విలేకర్ల సమావేశంలో రైతులు
అధికారపార్టీ, వ్యవసాయ అధికారుల కుమ్మక్కుతోనే..
విడవలూరు, జనవరి 17: అధికారపార్టీ , వ్యవసాయాధికారులు కుమ్మకై యూరియాను బ్లాక్ మార్కెట్‌కి తరలిస్తున్నారని వ్యవసాయ సహకార సంఘం మాజీ అధ్యక్షుడు మాతూరు శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు. స్థానిక అంకమ్మదేవాలయం సెంటర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రైతులతో కలిసి ఆయన మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేదని వ్యవసాయాశాఖ జేడీ ప్రకటించినా విడవలూరు మండలంలో రైతులకు అందటం లేదన్నారు. రైతు భరోసా కేంద్రాలకు వస్తున్న యూరియా ఎక్కడకి పోతుందని ఆయన ప్రశ్నించారు. రైతు భరోసా కేంద్రాల్లో, వ్యవసాయ సహకార సంఘాల్లో దొరకని యూరియా బస్తాలు కోవూరు, రాజుపాళెం, నెల్లూరులోని ప్రైవేట్ డీలర్ల వద్ద లభిస్తున్నాయని ఆరోపించారు. వైసీపీనాయకులు, డీలర్లు, అధికారులు కుమ్మకై యూరియా మాఫీగా ఏర్పడి ఎరువులను పక్కదారి మళ్లించి బహిరంగ మార్కెట్‌లో ఒక యూరియా బస్తాని సుమారు రూ. 320 నుంచి 350 వరకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా వ్యవసాయాశాఖ జేడీ ఏమీ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో రైతులు చెముకుల కృష్ణ చైతన్య, చెముకుల శ్రీనివాసులు, సత్యవోలు సత్యంరెడ్డి, పోలిరెడ్డి ఆశోక్‌రెడ్డి, గునపాటి వరదారెడ్డి, పుచ్చలపల్లి నారాయణరెడ్డి, మంచాల అజయ్‌బాబు, అనపల్లి ధనుంజయ్య, నక్కాసుమన్, కొమ్మిరెడ్డి విజయకుమార్‌రెడ్డి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.