Abn logo
Sep 26 2021 @ 00:00AM

లాభాల బాటలో అర్బన్‌ బ్యాంకు

మాట్లాడుతున్న ఇన్‌చార్జి చైర్మన్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌

 - అనివార్య కారణాలతో పాలకవర్గ ఎన్నికలకు ఆలస్యం

- అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌ 

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 26: కరీంనగర్‌ సహకార అర్బన్‌ బ్యాంకు లాభాలబాటలో పయనించడమే కాకుండా కార్పొరేట్‌ హంగులతో ఖాతాదారులు, సభ్యులకు మెరుగైన సేవలందిస్తోందని  అదనపు కలెక్టర్‌, బ్యాంకు పర్సన్‌ ఇన్‌చార్జి చైర్మన్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన బ్యాంకు మహా జనసభకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకవర్గం, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ఖాతాదారులు, సభ్యుల సహకారంతో బ్యాంకు లాభాల్లో ఉందని అన్నారు. మొదటిసారి బ్యాంకు కోటి 75 లక్షల రూపాయల లాభాన్ని ఆర్జించడం అభినందనీయమని చెప్పారు. బ్యాంకు పాలకవర్గం బ్యాంకు అభివృద్ధి కోసం కృషిచేస్తుందని అన్నారు. పాలకవర్గం ఎన్నికలకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని, కోర్టు కేసులు, కొవిడ్‌ వంటి కారణాలతో ఆలస్యమవుతోందని చెప్పారు. ఇటీవల బ్యాంకు సభ్యుల వివరాల నివేదికను కోర్టుకు సమర్పించామని, కోర్టు అనుమతితో త్వరలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయని చెప్పారు. బ్యాంకును మరింత అభివృద్ధి చేసి ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలందించాల్సిన బాధ్యత పాలకవర్గం, అధికారులు, సిబ్బందిపై ఉందని చెప్పారు. వాటాదారులు, ఖాతాదారులు కూడా బ్యాంకు అభివృద్ధికి సహకరించాలని కోరారు. సభ్యుల కోరిక మేరకు త్వరలోనే ఏటీఎం సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సీఈవో నునుగొండ శ్రీనివాస్‌ ప్రవేశపెట్టిన 2021-21 ఆర్థిక సంవత్సరం ఆడిట్‌ రిపోర్టును, అంచనా బడ్జెట్‌ను ఆమోదించారు. కార్యక్రమంలో పాలకవర్గసభ్యులు అర్ష మల్లేశం, మున్ననూరు చంద్రశేఖర్‌, కర్ర సూర్యశేఖర్‌, దిండిగాల మహేశ్‌, ఎడబోయిన శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల బ్రాంచి మేనేజర్‌ ఎలుక సుధాకర్‌తోపాటు బ్యాంకు సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బ్యాంకు మాజీ చైర్మన్‌ కర్ర రాజశేఖర్‌, మాజీ పాలకవర్గసభ్యుడు తాటికొండ భాస్కర్‌, సభ్యులు మడుపు మోహన్‌, సిహెచ్‌.జనార్ధన్‌, కల్యాడపు ఆగయ్య తదితరులు చేసిన సూచనలను పరిశీలించి చర్యలు చేపడతామని అన్నారు