భారీగా మద్యం, గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2020-07-06T09:48:08+05:30 IST

గుంటూరుకు తెలంగాణ నుంచి వస్తున్న మద్యం, విశాఖ నుంచి వస్తున్న గంజాయిని భారీగా స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి ..

భారీగా మద్యం, గంజాయి స్వాధీనం

4,026 బాటిళ్లు స్వాధీనం.. 8 మంది అరెస్టు

వైజాగ్‌ నుంచి గుంటూరుకు గంజాయి రవాణా

8 కేజీలు,  55 గంజాయి లిక్విడ్‌ బాటిళ్లు స్వాధీనం

వివరాలు వెల్లడించిన అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి

 

గుంటూరు, జూలై 5: గుంటూరుకు తెలంగాణ నుంచి వస్తున్న మద్యం, విశాఖ నుంచి వస్తున్న గంజాయిని భారీగా స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ఆదివారం వేర్వేరుగా జరిగిన విలేకర్ల సమావేశాల్లో నిందితులను, సరుకును ప్రదర్శించారు. తెలంగాణ నుంచి భారీగా మద్యం తీసుకువచ్చి జిల్లాలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఓ ముఠాను స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో గుర్తించింది. శావల్యాపురం మండలం కారుమంచికి చెందిన లారీ యజమాని బొట్లా హనుమంతరావు, కారుడ్రైవర్‌ కల్లూరి ప్రవీణ్‌, లారీ క్లీనర్‌ నల్లూరి ప్రదీప్‌, ప్రస్తుతం గుంటూరులోని పట్టాభిపురం 1/2లో ఉంటున్న వైకంటి శ్రీను, రాజేంద్రనగర్‌కు చెందిన టాటా ఏస్‌ డ్రైవర్‌ గోపీకిషోర్‌, మల్లికార్జునపేటకు చెందిన వీ శివకొండలరావు, సీతానగరానికి  చెందిన ఎస్‌ రసూల్‌బాషా, స్తంభాలగరువుకు చెందిన ఎఫ్‌ మురళీల ముఠాను అరెస్టు  ఆదివారం ఎక్సైజ్‌-2 పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియా ఎదుట హాజరుపరిచారు. శావల్యాపురానికి చెందిన యరమాసు రాము తెలంగాణ నుంచి మద్యం తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు ఎస్‌ఈబీ అధికారులు గుర్తించారు. దీంతో ఆదివారం పెదపలకలూరు రోడ్డులో ఏపీ 39 డబ్ల్యూ 6359 లారీని తనిఖీ చేయగా అందులో 2,230 మద్యం బాటిళ్లను గుర్తించారు.


నిందితులు ఇచ్చిన సమాచారంతో పట్టాభిపురంలోని శ్రీను ఇంటిలో తనిఖీ చేసి 672 మద్యం బాటిళ్ళు, కారులో మరో 432 బాటిళ్ళు, టాటాఏస్‌ వాహనంలో 692 బాటిళ్ళు వెరసి 4,026 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో మరో ముగ్గుర్ని అరెస్టు  చేసి మూడు ద్విచక్ర వాహనాలు, 252 బాటిళ్ళు స్వాధీనం చేసుకున్నారు. స్వాఽధనం చేసుకున్న మద్యం విలు రూ.11 లక్షలు, వాహనాల విలువ రూ.40 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఈ వ్యవహారానికి సూత్రధారి అయిన యర్రమాసు రామును, రంగారెడ్డిజిల్లా ఎల్‌బీనగర్‌లోని చలపతివైన్స్‌, ఆటో నగర్‌లోని జీఆర్‌ఆర్‌ వైన్స్‌ల నిర్వాహకులను అరెస్టు చేయాల్సి ఉందన్నారు.  రాము తెలంగాణ నుంచి మద్యం తెప్పించి కారుమంచి గ్రామంలో స్టాక్‌ చేసి అక్కడి నుంచి గుంటూరులోని పట్టాభిపురంలో అద్దెకు తీసుకున్న ఇంటికి తరలించి విక్రయిస్తున్నట్లు తెలిపారు.  సమావేశంలో ఎస్‌ఈబీ ఎస్పీ ఎన్‌ బాలకృష్ణన్‌, అదనపు ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌, గుంటూరు-2 ఎస్‌హెచ్‌వో మాధవి, ఎస్‌బీ డీఎస్పీ బాల సుందరరావు తదితరులు పాల్గొన్నారు.  


