ఉర్దూ కోర్సులు పునరుద్ధరించాలి

ABN , First Publish Date - 2021-07-01T06:08:48+05:30 IST

తెలంగాణలో ఉర్దూకు ఉన్న ప్రాధాన్యాన్ని ఓ పద్ధతి ప్రకారం తొలగించే ప్రయత్నం జరుగుతోంది. ఇక్కడ ఉర్దూ రెండవ అధికార భాషగా ఉండడంతో లక్షలాది మంది విద్యార్థులు...

ఉర్దూ కోర్సులు పునరుద్ధరించాలి

తెలంగాణలో ఉర్దూకు ఉన్న ప్రాధాన్యాన్ని ఓ పద్ధతి ప్రకారం తొలగించే ప్రయత్నం జరుగుతోంది. ఇక్కడ ఉర్దూ రెండవ అధికార భాషగా ఉండడంతో లక్షలాది మంది విద్యార్థులు ఆ మీడియంలో చదువుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ తర్వాత డిగ్రీ స్థాయిలో ఉర్దూ మీడియం కోర్సులు లేవు. ప్రతి ఏడాది ఈ మీడియం సీట్ల సంఖ్యను తగ్గించేస్తున్నారు. వివిధ కోర్సులలో ఉన్న అవసరమైన ఖాళీలను కూడ భర్తీ చేయడం లేదు. ప్రభుత్వ కళాశాలల్లో గతంలో ఉన్న బికామ్‌ ఉర్దూ కోర్సులను 2019 నుంచే నిలిపివేశారు. తదుపరి సైన్స్‌, ఆర్ట్స్‌ సబ్జెక్టుల్లో కూడ ఉర్దూ డిగ్రీ కోర్సులు రద్దు చేస్తారేమోనని విద్యార్థులలో భయాందోళన నెలకొని ఉంది. 


అన్ని వర్గాలవారు విద్యాపరంగా, సామాజిక, ఆర్థికపరంగా అభివృద్ధి చెందాలన్నది తమ లక్ష్యమని తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించుకుంది. జి. సుధీర్‌ (రిటైర్డ్‌ ఐఎఎస్‌) నేతృత్వంలో నియమించిన విచారణ కమిషన్‌ తెలంగాణలో 16 నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి రెండో ముస్లిం, పాఠశాల లేదా కళాశాలకు హాజరవుతున్నట్లు పేర్కొంది. అయితే 18 నుంచి 20 సంవత్సరాల వయస్సులోని వారు చదువు మానేసే పరిస్థితి దాదాపు 61 శాతం దాకా ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 49 శాతం మంది మహిళలు నిరక్షరాస్యులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘బంగారు తెలంగాణ’ను ఆచరణ రూపంలో సాధించేందుకు ఉర్దూ మీడియం విద్యార్థులకు కావలసిన సదుపాయాలను ప్రభుత్వం అందించాల్సి ఉంది. ప్రభుత్వం ఉర్దూ మీడియం కోర్సులు, కళాశాలల స్థితిగతులను క్షుణ్ణంగా సమీక్షించి తెలంగాణ దోస్త్‌ పోర్టల్‌లో చేర్చాలి. ఎక్కడెక్కడ ఖాళీలున్నాయో నివేదిక తెప్పించుకుని తక్షణమే బోధకులను నియమించాలి.

డాక్టర్ తల్హా ఫయాజుద్దీన్

Updated Date - 2021-07-01T06:08:48+05:30 IST