరలను మూడు గోదాముల్లో భద్ర పర్చామని, అన్ని గ్రామాల్లో చీరలను అందజేస్తామన్నారు. చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


  • ‘విద్వేషం తప్ప అభివృద్ధిపై ధ్యాసలేని బీజేపీ : సబితారెడ్డి

వికారాబాద్‌, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రజల్లో విద్వేషాన్ని నింపి మతం పేరిట రెచ్చగొట్టడం తప్ప బీజేపీ నాయకులకు అభివృద్ధి, సంక్షేమంపై ధ్యాస లేదని విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి మండిపడ్డారు. కలెక్టరేట్‌లోని స్టేట్‌ చాంబర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ నాయకులు సమాజాన్ని కులాలు, మతాల పేరిట విభజించి, రాజకీయ లబ్ధి పొంద చూస్తున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. ఎనిమిదేళ్లుగా వారు రాష్ట్రానికి ఏమి తెచ్చారో చెప్పరు గానీ, అధికారం కావాలని తాపత్రయ పడుతున్నారని విమర్శించారు. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ, విభజన హామీలు ఏమయ్యాయో చెప్పాలన్నారు. బీజేపీ నాయకులు అభివృద్ధికి సహకరించకుండా ప్రజల్లో విద్వేషాన్ని రగిలిస్తూ బూటక యాత్రలు చేస్తున్నారని ఆరోపించారు. చెప్పినవి చేసి చూపించేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అని, కానీ బీజేపీ హామీలకు, చేసే పనులకు పొంతనే లేదని మంత్రి అన్నారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని కేంద్రానికి పంపి ఏడేళ్లవుతున్నా.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఇదంతా చూస్తుంటే కేంద్రానికి ఇవ్వాలనే ఆలోచన లేనట్ల్లు తెలుస్తోందన్నారు. అందుకే గిరిజన రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వమే జీవో ఇచ్చేందుకు నిర్ణయించిందని తెలిపారు. ఇప్పటికైనా గిరిజన రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని మంత్రి కోరారు. గిరిజన భవన్‌ నిర్మించి, పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు గిరిజనబంధు ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు వారి తరపున ధన్యావాదాలు తెలుపుతున్నట్లు మంత్రి సబిత అన్నారు.



Updated Date - 2022-09-23T04:55:47+05:30 IST