మద్యం విక్రయిస్తున్న పలువురి అరెస్టు

అక్రమంగా మద్యం విక్రయిస్తున్న పలువురిని వెస్ట్‌ సబ్‌ డివిజన్‌ పోలీసులు అరెస్టు చేశారు.  బ్రాడీపేటలో సానం చౌడప్ప నుంచి 10 బాటిళ్ళను అరండల్‌పేట సీఐ బత్తుల శ్రీనివాసరావు స్వాధీనం చేసుకున్నారు. శారదాకాలనీలో పారా సుబ్బమ్మను అరెస్టు చేసి 9 మద్యం బాటిళ్ళు, గుట్కా పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వెంగయ్యనగర్‌కు చెందిన ఈమెశెట్టి కృష్ణకిషోర్‌ దుకాణం నుంచి 5 బాక్సుల విదేశీ సిగరెట్‌ బాక్సులు, గుట్కా పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.  శ్రీనగర్‌లో పేకాడుతున్న 12 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 29 వేలు స్వాధీనం చేసుకున్నట్లు వెస్ట్‌ డీఎస్పీ రామారావు తెలిపారు. జేకేసీ కాలేజీ రోడ్డులో టెంట్‌ హౌస్‌ వద్ద పేకాడుతున్న ఏడుగురిని, వారికి సహకరిస్తున్న మరొకరిని అరెస్టు చేసి 17,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 


వినుకొండ: గుంటూరులో అదుపులోకి తీసుకున్న వ్యక్తుల సమాచారం మేరకు ఆదివారం శావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో అధికారులు తనిఖీలు చేసినట్లు  జిల్లా ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అసిస్టెంట్‌ కమిషనర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాస్‌ తెలిపారు. టాటా ఏసీ మినీలారీలోని 30 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని, లారీ, ఒక కారు, మూడు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకొని గుంటూరు తరలించినట్లు తెలిపారు.  


 మాచవరం: మండలంలోని గోవిందాపురం కృష్ణానదిలో నాటుపడవ ద్వారా   తెలంగాణ నుంచి తరలిస్తున్న 512 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ లక్ష్మీనారాయణరెడ్డి తెలిపారు. పాతగోవిందాపురం, కృష్ణానది వెంబడి రూ. లక్ష విలువైన మద్యం పట్టుకున్నట్లు సమాచారం.  


తాడేపల్లి టౌన్‌: ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ఆదివారం అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం బాటిళ్లను ఎక్సైజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  గుంటూరు, తెనాలికు చెందిన ఆరుగురితో పాటు కారును అదుపులోకి 103 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మందడం గ్రామానికి చెందిన ద్విచక్రవాహనం పై వెళ్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని 48 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ  ప్రమీలరాణి తెలిపారు.  


తాడికొండ: మండలంలోని  పొన్నెకల్లులో అక్రమంగా మద్యం అమ్ముతున్న బీ.ఆదినారాయణ అరెస్టు చేసి 10 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌.ఐ రాజశేఖర్‌ తెలిపారు.


ఫిరంగిపురం: మండలంలోని గుండాలపాడులో  కొల్లి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని మూడు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు. 


పిడుగురాళ్ల: పట్టణానికి చెందిన గుర్రం లక్ష్మయ్య తమ్మిశెట్టి శ్యాంసన్‌ కలసి నాలుగు బస్తాల్లో గుట్కాప్యాకెట్లు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ప్రభాకరరావు తెలిపారు. ఆటోను సీజ్‌ చేశామన్నారు.  

Updated Date - 2020-07-06T09:48:08+05:30 IST