Abn logo
Feb 28 2021 @ 12:28PM

అర్బన్‌ కిసాన్‌... అదరహో!

చేతికి మట్టి అంటదు... అయినా పాలకూర పచ్చగా పెరిగి చేతికొస్తుంది. క్యాబేజీకి రోజు నీళ్లు పోయాల్సిన పని లేదు... అయినా వేపుడుగా మారేందుకు నిండుగా ఎదిగి నోరూరిస్తుంది. పొలంతో పనిలేదు... ఇంట్లోనో, మిద్దెపైనో, బాల్కనీలోనో నాలుగు పీవీసీ పైపులు పెట్టుకునే చోటు ఉంటే చాలు... మీ ఇంటి సేంద్రియ పంట మీరే పండించుకోవచ్చు. అదే ‘హైడ్రోపోనిక్‌ సిస్టమ్‌’ అర్బన్‌ వ్యవసాయం.


హైడ్రోపోనిక్‌...

మట్టి అవసరం లేకుండా నీటితోనే పంట పండించే విధానం. చదువుతుంటే కొత్తగా అనిపిస్తుంది చాలా మందికి. మట్టి లేకుండా విత్తనం ఎలా మొలుస్తుంది? పూత ఎలా వస్తుంది? అసలు మొక్క ప్రాణం ఎలా నిలుస్తుంది? ఇన్ని సందేహాలు వస్తాయి. కానీ హైడ్రోపోనిక్‌లో మట్టి లేకుండా కేవలం నీళ్లతోనే బంగారంలాంటి పంటలను పండించవచ్చు. అయినా ఇదేదో ఇప్పుడు కనిపెట్టింది కాదు. పూర్వం ఈజిప్టులో ఫారోల కాలంలోనే ఇలాంటి పంట పద్ధతి ఉండేదట. అప్పట్లో ఫారోలు కేవలం నీళ్లతో పండించిన పండ్లు, కూరగాయల రుచి చూశారని చరిత్రకారులు చెబుతారు. ప్రస్తుతం ఇరాక్‌లో ఉన్న ఆనాటి ‘హ్యాంగింగ్‌ గార్డెన్స్‌ ఆఫ్‌ బాబీలోన్‌’ కూడా హైడ్రోపోనిక్‌ పంట పొలాలే అయ్యుంటాయన్న వాదన కూడా ఉంది. 16వ శతాబ్దంలోనే ఇంగ్లాండుకు చెందిన ఫ్రాన్సిస్‌ బాకోన్‌ అనే తత్వవేత్త తాను రాసిన ‘ఎ నేచురల్‌ హిస్టరీ’ అనే పుస్తకంలో మట్టి లేకుండా మొక్కలు పెంచే విధానం గురించి వివరించారు. ఆ తరువాత కూడా మట్టి రహిత పంటలపై కొన్ని ప్రయోగాలు జరిగాయి. ఏదేమైనా ప్రాచీన పంట పద్ధతి మళ్లీ ఇప్పుడు సరికొత్తగా నేటి తరానికి పరిచయం అయ్యింది. 


మనదేశంలో ఇప్పుడిప్పుడే హైడ్రోపోనిక్‌ పద్ధతి ఊపందుకుంటోంది కానీ ఇప్పటికే ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్‌, ఇజ్రాయిల్‌ తదితర దేశాల్లోని రైతులు ఈ పద్ధతిలో సాగుచేస్తున్నారు. నేలపై పడినంత కష్టం ఈ విధానంలో అవసరం లేదు. ఎకరాల లెక్కన పొలం అక్కర్లేదు, కలుపు మొక్కలు, చీడ పీడల బాఽధలుండవు. బాల్కనీలో కూడా పండించుకోగలిగే సౌలభ్యత దీని సొంతం. చేతికి మట్టి అంటకుండా చక్కటి పంట అందుతుంది. ఈ పద్ధతిలో అన్ని రకాల పంటలు పండించుకోలేకపోయినా... కూరగాయలు, ఆకుకూరలకు మాత్రం ఇది సులభతరమైన విధానం. అందుకే హైడ్రోపోనిక్‌ పద్ధతిలో సాగుచేస్తూ చాలామంది పట్టణవాసులు అర్బన్‌ కిసాన్‌లుగా అవతారమెత్తుతున్నారు.  అందులోనూ ఇవి ఎలాంటి క్రిమిసంహారక మందులు వాడని సేంద్రియ పంటలు. అందుకే సెలబ్రిటీలు సైతం ఇలాంటి పంట విధానాలను ఇష్టపడుతున్నారు. 


