‘పట్టు’ దొరుకుతుందా

ABN , First Publish Date - 2022-08-14T06:45:09+05:30 IST

ఉప్పాడ అంటే పట్టు చీరలు.. పెద్దాపురం అంటే పట్టు లుంగీలు, చీరలు, కండువాలు.. ఈ ఉత్పత్తులకు పెట్టింది పేరైన ఈ రెండు ప్రాంతాలకు వీటి కోసం ఎక్కడెక్కడినుంచో వస్త్ర ప్రియులు వచ్చి కొనుగోళ్లు చేస్తుంటారు. వీటిని ధరించడంపై మక్కువ చూపుతారు. ఇకపై ఈ రెండు ఉత్పత్తులకు జాతీయస్థాయిలో ఆదరణ లభించేలా కేంద్రం చర్యలు చేపట్టనుంది.

‘పట్టు’ దొరుకుతుందా
ఉప్పాడ పట్టు చీరలు

  • -జిల్లాలో ఉప్పాడ పట్టు చీరలు, పెద్దాపురం సిల్క్‌ ఉత్పత్తులకు మంచిరోజులు
  • -కేంద్రం వన్‌ డిస్ట్రిక్ట్‌-వన్‌ ప్రొడక్ట్‌ పథకానికి ఈ రెండు ఉత్పత్తులు సిఫార్సు
  • -పలు స్థానిక ఉత్పత్తులు అధ్యయనం చేసి ఈరెండింటిని ఎంపిక చేసిన అధికారులు
  • -ఈరెండు నేత ఉత్పత్తులకు ఇకపై జాతీయస్థాయిలో ఊతం 
  • -త్వరలో ఆన్‌లైన్‌లో వీటి విక్రయాలకు మద్దతు ఇవ్వనున్న కేంద్రం
  • -ఉప్పాడలో పది మంది వ్యాపారులు, పెద్దాపురంలో ఓ చేనేత సంఘానికి స్థానం

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

ఉప్పాడ అంటే పట్టు చీరలు.. పెద్దాపురం అంటే పట్టు లుంగీలు, చీరలు, కండువాలు.. ఈ ఉత్పత్తులకు పెట్టింది పేరైన ఈ రెండు ప్రాంతాలకు వీటి కోసం ఎక్కడెక్కడినుంచో వస్త్ర ప్రియులు వచ్చి కొనుగోళ్లు చేస్తుంటారు. వీటిని ధరించడంపై మక్కువ చూపుతారు. ఇకపై ఈ రెండు ఉత్పత్తులకు జాతీయస్థాయిలో ఆదరణ లభించేలా కేంద్రం చర్యలు చేపట్టనుంది. పట్టు చీరలు, ఇతర సిల్క్‌ వస్త్రాలకు దేశం మొత్తం డిమాండ్‌ కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వన్‌ డిస్ట్రిక్ట్‌-వన్‌ ప్రొడక్ట్‌ కింద త్వరలో ఈరెండు ఉత్పత్తులకు మార్కెటింగ్‌ చేయనుంది. ఈ మేరకు జిల్లా నుంచి ఈ రెండింటిని ఎంపిక చేస్తూ ప్రతిపాదనలను అధికారులు పంపించారు. త్వరలో వీటిని కేంద్రం ఆన్‌లైన్‌ ద్వారా దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. జిల్లాలో యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ పట్టు చీరలకు ప్రసిద్ధి. ఏటా రూ.10కోట్ల చీరల వ్యాపారం జరుగుతోంది. 

మంచిరోజులు వచ్చినట్లేనా...

దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో చిన్నచిన్న ఉత్పత్తులకు ఎంతో డిమాండ్‌ ఉంది. పెద్దగా పెట్టుబడి లేక, ప్రోత్సాహం దక్కక అనేకమంది చిన్నచిన్న వ్యాపారులు, చేనేత సంఘాలు స్థానికంగానే తమ ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. ఇటువంటి వాటికి ఊతమివ్వడానికి కేంద్రం నిర్ణయించింది. వన్‌ డిస్ట్రిక్ట్‌-వన్‌ ప్రొడక్ట్‌ పేరుతో దేశవ్యాప్తంగా ఇటువంటి వాటిని ఎంపిక చేసి ఒక వేదికగా ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. తద్వారా స్థానిక ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మార్కెటింగ్‌ కల్పించనుంది. అందులోభాగంగా రాష్ట్రాలనుంచి ఈ ప్రతిపాదనలు పంపాలని కేంద్రం కోరింది. దీంతో జిల్లా చేనేత, పరిశ్రమలశాఖలు జిల్లాలోని 24 మండలాల్లో ప్రఖ్యాత ఉత్పత్తుల గురించి ఆరాతీశాయి. చివరకు ఉప్పాడ చేనేత, పెద్దాపురం సిల్క్‌ ఉత్పత్తులకు ఇందుకు అనువుగా ఉంటాయని గుర్తించాయి. ఈ మేరకు వన్‌ డిస్ట్రిక్ట్‌-వన్‌ ప్రొడక్ట్‌ కింద ఎంపిక చేయడానికి వీలుగా సిఫార్సులు పంపాయి. త్వరలో వీటిని కేంద్రం లాంఛనప్రాయంగా ఆమోదించనుంది. వాస్తవానికి ఉప్పాడ చీరలు అంటే తెలుగురాష్ట్రాల్లో తెలియని వారుండరు. అనేక ప్రాంతాలనుంచి ప్రముఖులు సైతం తమ కుటుంబాల్లో వివాహాలకోసం ఉప్పాడకు వచ్చి చీరలు కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ 150 వరకు దుకాణాలున్నాయి. ఇవన్నీ కలిపి ఏడాదికి రూ.10 కోట్ల వరకు వ్యాపారం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో వ్యాపారులు వాట్సాప్‌ ఆధారంగా బిజినెస్‌ చేస్తున్నారు. వీటికి జాతీయస్థాయిలో మరింత మార్కెటింగ్‌ కల్పిస్తే ఆదరణ అద్భుతంగా ఉంటుందని అధికారులు సిఫార్సు చేశారు. అటు పెద్దాపురం సిల్క్‌ ఉత్పత్తులకు పెట్టింది పేరు. ఇక్కడ పట్టు లుంగీలు, పట్టు చీరలు, పట్టు కండువాలు దొరుకుతాయి. కానీ ఆదరణ లేక వ్యాపారాలు కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో ఉప్పాడ పట్టు చీరలు, పెద్దాపురం పట్టు లుంగీలు, కడువాలు, చీరలకు జాతీయస్థాయిలో మార్కెటింగ్‌ కల్పించడానికి రంగం సిద్ధమవుతోంది. అందులోభాగంగా ఉప్పాడనుంచి పదిమంది వ్యాపారులను గుర్తించి జాబితాను కేంద్రానికి అధికారులు పంపనున్నారు. వీరితో ఇప్పటికే సంప్రదింపులు జరిగాయి. మరోపక్క పెద్దాపురంనుంచి పట్టు ఉత్పత్తులు విక్రయించే ఓ చేనేత సంఘాన్ని గుర్తించారు. వీరి వివరాలు, ఉత్పత్తులు ఫొటోలు, వీడియోలను త్వరలో కేంద్రానికి పంపనున్నారు. ఇలా జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే స్థానిక ఉత్పత్తులను త్వరలో ఆన్‌లైన్‌లో కేంద్ర చేనేత, జౌళి, వాణిజ్య శాఖలు ఉంచనున్నాయి. తద్వారా ఈ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా అంతా కొనుగోలు చేసేలా కేంద్రం మార్కెటింగ్‌ చేయనుంది. వన్‌ డిస్ట్రిక్ట్‌-వన్‌ ప్రొడక్ట్‌ కింద ఎంపికైన ఉత్పత్తులకు కేంద్రం పలు పథకాల ద్వారా సదరు వ్యాపారులకు వివిథ పథకాల ద్వారా, బ్యాంకుల ద్వారా కూడా ఆర్థికంగా తోడ్పాటు కూడా అందించనుంది. ఉప్పాడ పట్టు చీరలను కొంతకాలంగా ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ తదితర ఈ కామర్స్‌ సంస్థలు ఆన్‌లైన్‌లో విక్రయాలు జరుపుతున్నా పెద్దగా వ్యాపారం పుంజుకోలేదు. కానీ కేంద్రం మాత్రం ఉప్పాడ, పెద్దాపురం పట్టు ఉత్పత్తులకు మార్కెటింగ్‌తోపాటు అన్ని విధాలా తోడ్పాటు కల్పించి ఎగుమతి కేంద్రాలుగా ఈ ప్రాంతాలను తీర్చిదిద్దనుంది.

Updated Date - 2022-08-14T06:45:09+05:30 IST