గురుగ్రామ్‌లో ఎనిమిది చోట్ల Namazకు అనుమతి రద్దు

ABN , First Publish Date - 2021-11-03T17:49:53+05:30 IST

గురుగ్రామ్ నగరంలో ఎనిమిది చోట్ల నమాజ్‌ చేసేందుకు ఇచ్చిన అనుమతిని అధికారులు రద్దు చేశారు....

గురుగ్రామ్‌లో ఎనిమిది చోట్ల Namazకు అనుమతి రద్దు

గురుగ్రామ్ : గురుగ్రామ్ నగరంలో ఎనిమిది చోట్ల నమాజ్‌ చేసేందుకు ఇచ్చిన అనుమతిని అధికారులు రద్దు చేశారు. స్థానిక ప్రజలు, రెసిడెంట్స్ సంక్షేమ సంఘాల నుంచి వచ్చిన అభ్యంతరాలతో 8 సైట్లలో నమాజ్ చేసేందుకు ఇచ్చిన అనుమతిని రద్దు చేశామని గురుగ్రామ్ అధికారులు చెప్పారు. గురుగ్రామ్ లోని సెక్టార్ 49లోని బెంగాలీ బస్తీ, డీఎల్ఎఫ్ ఫేజ్-3లోని 5వ బ్లాక్, సూరత్ నగర్ ఫేజ్-1, ఖేర్కీ మజ్రా గ్రామ శివార్లలో, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలోని దౌలతాబాద్ గ్రామ శివార్లలో, సెక్టార్ 68లోని రామ్‌ఘర్ గ్రామ సమీపంలో, డీఎల్ఎఫ్ స్క్వేర్ టవర్ సమీపంలో, రాంపూర్ గ్రామం నుంచి నఖ్రోలా రోడ్డు వరకు నమాజ్ చేసుకునేందుకు గతంలో ఇచ్చిన అనుమతిని రద్దు చేశామని అధికారులు చెప్పారు. 


ఏదైనా బహిరంగ ప్రదేశంలో నమాజ్ చేయడానికి అధికారుల అనుమతి అవసరం అని అధికారులు చెప్పారు. ఏదైనా మసీదు, ఈద్గా లేదా ప్రైవేటు ప్రదేశంలో నమాజ్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఇతర ప్రదేశాలలో కూడా స్థానిక ప్రజల అభ్యంతరాలు ఉంటే, అక్కడ కూడా నమాజ్ చేయడానికి అనుమతి ఇవ్వమని అధికారులు చెప్పారు. భవిష్యత్తులో నమాజ్ కు అనుమతి ఇవ్వడానికి వీలుగా గురుగ్రామ్ డిప్యూటీ కమిషనర్ యష్ గార్గ్, సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, మతపరమైన సంస్థలు, పౌర సమాజ సంఘాల సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. 


రహదారి, క్రాసింగ్ లేదా బహిరంగ ప్రదేశంలో నమాజ్ చేయరాదని కమిటీ నిర్ధారించింది.గురుగ్రామ్‌లోని సెక్టార్-47లోని మైదానంలో శుక్రవారం నమాజ్‌ చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు వరుసగా నాలుగో వారం పూజలు చేస్తూ నిరసన తెలిపారు.


Updated Date - 2021-11-03T17:49:53+05:30 IST