యూపీఎస్సీ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-09-18T06:46:42+05:30 IST

యూపీఎస్సీ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు

యూపీఎస్సీ పరీక్షలకు పక్కా  ఏర్పాట్లు
వీడియో కాన్ఫరెన్స్‌లో యూపీఎస్సీ అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ నివాస్‌

కమిషన్‌ అధికారులతో కలెక్టర్‌ జె.నివాస్‌ వీడియో కాన్ఫరెన్స్‌

వన్‌టౌన్‌, సెప్టెంబరు 17 : యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో అక్టోబరు 10న నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ నివాస్‌ చెప్పారు. 29 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో 13,674 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రతినిధులు శుక్రవారం దేశవ్యాప్తంగా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్థానిక ఆర్‌అండ్‌బీ భవనంలోని ఎన్‌ఐసీ నుంచి కలెక్టర్‌ నివాస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 29 పరీక్షా కేంద్రాలు గుర్తించామని, ప్రత్యేక అధికారులను ఎంపిక చేసి కమిషన్‌ అనుమతి తీసుకున్నామని చెప్పారు. 29 మంది లైజన్‌ అధికారులను, 101 మంది అసిస్టెంట్‌ సూపర్‌వైజర్లను, 581 మంది ఇన్విజిలేటర్లను నియమించామని పేర్కొన్నారు. 57 మంది ప్రత్యేక ప్రతిభావంతుల కోసం ఏర్పాట్లు చేశామని, వీరికి పటమటలోని కృష్ణవేణి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు జరిగాయన్నారు. పరీక్ష రోజున ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. యూపీఎస్సీ ప్రతినిధులు మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంచాలని, జిరాక్స్‌, నెట్‌ సెంటర్లను పరీక్షకు అర్థగంట ముందే మూసివేయించాలన్నారు. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద బందోబస్తు ఏర్పాటుచేసి, ఆర్మ్‌డ్‌ పోలీసుల సహకారంతో ప్రశ్నాపత్రాలను తరలించాలన్నారు. అక్టోబరు 9న పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లను ముఖ్య అధికారులు పరిశీలించాలని తెలిపారు. వైద్య ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, కొవిడ్‌ అనుమానితులకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. 10వ తేదీ ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు రెండో  పరీక్ష జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, కలెక్టరేట్‌ ఏవో వి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-18T06:46:42+05:30 IST