పట్టణ స్థానిక సంస్థలకు పర్యవేక్షణాధికారులు

ABN , First Publish Date - 2020-03-27T07:52:35+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో కరోనా వైరస్‌ పాజిటివ్‌, అనుమానిత కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పురపాతక శాఖ...

పట్టణ స్థానిక సంస్థలకు పర్యవేక్షణాధికారులు

  • కరోనా నియంత్రణ చర్యల అమలు వారి బాధ్యతే
  • 24 గంటలు నడిచే కంట్రోల్‌ రూముల ఏర్పాటు
  • ‘పాజిటివ్‌’ వ్యక్తులను కలిసినవారిని గుర్తించాలి
  • అవసరమైతే బలవంతంగా క్వారంటైన్‌ సెంటర్లకు తరలింపు..
  • తక్షణ స్పందనకు ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలు

అమరావతి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో కరోనా వైరస్‌ పాజిటివ్‌, అనుమానిత కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పురపాతక శాఖ పట్టణ స్థానిక సంస్థ (యు.ఎల్‌.బి.)ల్లో పర్యవేక్షణాధికారులను నియమించింది. వీరికి సహాయ సహకారాలు అందించాలని మున్సిపల్‌/నగర పంచాయతీ/కార్పొరేషన్‌ కమిషనర్లను ఆదేశించింది. 24 గంటలూ పని చేసే కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు, పాజిటివ్‌ కేసులతోపాటు అలాంటి వ్యక్తులకు సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించి క్వారంటైన్‌ సెంటర్లు, చికిత్సా కేంద్రాలకు తరలించడం, వివిధ శాఖలను సమన్వయపరచుకుంటూ కరోనా నిరోధక చర్యలు లోపరహితంగా జరిగేలా చూడడం ఈ పర్యవేక్షణాధికారుల ప్రధాన బాధ్యతలు.

  1. వలంటీర్ల ద్వారా ఇంటింటి ప్రచారమే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో బ్యానర్లు, మైకులు, హోర్డింగులు, కరపత్రాల ద్వారా ప్రచారం సాగించాలి.
  2. ప్రజలు ఎక్కడా గుంపులుగా గుమిగూడడాన్ని అనుమతించరాదు. వ్యాధి నివారణ చర్యల్లో లోటుపాట్లుంటే ఆ విషయాన్ని పై అధికారులకు వెంటనే తెలియజేయాలి.
  3. పారిశుద్ధ్య కార్మికులందరికీ మాస్కులు, చేతి గ్లవుజులు తదితర రక్షణ పరికరాలు, సామగ్రి సమకూర్చాలి.
  4. పాజిటివ్‌ కేసులు వెలుగు చూసిన చోట్ల వెంటనే ప్రజారోగ్య, పోలీస్‌ శాఖల ద్వారా సదరు ప్రదేశం చుట్టూ ఉన్న 3 కి.మీ. విస్తీర్ణాన్ని ‘కంటైన్‌మెంట్‌ జోన్‌’గా ప్రకటించాలి. తక్షణమే వ్యాధి నిరోధ చర్యలు అమలు జరిపించాలి. 
  5. అవసరమైనప్పుడు వెన్వెంటనే స్పందించేందుకు ‘ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీం (ఆర్‌ఆర్‌టీ)’లను ఏర్పాటు చేసుకోవాలి. 
  6. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని గుర్తించి, వారి శరీరంపై ఆ విషయాన్ని సూచించే స్టాంపులు వేయాలి. వారందరూ కచ్చితంగా 14 రోజులపాటు హోం క్వారెంటైన్‌లో ఉండేలా చూడాలి. ఎవరైనా అందుకు నిరాకరిస్తే బలవంతంగా క్వారెంటైన్‌ సెంటర్లకు తరలించాలి. 
  7. ప్రతి రోజూ సాయంత్రం 7 గంటలకు పురపాలక శాఖ ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించాలి.

Updated Date - 2020-03-27T07:52:35+05:30 IST