అర్బన్‌ కీలుగుర్రాలు!

ABN , First Publish Date - 2022-05-18T07:45:24+05:30 IST

కీలుగుర్రం’ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు మీట తిప్పితే గాల్లో ఎగిరే కొయ్య గుర్రం మీద ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లిపోతుంటాడు

అర్బన్‌ కీలుగుర్రాలు!

భవిష్యత్తు నగరయానం తీరునే మార్చనున్న ఈ-వీటోల్స్‌

పైకప్పుపై వాలి ప్రయాణికులను తీసుకెళ్లే ఎయిర్‌ ట్యాక్సీలు

వీటిపై ప్రపంచవ్యాప్తంగా 10 స్టార్టప్‌ల ప్రయోగాలు

భారత్‌లో జెట్‌సెట్‌గో, ఈప్లేన్‌ కంపెనీల ముందంజ

2024 డిసెంబరు నాటికల్లా ప్రయాణికులను తిప్పుతాం

ఈప్లేన్‌ వ్యవస్థాపకుడు సత్యనారాయణన్‌ చక్రవర్తి వెల్లడి


కీలుగుర్రం’ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు మీట తిప్పితే గాల్లో ఎగిరే కొయ్య గుర్రం మీద  ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లిపోతుంటాడు! అరేబియన్‌ కథల్లో అల్లావుద్దీన్‌ ఆకాశయానానికి వాడిన మాయతివాచీ చూసిన వారెవ్వరికైనా.. ‘మన దగ్గరా అలాంటిది ఒకటి ఉంటే ఎంత బాగుంటుందో’ అని అనిపించకుండా ఉండదంటే అతిశయోక్తి కాదు!! అవి కథలు. కల్పితాలు. అన్నిటికీ మించి.. ఎంతో అందమైన ఊహలు. అలాంటి ఊహలను నిజం చేయడమే సైన్స్‌ సామర్థ్యం. ఆ కోణంలో సైన్స్‌ తన సత్తాను నిరూపించుకుంటూనే ఉంది. హెలికాప్టర్లతో దగ్గరి దూరాలను.. విమానాలతో సుదీర్ఘ యానాలను, రాకెట్లతో అంతరిక్ష యాత్రలను నిజం చేసిన సైన్స్‌ ఇప్పుడు నగరయానాన్ని సులభతరం చేసేందుకు ‘ఎలక్ట్రిక్‌ ఎయిర్‌క్రా్‌ఫ్ట’లను సిద్ధం చేస్తోంది! ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో(పీక్‌ టైమ్స్‌) ట్రాఫిక్‌ ఎంత దారుణంగా ఉంటుందో తెలిసిందే.


ఆ సమయంలో ఐదారు కిలోమీటర్ల దూరం వెళ్లాలన్నా గంట-రెండు గంటలు పడుతుంది. ఆ టైమ్‌లో ‘హాయిగా ఆకాశంలో ఎగిరిపోతే ఎంత బాగుంటుంది’ అని చాలా మంది అనుకుంటుంటారు. అలాంటివారి కోసమే ప్రపంచవ్యాప్తంగా పలువు రు పెట్టుబడిదారులు వందల కోట్ల డాలర్లు ‘ఈ-వీటోల్‌’ ప్రాజెక్టుపై కుమ్మరిస్తున్నారు. ఈ-వీటోల్‌ అంటే ‘ఎలక్ట్రిక్‌ వర్టికల్‌ టేకాఫ్స్‌ అండ్‌ లాండింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌’ అని అర్థం. ఇవి యాప్‌ల్లో బుక్‌ చేసే ఆటోలు, ట్యాక్సీల్లాంటివే. కాకపోతే ఎయిర్‌ట్యాక్సీలు. ఈ విద్యుత్‌ విమానాలు నేరుగా మన ఇంటి పైకప్పుపై ల్యాండ్‌ అవుతాయి. దాంట్లో మనం ఎక్కి కూర్చోగానే నిట్టనిలువునా పైకి లేచి గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి గమ్యస్థానానికి చేరుస్తాయి. చార్జీలు మాత్రం ట్యాక్సీకన్నా 2-3 రెట్లు ఎక్కువ ఉంటాయి సుమా! ‘చార్జీ ఎంతయినా పర్లేదు.. అర్జెంటుగా వెళ్లాలి’ అనుకునేవారికి ఇవి చాలా ఉపయోగపడతాయి. భవిష్యత్తు నగరయానం వీటిపైనే ఆధారపడి ఉందని గూగుల్‌, లింక్డ్‌ఇన్‌, జింగా, ఉబెర్‌, ఎయిర్‌బస్‌, బోయింగ్‌, హోండా వంటి దిగ్గజ కంపెనీల అధినేతలు విశ్వసిస్తున్నారు. అందుకే మనదేశానికి చెందిన కార్పొరేట్‌ చార్టర్‌ జెట్‌ కంపెనీ ‘జెట్‌సెట్‌గో’ సంస్థ ఈ-వీటోల్స్‌లో 20 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతోంది.


