Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎరువుల బ్లాక్‌

అధిక ధరలకు అమ్మకాలు

దుకాణాల్లో ఆర్‌బీకే ఎరువులు

పట్టించుకోని వ్యవసాయశాఖాధికారులు

లింక్‌ ఎరువులు కొంటేనే యూరియా, డీఏపీ 


(ఆంధ్రజ్యోతి - గుంటూరు) 

ఎరువుల కోసం రైతులు ఇబ్బంది పడకూడదు. అవసరమైన మేర అందించాలి. ఆర్‌బీకేల ద్వారానే ఎరువులు సరఫరా కావాలి.. అని మంత్రి నుంచి ఉన్నతాధికారుల వరకు చెప్తున్నారు. కాని జిల్లాలో ఈ పరిస్థితి ఎక్కడా లేదు. ఎరువులు బ్లాక్‌ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఆర్‌బీకేల్లో విక్రయించాల్సిన ఎరువులు దుకాణాల్లో దొరుకుతున్నాయి. అది కూడా అధిక ధర వెచ్చిస్తేనే రైతులకు అందుతున్నాయి. ఆర్‌బీకేలకు ప్రభుత్వం కేటాయిస్తున్న ఎరువులను అధికారులు మార్కెట్‌లోని దుకాణాలకు తరలిస్తున్నారని, వారు ఎక్కువ ధరకు అమ్ముతున్నారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ నేరుగా జేడీ విజయభారతికి ఫిర్యాదు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో ఎక్కడా కూడా ఎమ్మార్పీకి ఎరువులను అమ్మడంలేదు. డీఏపీ, యూరియా, పొటాష్‌లను కూడా ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. డీఏపీ బస్తా రూ.1,200కు అమ్మాల్సి ఉండగా బ్లాక్‌లో రూ.1,500కు, యూరియా రూ.266 అ మ్మాల్సి ఉండగా రూ.350కు, పొటాష్‌ రు.1,040కు అమ్మాల్సి ఉండగా రూ.1,200కు విక్రయిస్తున్నారు. ఎరువులను బ్లాక్‌మార్కెట్‌లో అమ్ముతున్నా వ్యవసాయశాఖ అధికారులు పట్టించుకోవటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. డీఏపీ, యూరియా కావాలంటే కొన్ని కంపెనీలు, వ్యాపారులు లింక్‌ ఎరువులను కొనాలనే నిబంధన పెడుతున్నారు. డీఏపీ, యూరియా, పొటాష్‌  ఎమ్మార్పీకే కావాలంటే రైతులు కాంప్లెక్స్‌ ఎరువులను కొనాలని చెప్తున్నారు. కొన్ని కంపెనీలు, వ్యాపారులు నీటిలో కరిగే 19-19-19, 13-0-45, 12-61-0 వంటి ఎరువుల బస్తాను కొనాలని లింక్‌ చేస్తున్నారు. మరికొంత మంది ఆర్గానిక్‌ ఎరువులు, వేప పిండిని అంటగడుతున్నారు. ఎక్కువ ధర ఇవ్వని రైతులు లింక్‌ ఎరువులు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది.


ఈ-పాస్‌ అమ్మకాలు విఫలం

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బయోమెట్రిక్‌లో ఈ -పాస్‌ మిషన్ల ద్వారా ఎరువులను అమ్మాలి. వ్యాపారులు రైతుల ఆధార్‌ను నమోదు చేసి ఈ-పాస్‌ ద్వారా వేలిముద్రలు తీసుకున్న తరువాతే ఎరువులు ఇవ్వాలి. అయితే జిల్లాలో ఈ-పాస్‌ అమ్మకాలు జరగడంలేదు.   వ్యవసాయశాఖకు సంబంధించిన విక్రయాల్లో అధికారులు   ఈ-పాస్‌, బయోమెట్రిక్‌ను వందశాతం అమలు చేయలేక పోయారు. మరోవైపు రైతుభరోసా కేంద్రాలు(ఆర్‌బీకే)  కూడా విఫలమయ్యాయి. హబ్‌ల నుంచి ఆర్‌బీకేలకు విడుదలైన ఎరువులు రైతులకు అందడంలేదు. ఆర్‌బీకేలకు గిడ్డంగులు లేకపోవడంతో వ్యవసాయశాఖ అధికారులు ఎరువులను వ్యాపారుల షాపులల్లో దించుతున్నారు.   వ్యాపారులు షాపులకు వచ్చే రైతుల వివరాలను ఆర్‌బీకేలకు అందిస్తున్నారు. నిజాంపట్నం మండలంలో ఆర్‌బీకేల ఎరువులను షాపులలో అమ్మినట్లు సర్పంచ్‌లు జేడీ విజయభారతికి ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసి అక్రమాలకు పాల్పడిన అధికారులపై వ్యవసాయశాఖ చర్యలు తీసుకోలేదు. దీంతో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు.    

ఎక్కువ ధరకు అమ్మకాలు

కాంప్లెక్స్‌ ఎరువులు, డీఏపీ, యూరియా, పొటాష్‌లను ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు.  అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆర్‌బీకేలకు ఎరువులు సకాలంలో రావటంలేదు. వచ్చిన ఎరువులను రైతులకు పంపిణీ చేయడంలేదు. కౌలు రైతులు ఎరువుల కోసం తీవ్రంగా  ఇబ్బందులు పడుతున్నారు.

- తాళ్ళూరి కోటేశ్వరరావు, కౌలు రైతు, మాదల 

Advertisement
Advertisement