పట్టణ ప్రగతి అవార్డుల్లో రిక్తహస్తం!

ABN , First Publish Date - 2022-05-16T04:59:52+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం గత శుక్రవారం ఇచ్చిన పట్టణ ప్రగతి అవార్డుల్లో వికారాబాద్‌ జిల్లా నాలుగు మున్సిపాలిటీల్లో ఒక్కదానికీ బహుమతి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం గత శుక్రవారం ఇచ్చిన పట్టణ ప్రగతి అవార్డుల్లో వికారాబాద్‌ జిల్లా నాలుగు మున్సిపాలిటీల్లో ఒక్కదానికీ బహుమతి రాలేదు.

పట్టణ ప్రగతి అవార్డుల్లో రిక్తహస్తం!
వికారాబాద్‌ పురపాలక సంఘ కార్యాలయం

  • పారిశుధ్య కల్పనలో నెరవేరని లక్ష్యం 
  • సదుపాయాలపైనా దృష్టిపెట్టని పురపాలికలు
  • అటకెక్కిన స్వచ్ఛ విధానాల అమలు 
  • పనితీరు బాగుంటేనే ప్రత్యేక నిధులు

రాష్ట్ర ప్రభుత్వం గత శుక్రవారం ఇచ్చిన పట్టణ ప్రగతి అవార్డుల్లో వికారాబాద్‌ జిల్లా నాలుగు మున్సిపాలిటీల్లో ఒక్కదానికీ బహుమతి రాలేదు.

పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ, మురుగునీటి పారుదల, కంపోస్ట్‌ తయారీ, హరితహారం తదితర అంశాల్లో ప్రగతి సాధించిన 

బల్దియాలకు ప్రభుత్వం అవార్డులిచ్చింది. మన పురపాలికలు ఈ అంశాల్లో లక్ష్యాలు సాధించకనే అవార్డు సాధించలేదు.

వికారాబాద్‌, మే 15(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వివిధ కేటగిరీల్లో ఉత్తమ పనితీరు కనబర్చిన మునిసిపాలిటీలకు ప్రభుత్వం ఇచ్చిన అవార్డుల్లో జిల్లాకు చోటుదక్కలేదు. శానిటేషన్‌, పీటీ/సీటీ, ఓడీఎఫ్‌ సర్టిఫికేషన్‌, రెవెన్యూ ఇంప్రూవ్‌మెంట్‌, ఇన్నోవేటివ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, హరితహారం తదితర అంశాల్లో కేటగిరీల వారీగా జనాభా ప్రాతిపదికన శుక్రవారం హైదరాబాద్‌లో మునిసిపల్‌, రవాణా శాఖల మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌ అవార్డులు అందజేశారు. 25వేలలోపు, 25వేల-50వేల లోపు, 50వేల నుంచి లక్ష లోపు, లక్షపైన జనాభా గల మున్సిపాలిటీలకు ఐదు కేటగిరీలకు గాను జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల్లో ఒక్కదానికీ అవార్డు రాలేదు. జిల్లాలో తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ మునిసిపాలిటీలున్నాయి. పట్టణ ప్రగతిలో జిల్లా బల్దియాల్లో ఆశించినస్థాయిలో పారిశుధ్య పనుల్లో ప్రగతి సాధించలేదు. తాండూరులో 36, వికారాబాద్‌లో 34, పరిగిలో 15, కొడంగల్‌లో 12 వార్డులున్నాయి. ఈ పట్టణల్లో పారిశుధ్య నిర్వహణపై సరైన పర్యవేక్షణ లేకే ఫలితాలు రావడం లేదు. పట్టణ ప్రగతి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదే పారిశుధ్యాన్ని పాదుకొల్పేందుకు. స్వచ్ఛ పట్టణాలుగా మర్చేందుకు. యుద్ధ ప్రాతిపదికన  పనులు చేపట్టేలా మున్సిపల్‌ అధికారులు, పాలకవర్గాలు దృష్టి సారించలేదు. చెత్త సేకరణ బాగానే ఉన్నా తడి, పొడి చెత్తంతా ఒకే చోట వేస్తున్నారు. ఫలితంగా తడి, పొడి చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేయలేకపోతున్నారు. శానిటేషన్‌, పరిశుభ్రత పనులు కొంత బాగానే ఉన్నా మన మున్సిపాలిటీలు చెత్తను కంపో్‌స్టగా చేసి ఆదాయ వనరుగా మార్చడం లేదు. వికారాబాద్‌ పట్టణంలో గతంలో తడి, పొడి, హానికారక వ్యర్థాల సేకరణకు కూడళ్లలో మూడు వేర్వేరు రంగుల డబ్బాలు ఏర్పాటు చేసినా కొన్ని రోజులకు వాటి జాడే లేదు! చాలా మున్సిపాలిటీల్లో తడిచెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేస్తుండగా జిల్లాలో ఆ పరిస్థితి లేదు. వికారాబాద్‌లో డంప్‌ యార్డు నిర్మాణం అసంపూర్తిగా ఉంది. వ్యర్థాలను రీసైకిల్‌ చేసే యంత్రం ఉన్నా డంప్‌ యార్డు లేక తడి, పొడి చెత్తను వేరుచేసే ప్రక్రియ చేపట్టడం లేదు. తాండూరు, పరిగి, కొడంగల్‌ మునిసిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.


