ఉప్పల్‌ భగాయత్‌ రూ.474 కోట్లు

ABN , First Publish Date - 2021-12-04T08:14:34+05:30 IST

ఉప్పల్‌ భగాయత్‌ మూడో దశ ప్లాట్ల ఈ-వేలంలో హెచ్‌ఎండీఏకు రూ.474.61 కోట్ల ఆదాయం వచ్చింది.

ఉప్పల్‌ భగాయత్‌ రూ.474 కోట్లు

  • ఈ-వేలంలో 44 ప్లాట్లకు 39 మాత్రమే కొనుగోలు
  • పెద్ద ప్లాట్లకు ముందుకురాని డెవలపర్లు
  • చదరపు గజానికి సగటు ధర రూ.55,859 


హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): ఉప్పల్‌ భగాయత్‌ మూడో దశ ప్లాట్ల ఈ-వేలంలో హెచ్‌ఎండీఏకు రూ.474.61 కోట్ల ఆదాయం వచ్చింది. హెచ్‌ఎండీఏ 44 ప్లాట్లకు వేలం వేయగా రెండు రోజుల్లో 39 ప్లాట్లే అమ్ముడుపోయాయి. చిన్న ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపిన డెవలపర్లు, బిడ్డర్లు భారీ విస్తీర్ణంలో ఉన్న 5 ప్లాట్లను కొనేందుకు ఆసక్తి చూపలేదు. ఈ-వేలంలో తొలి రోజు చదరపు గజం ధర అత్యధికంగా రూ.1.01 లక్షలు పలికింది. రెండో రోజు చదరపు గజం అత్యధికంగా రూ.72 వేలు, అత్యల్పంగా రూ.36 వేలు పలికింది. బిడ్డర్లు అప్‌సెట్‌ ధర కంటే రూ.1,000 మాత్రమే ఎక్కువ కోట్‌ చేశారు. రెండేళ్లతో పోల్చితే చదరపు గజం సగటున 5.1% మాత్రమే పెరిగిందని ఓ అధికారి తెలిపారు. ఫేజ్‌-2, ఫేజ్‌-3 లే అవుట్లలోని మల్టీపర్పస్‌ యూజ్‌ జోన్‌, కమర్షియల్‌ యూజ్‌ జోన్‌లో భారీ విస్తీర్ణంలో గల 21 ప్లాట్లకు ఎంఎ్‌సటీసీ ఈ కామర్స్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ-వేలం నిర్వహించారు. ఉదయం తొలి విడత 11 ప్లాట్లకు గాను 10 ప్లాట్లు అమ్ముడయ్యాయి. దీంతో రూ.229.45 కోట్ల ఆదాయం వచ్చింది. మధ్యాహ్నం రెండో విడత వేలంలో 10 ప్లాట్లు ఉండగా.. 6 ప్లాట్లే అమ్ముడు పోయాయి. రూ.103.54 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తానికి 21 ప్లాట్లలో 16 ప్లాట్లను విక్రయించడం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.333 కోట్ల ఆదాయం వచ్చింది. 


మిగిలిపోయిన పెద్ద ప్లాట్లు

ఉప్పల్‌ భగాయత్‌లో రెండు రోజుల వేలంలో 5 ప్లాట్లు మిగిలిపోయాయి. ఫేజ్‌-3 లే-అవుట్‌లో ఒక్కొక్కటి 2-4 ఎకరాలు చొప్పున 5 పాట్లు చేశారు. ఇందులో 61వ నెంబర్‌ గల 11,277 చదరపు గజాల ప్లాట్‌ మాత్రమే గజానికి రూ.36 వేలు చొప్పున అమ్ముడుపోయింది. మిగిలిన 4 ప్లాట్లు మిగిలిపోయాయి. ఫేజ్‌-2 లే-అవుట్‌లో 68, 76, 77, సీ1, సీ2, సీ4 ప్లాట్లు అమ్ముడుపోయాయి. సీ3 ప్లాట్‌కు పొరపాటు బిడ్డింగ్‌ వల్ల రద్దయింది. భారీ విస్తీర్ణంలోని పెద్ద ప్లాట్లను కొనుగోలు చేయడానికి డెవలపర్లు, రియల్టర్లు ఆసక్తి చూపలేదు. మల్టీపర్పస్‌ యూజ్‌ జోన్‌లోని ఈ ప్లాట్లలో ఎలాంటి నిర్మాణాలైనా చేపట్టేందుకు అవకాశం కల్పించినా డెవలపర్లు ఆసక్తి చూపలేదు. ఫేజ్‌-1, ఫేజ్‌-2, ఫేజ్‌-3 లే-అవుట్‌లో మొత్తం 39 ప్లాట్లను ఈ-వేలం ద్వారా కొనుగోలు చేశారు. మొత్తం 82,565 చదరపు గజాలను విక్రయించడం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.474.61 కోట్ల ఆదాయం వచ్చింది. మూడో దశ ఈ-వేలంలో చదరపు గజం సగటు ధర రూ.55,859గా నిర్ధారణ అయింది.


కొంపముంచిన ఈ-వేలం

వేలల్లో పలికే గజం ధర రూ.3.67 లక్షలు!

ఉప్పల్‌ భగాయత్‌లో ప్లాట్ల ఈ-వేలం ఓ కొనుగోలుదారుడి కొంప ముంచింది. సీ3 ప్లాట్‌ ధరను చదరపు గజానికి రూ.36,700కు బిడ్‌ వేయాలనుకున్న ఓ వ్యక్తి పొరపాటున ‘0’ ఎక్కువ కొట్టడంతో బిడ్‌ రూ.3,67,000కు దాఖలు చేసినట్లు నమోదైంది. దీంతో రూ.13 కోట్లలోపు దక్కాల్సిన 3440 చదరపు గజాల ప్లాట్‌ ధర ఏకంగా రూ.126.24 కోట్లకు చేరింది. దీంతో లబోదిబోమన్న లబ్ధిదారుడు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ బిడ్‌ను రద్దు చేశారు. అయితే, సదరు వ్యక్తి చెల్లించిన రూ.15 లక్షల ధరావత్‌ (ఈఎండీ)ను తిరిగి ఇచ్చేది లేదన్నారు.



Updated Date - 2021-12-04T08:14:34+05:30 IST