ఐఐటీ మద్రాస్‌కు చెం దిన ‘ఈప్లేన్‌ కంపెనీ’ అనే స్టార్టప్‌ కూడా తాను అభివృద్ధి చేసిన ప్రోటోటైప్‌ ఈవీటోల్‌ను దుబాయ్‌లో పరీక్షించింది. ఇవే కాదు.. ప్రపంచవ్యాప్తంగా 10 అంతర్జాతీయ స్టార్టప్‌ సంస్థలు దాదాపు వెయ్యికోట్ల డాలర్లను (దాదాపు రూ.77 వేల కోట్లు) ఈవీటోల్స్‌ ఆర్‌ అండ్‌ డీ (పరిశోధన, అభివృద్ధి) కోసం కేటాయిస్తున్నాయి. లారీపేజ్‌, హాఫ్‌మన్‌ వంటివారు, ఎయిర్‌బస్‌ వంటి కంపెనీలు వీటిలో పెట్టుబడులు పెట్టడం గమనార్హం. మన పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సిందియా ఇటీవల అమెరికా, కెనడా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత వీటి గురించి మాట్లాడారు. భారత మార్కెట్‌లో ఈవీటోల్స్‌ లాంచ్‌ను పరిశీలించాలని అమెరికా స్టార్టప్‌ సంస్థ బీటా టెక్నాలజీ్‌సను కోరినట్టు తెలిపారు.


ఈప్లేన్‌.. ఇద్దరే!

చైన్నైకు చెందిన స్టార్టప్‌ సంస్థ ‘ఈప్లేన్‌ కంపెనీ’ విద్యుత్తు విమానాన్ని అక్కడి ఇద్దరు శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ గాలిలో అరకిలోమీటర్‌ నుంచి 2 కిలోమీటర్ల ఎత్తున గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 200 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరికల్లా ఈప్లేన్‌ తొలి కార్గో వీటోల్‌ ప్రయాణానికి సిద్ధమవుతుందని దీని వ్యవస్థాపకుల్లో ఒకరైన సత్యనారాయణన్‌ చక్రవర్తి తెలిపారు. 2024 డిసెంబరు నాటికి ప్రయాణికులను చేరవేసే వీటోల్‌ అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ విద్యుత్తు విమానాల ధర రూ.16-39 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నట్టు జెట్‌సెట్‌గో వ్యవస్థాపకురాలు కనికా టేక్రివాల్‌ అభిప్రాయపడ్డారు. చార్జీలు మాత్రం ఉబెర్‌ కన్నా రెట్టింపు ఉంటాయని.. అయితే, ట్యాక్సీలతో పోలిస్తే వీటిలో ప్రయాణ సమయం పదో వంతుకు తగ్గిపోతుందని ఆమె వివరించారు. అన్నట్టు.. క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ కూడా ఈ జెట్‌సెట్‌గో కంపెనీలో ఒక పెట్టుబడిదారు.

Updated Date - 2022-05-18T07:45:24+05:30 IST