  • ప్రజలకు సేవలూ అంతంతే!

రద్దీ ప్రాంతాల్లో టాయిలెట్ల నిర్వహణా సరిగా లేదు. దుర్వాసన భరించలేక జనం వాటిని వాడుకోవడమే లేదు. స్వచ్ఛ పట్టణం, స్వచ్ఛ వార్డు పేర్లతో ఏర్పాటు చేసిన టాయ్‌లెట్లు, శౌచాలయాలు మురికి కూపాల్లా దర్శనమిస్తున్నాయి. వాటికి నీటి సౌకర్యమూ కల్పించలేదు. రోజు నిర్వహణనూ గాలికొదిలేశారు. మునిసిపల్‌ అధికారుల పర్యవేక్షణా కొరవడింది. ప్రజల ఉపయోగార్థం పెట్టిన టాయిలెట్లు నిరుపయోగంగా మారాయి. అధికారులు చర్యలు తీసుకొని సిబ్బందితో సరిగ్గా నిర్వహిస్తేనే వాటిని వినియోగంలోకి తేవడం సాధ్యం.

  • ఆదాయం పెంచుకునే మార్గంపై దృష్టేది?

మునిసిపాలిటీల ఆదాయానికి వివిధ మార్గాలను అన్వేషించాలని ప్రభుత్వం సూచిస్తున్నా మున్సిపల్‌ పాలకవర్గాలు, అధికారులు ఆ దిశగా దృష్టిసారించడం లేదు. పెరుగుతున్న ఖర్చులు బల్దియాలకు భారంగా కాకుండా, ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తూ యూజర్‌ చార్జీలు, ఇతర మార్గాలతో ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే ప్రభుత్వం నిర్దేశించిన విధానాలను జిల్లా మున్సిపాలిటీలు అమల్లో విఫలమవుతున్నాయి. హరితహారం విషయంలోనూ మన బల్దియాలు ప్రగతి సాధించలేదని తెలుస్తోంది.


  • కాలనీల్లో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ 

జిల్లాలోని మున్సిపాలిటీల్లో ముగురు నీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ సిస్టం ఉన్న వికారాబాద్‌లోనూ మురుగునీరు రోడ్లపై పారుతోంది. బీజేఆర్‌ చౌరస్తా మెయిన్‌ రోడ్డుపై మురుగు నీరు ప్రవహిస్తున్నా పురపాలిక పట్టించుకోవడం లేదు. పట్టణ మురుగునీరంతా ఆలంపల్లి శివారు సీవరేజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌(ఎస్టీపీ)కు చేర్చి అక్కడ వ్యర్థాలను వేరుచేసే ప్రక్రియ చేపడుతున్నారు. తాండూరు, పరిగి, కొడంగల్‌ పట్టణాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన లేఔట్లలో మినహా ఎక్కడా పూర్తిస్థాయిలో యూజీడీ సిస్టం లేదు. ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీటిని చెరువులు, వాగుల్లోకి మళ్లిస్తున్నారు. తాండూరులో గొల్లచెరువు, ఆదర్శనగర్‌ చెరువుల్లోకి మురుగు నీరు చేరుతోంది. పరిగిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. శ్రీనివాసకాలనీ నుంచి వస్తున్న మురుగునీరు సమీప వాగులోకి కలుస్తోంది. కొడంగల్‌లో మురుగునీరు ఊరు బయటకు చేరుతోంది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక దుర్వాసన వస్తోంది.


  • పనితీరు మెరుగైతేనే ఫలితాలు

నాలుగు మునిసిపాలిటీలు పారిశుధ్య నిర్వహణ, హరితహారం, ప్రజా సేవల్లో మెరుగుదల సాధిస్తేనే అవార్డు సాధనలో ఇతర మున్సిపాలిటీలతో పోటీపడే అవకాశం ఉంది. దానికి పాలక వర్గాలు, అధికారులు, సిబ్బంది సమష్టిగా పనిచేస్తేనే సాధ్యం. అవార్డు కోసమనే కాకుండా ప్రజలకు మెరుగైన పాలన, సేవలు అందిస్తేనే ప్రగతి సాధ్యం అని గుర్తించాల్సి ఉంది. వికారాబాద్‌, తాండూరు పాత మునిసిపాలిటీలు కాగా, పరిగి, కొడంగల్‌ కొత్తగా ఏర్పాటయ్యాయి. పాత పురపాలికలూ పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ఆశించిన ప్రగతి లక్ష్యాలు చేరలేదు. పట్టణ ప్రగతి ఆధారంగానే భవిష్యత్తులో  ప్రభుత్వం మునిసిపాలిటీలకు నిధులు కేటాయిస్తుంది.

Updated Date - 2022-05-16T04:59:52+05:30 IST