అడవి అందాలు

ABN , First Publish Date - 2022-05-13T05:49:09+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టు కంపా నిధులతో చేపట్టిన హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్టు పార్కులు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నాయి. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండల పరిధిలోని రిజర్వు ఫారెస్టులో హైవే నంబర్‌ 44 పక్కన మనోహరాబాద్‌ (దండుపల్లి వద్ద), పరికిబండలో (ఇమాంపూర్‌ స్టేజీ వద్ద) పార్కులు ఏర్పాటు చేశారు. మనోహరాబాద్‌ రిజర్వు ఫారెస్టు పరిధిలో 129 హెక్టార్లు, పరికిబండ రిజర్వు ఫారెస్టు పరిధిలో 220 హెక్టార్లలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో వీటిని అభివృద్ధి చేస్తున్నారు. మూడేళ్లుగా నిర్మాణం పనులు చేపడుతూనే మొక్కలనూ పెంచుతున్నారు.

అడవి అందాలు
మనోహరాబాద్‌ అర్బన్‌ పార్కు ముఖద్వారం

ప్రారంభానికి సిద్ధమవుతున్న అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌లు

ముస్తాబు చేస్తున్న అటవీశాఖ, హెచ్‌ఎండీఏ

మరిన్ని పనులు చేసేందుకు సమాయత్తం

చిన్నారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లకు ప్రతిపాదనలు


తూప్రాన్‌, మే 12: కాళేశ్వరం ప్రాజెక్టు కంపా నిధులతో చేపట్టిన హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్టు పార్కులు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నాయి. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండల పరిధిలోని రిజర్వు ఫారెస్టులో హైవే నంబర్‌ 44 పక్కన మనోహరాబాద్‌ (దండుపల్లి వద్ద), పరికిబండలో (ఇమాంపూర్‌ స్టేజీ వద్ద) పార్కులు ఏర్పాటు చేశారు. మనోహరాబాద్‌ రిజర్వు ఫారెస్టు పరిధిలో 129 హెక్టార్లు, పరికిబండ రిజర్వు ఫారెస్టు పరిధిలో 220 హెక్టార్లలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో వీటిని అభివృద్ధి చేస్తున్నారు. మూడేళ్లుగా నిర్మాణం పనులు చేపడుతూనే మొక్కలనూ పెంచుతున్నారు. పరికిబండ పార్కులో 220 హెక్టార్లలో 1.30 లక్షల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. పార్కు చుట్టూ రూ. 16 కోట్ల వ్యయంతో 40 కిలోమీటర్ల పొడవున ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. మనోహరాబాద్‌ పార్కు పరిధిలోని 129 హెక్టార్లలో 80,317 మొక్కలు ఇప్పటికే నాటారు. పార్కు చుట్టూ రూ. 1.20 కోట్ల వ్యయంతో 4 కిలోమీటర్ల పొడవు ఫెన్సింగ్‌ నిర్మించారు. ఈ పార్కుల్లో ఆక్సిజన్‌ అందజేసే వేప, రావి, మర్రి, ఇప్ప, చింత, తాని, నారేపి, అల్లనేరేడు, మారేడు తదితర మొక్కలు నాటారు. వాకర్ల కోసం నడక దారులను ఏర్పాటు చేశారు. యోగా చేసుకోడానికి షెడ్లను ఏర్పాటు చేశారు. సేదతీరేందుకు అక్కడక్కడ బెంచీలను ఏర్పాటు చేశారు. గుర్రం, తాబేలు, యాపిల్‌పండు, పుచ్చకాయ, అరటిపండు ఆకారంలో నిర్మించిన ఈ బెంచీలు ఆకట్టుకుంటున్నాయి. అటవీ అందాలను వీక్షించేందుకు పార్కుల్లో కొండలపై వ్యూ పాయింట్లను ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. గేటు ముందు అందమైన పూలమొక్కలను తీర్చిదిద్దారు. 


మరింత అందంగా తీర్చిదిద్దాలని..

మనోహరాబాద్‌, పరికిబండ హెచ్‌ఎండీఏ అర్బన్‌ పార్కులను త్వరలోనే ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రారంభోత్సవానికి ముందు మరింత అందంగా తీర్చిదిద్దడానికి మరిన్ని పనులు చేపట్టాలని నిర్ణయించారు. పార్కుల్లో సైకిల్‌ ట్రాక్‌, చిన్నారులు ఆడుకునేందుకు ఏర్పాట్లు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చిన్నాపెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారిని ఆకట్టుకునేలా పార్కులను తీర్చిదిద్దుతున్నారు.

Read more