పీవీసీ పైపులు, వెదురు బొంగులు

హైడ్రోపోనిక్‌ విధానంలో సాగు చేయాలనుకుంటే ఫైబర్‌, పీవీసీ లేదా వెదురు బొంగులను తెచ్చుకోవాలి. ఇప్పుడు హైడ్రోపోనిక్‌ సిస్టమ్‌కు కావాల్సినవి ఆన్‌లైన్‌లో, బయట దుకాణాలలో కూడా దొరుకుతున్నాయి. సీడ్‌ట్రాక్‌లను కొని వాటిలో కొబ్బరి పొట్టు లేదా నీళ్లు పోసి విత్తనాలు వేస్తే వారం రోజుల్లో మొలకెత్తుతాయి. ఆ ట్రేలను పైపులపై చేసిన రంధ్రాల్లో అమర్చాలి. ఆ పైపుల గుండా నిత్యం పోషకాలతో నిండిన నీరు ప్రవహిస్తూ ఉంటుంది. మొక్కలు పెరగడానికి అవసరమయ్యే పోషకాలను నీళ్లలో కలుపుతారు. ఆ నీళ్లే మొక్కల పెరుగుదలకు ఆధారం. ఆక్సిజన్‌, కార్బన్‌, హైడ్రోజన్‌ వంటివి మాత్రం మొక్క బయటి వాతావరణం నుంచే పీల్చుకుంటుంది. ఈ పోషకాలను రోజూ నీటిలో కలపాల్సిన అవసరం లేదు. నాలుగైదు రోజులకోసారి కలిపితే చాలు. పాలకూర, కొత్తిమీర, తోటకూర, గోంగూర, పుదీనా వంటి పంటలు 20 నుంచి 25 రోజుల్లో చేతికొస్తాయి. 


సుహాసిని ఆకుకూరల తోట

నిన్నటి తరం అందాల నటి సుహాసిని తన ఇంటి మిద్దెపైనే హైడ్రోపోనిక్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసింది. ఈ మధ్యనే ఓ వీడియో విడుదల చేసి అందులో తన ఆకుకూరల తోటను వివరించింది. హైడ్రోపోనిక్‌ విధానంలో ఆమె పాలకూర, గోంగూర, కొత్తిమీర... ఇలా చాలా ఆకుకూరల విత్తనాలను వేసింది. అవన్నీ త్వరలోనే కోతకు వచ్చేలా కనిపిస్తున్నాయి. చిన్నపాటి స్థలంలోనే ఏర్పాటు చేసినా... ఆ పంట చూడముచ్చటగా ఉంది. త్వరలో తాను భారీ స్థాయిలో ఈ విధానంలో ఆకుకూరలు, కూరగాయలు పెంచుతానని చెబుతోంది సుహాసిని. 


తెలుసుకోవాల్సినవి...

1. హైడ్రోపోనిక్‌లో ఆరు రకాలుగా పంటలు పండించవచ్చు. కనుక ఏ విధానంలో పండించాలో అవగాహన పెంచుకోవాలి. ప్రతి పద్ధతిలోనూ అన్ని రకాల పంటలు పండించలేం. 

2. కేవలం చదివి, చూసి ఈ పద్ధతిలో మొక్కలు పెంచడానికి సిద్ధమవకండి. దీనిపై కాస్త అధ్యయనం చేసి, అనుభవం ఉన్నవారి సలహాలతో వారి పర్యవేక్షణలో మొదటి అడుగు వేయండి. 

3. మొక్కలకు కావాల్సిన పోషకాలు ఏమి కావాలో, నీటి పీహెచ్‌ విలువలు ఎంత ఉండాలో తెలుసుకుని, ఎప్పటికప్పుడు చెక్‌ చేస్తూ ఉండాలి. 

4. హైడ్రోపోనిక్‌ పంటలను తొలిసారి పండించేటప్పుడు పాలకూర వంటి వాటిని ఎంచుకోవడం ఉత్తమం.  

5. తక్కువ స్థలం ఉంటే హైడ్రోపోనిక్‌ సెటప్‌ను నిలువుగా ఏర్పాటు చేసుకోండి. 

6. సూర్యరశ్మి తగలని ప్రదేశాలలో ఏర్పాటు చేస్తే అక్కడ ఎన్ని లైట్లు పెట్టాలి అన్న అంశాన్ని కూడా తెలుసుకోవాలి.

పాతిక రోజుల్లో కోతకి...

ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌, యోగా గురు శిల్పాశెట్టి ఆరోగ్యం విషయంలో కచ్చితంగా ఉంటుంది. ఆమె కూడా హైడ్రోపోనిక్‌ పద్ధతిలో రకరకాల ఆకుకూరలను పండిస్తోంది. ‘తినే ఆహారం స్వచ్ఛంగా ఉండాలన్నది నా అభిప్రాయం. నేను ఎలాంటి తిండి తింటున్నానో నాకు తెలియాలి అందుకే సొంతంగా కూరగాయలు పండిస్తున్నా’ అని చెబుతోంది శిల్పా. విత్తనాలు చల్లాక కేవలం 25 రోజుల్లోనే ఆకుకూరల్లాంటివి చేతికందుతాయని అంటోందీ సాగరకన్య. అంతేకాదు పెద్ద పెరటిలో రకరకాల కూరగాయలు కూడా సాధారణ పద్ధతిలో పండిస్తోంది. తన కుటుంబానికి స్వచ్ఛమైన సేంద్రియ ఆహారాన్ని అందివ్వడమే తన లక్ష్యమని, అందుకే ఇంటినే అఽధునాతన పద్ధతిలో పొలంగా మార్చానని చెప్పుకొచ్చింది శిల్పా. 

సామ్‌.. క్యాబేజీ పంట

కరోనా తెచ్చిన లాక్‌డౌన్‌ను చక్కగా వినియోగించుకుంది అక్కినేని వారి కోడలు సమంత. ఆ సమయంలోనే ఇంట్లో పంటలు పండించే విధానాలను తెలుసుకుంది. టెర్రస్‌ గార్డెనింగ్‌తో పాటూ హైడ్రోపోనిక్‌ పద్ధతిలో కూడా రకరకాల కూరగాయలు పండించింది. ఇంటి పంటను ఒక ఉద్యమంలా ప్రారంభించింది సామ్‌. తినే ఆహారం విలువ తెలియాలంటే ఇంట్లోనే పంటలు పండించాలని కోరుతూ ‘గ్రో విత్‌ మీ’ పేరుతో ప్రచారం మొదలుపెట్టింది. హైడ్రోపోనిక్‌ విధానంలో క్యాబేజీ, బ్రకోలీ, పాలకూర వంటివి పండించింది. టెర్రస్‌ గార్డెనింగ్‌లో క్యారెట్లు పండించింది. ‘ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్గానిక్‌ ఆహారాన్ని తినాలి... అందుకే ఈ ఇంటి పంటలు’ అని చాటింది సమంత. తనలా హైడ్రోపోనిక్‌ పద్ధతిలో మొక్కలు పెంచమని రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు ఛాలెంజ్‌ కూడా విసిరింది. దాన్ని స్వీకరించిన రకుల్‌ కూడా సామ్‌  బాటలోనే వెళుతోంది. 

Advertisement
Advertisement
Advertisement