నీరుంది.. నేల తడవదు

ABN , First Publish Date - 2021-04-11T09:44:44+05:30 IST

కొత్తగా ఎత్తిపోతల పథకాలు(లిఫ్టులు), మట్టి పనులు చేపడితే ఆశించిన మేరకు కాసులు వెనకేసుకోవచ్చు. ప్రజా ప్రతినిధులకూ పర్సంటేజీలు అందుతాయి.

నీరుంది.. నేల తడవదు

ముఖ్యమంత్రి సొంత జిల్లాలో రైతుల దైన్యం


(కడప-ఆంధ్రజ్యోతి)

కొత్తగా ఎత్తిపోతల పథకాలు(లిఫ్టులు), మట్టి పనులు చేపడితే ఆశించిన మేరకు కాసులు వెనకేసుకోవచ్చు. ప్రజా ప్రతినిధులకూ పర్సంటేజీలు అందుతాయి. ఇందుకు భిన్నంగా పాత ప్రాజెక్టుల్లో అసంపూర్తిగా మిగిలిన పనులు చేపడితే కాసులు ఎక్కువ మిగిలే అవకాశం లేదు. దీంతోపాటు రిస్క్‌ కూడా ఎక్కువ. అందుకే కొత్త ప్రాజెక్టులపైనే మక్కువ చూపుతున్నారని, కొద్దిపాటి నిధులతో పంటకాలువలను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు శ్రద్ధ చూపడం లేదని రైతులు, ఇంజనీర్లు విమర్శిస్తున్నారు. కరువు ప్రాంతం రాయలసీమలో పంటకాలువల పనులు ఎంతోకాలం నుంచి అసంపూర్తిగా మిగలడానికి కారణం ఇదే అంటున్నారు.


కడప జిల్లాలోని జలాశయాల్లో గతేడాది 66.78 టీఎంసీల నీరు నిల్వ చేశారు. ఆ నీటిని చేలకు మళ్లించేందుకు సరైన పంట కాలువలు లేవు. పంటకాలువల పనులకు రూ.252కోట్ల నిధులిస్తే 2.38 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చని ఓ ఇంజనీరు పేర్కొన్నారు. రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం కింద నూతన ప్రాజెక్టుకు రూ.వేల కోట్లు మంజూరు చేస్తున్న ప్రభుత్వానికి ఆ కాస్త నిధులు పెద్ద లెక్కకాదు. అయినా పాలకులు దృష్టి పెట్టడం లేదు.


గతేడాది జలాశయాలు నిండినా..

కడప జిల్లాలో గాలేరు-నగరి ప్రాజెక్టు పరిఽధిలో నిర్మించిన గండికోట, చిత్రావతి, పైడిపాలెం, వామికొండ, సర్వరాయసాగర్‌ జలాశయాలు, పెన్నా నదిపై నిర్మించిన మైలవరం రిజర్వాయర్‌, ఎన్టీఆర్‌ తెలుగుగంగ ప్రాజెక్టు కింద నిర్మించిన బ్రహ్మంసాగర్‌, ఎస్‌ఆర్‌-1, ఎస్‌ఆర్‌-2తో పాటు జిల్లాలో చిన్నాపెద్ద ప్రాజెక్టుల మొత్తం సామర్థ్యం 84.217 టీఎంసీలు. గతేడాది భారీ వరదలకు బ్రహ్మంసాగర్‌ మినహా మిగిలిన జలాశయాలు పూర్తిగా నింపారు. అందులో 17.43 టీఎంసీలు మాత్రమే ఈ ఏడా ది వినియోగించారు. ప్రస్తుతం 66.783 టీఎంసీలు నిల్వ ఉన్నా యి. డెడ్‌ స్టోరేజీ 6.280 టీఎంసీలు పోను, ఇంకా 60.503 టీఎంసీలు వినియోగించుకోవచ్చు. అందులో 60 శాతం (36.423 టీఎంసీలు) వాడుకున్నా సరాసరి 3.60 లక్షల ఎకరాలకుపైగా సాగునీరు ఇవ్వొచ్చు. అయితే, అందుకు పంటకాలువలు సరిగా లేవు.


బ్రహ్మంసాగర్‌కు 46 కోట్లు అడిగితే..

 బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌ సామర్థ్యం 17 టీఎంసీలు. 2007లో తొలిసారిగా 13 టీఎంసీలు నింపితే లీకేజీలు రావడంతో 10-12 టీఎంసీలకు మించి నింపడం లేదు. రిజర్వాయర్‌ను పరిశీలించిన నిపుణుల కమిటీ.. 216.5 మీటర్ల నుంచి దిగువ బాటమ్‌ లెవల్‌(కటాఫ్‌ వాల్‌) వరకు 100 మీటర్ల పొడవు, 54 మీటర్ల ఎత్తులో ‘ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ డయాఫ్రం వాల్‌’, ఆనకట్ట బయట వైపున శాండ్‌ ఫిల్టర్‌ నిర్మించాలని సూచించింది. ఇందుకు రూ.46 కోట్లు కావాలని ప్రతిపాదనపంపితే ప్రభుత్వం స్పందించలేదు. 


గాలేరు-నగరి ప్రాజెక్టులో భాగంగా 2004-05లో రూ.301.84 కోట్లతో 3.06 టీఎంసీల సామర్థ్యంతో సర్వరాయసాగర్‌, 1.60 టీఎంసీల సామర్థ్యంతో వామికొండ జలాశయాలు, వీటి కింద 35 వేల ఎకరాలకు సాగునీరు అందించే మెయిన్‌ కెనాల్స్‌, మైనర్‌, సబ్‌ మైనర్‌ కెనాల్స్‌, ఫీల్డ్‌ చానల్స్‌, డిస్ట్రిబ్యూటర్స్‌ నిర్మాణాలు చేపట్టి రూ.261.74కోట్లు ఖర్చు చేశారు. కాంట్రాక్టరు ప్రీక్లోజర్‌కు ఆమోదించడంతో బ్యాలెన్స్‌ వర్క్స్‌కు రూ.158 కోట్లు కావాలని ప్రతిపాదన పంపారు. 830 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉంది. 


‘పైడిపాలెం’కు 705 కోట్లు వెచ్చించినా..

గండికోట జలాశయం నుంచి 6 టీఎంసీలు ఎత్తిపోసి పులివెందుల నియోజకవర్గంలో 47,500 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని పైడిపాలెం రిజర్వాయర్‌, కాలువలు చేపట్టారు. రిజర్వాయర్‌లో 6 టీఎంసీలు నింపినా అసంపూర్తి పంట కాలువల వల్ల ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేని పరిస్థితి. రూ.742 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రూ.705 కోట్లు ఖర్చు చేశారు. బ్యాలెన్స్‌ పనులకు రూ.34.6 కోట్లకు అనుమతి వచ్చింది. రూ.29 కోట్లకు టెండర్లు పిలిచినా పనులు మొదలవలేదు. 


చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి 45 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చే పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌ (పీబీసీ) ఆధునికీకరణ పనులను రూ.280 కోట్లతో చేపట్టి రూ.198 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. తర్వాత ఎక్కడి పనులు అక్కడే వదిలేశారు. లింగాల కెనాల్‌దీ దాదాపు ఇదే పరిస్థితి.


కొత్త ప్రాజెక్టులు సరే.. పాతవి పట్టవా..?

శ్రీశైలం జలాశయం ఉపరితలం నుంచి వరద ఉన్నప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ వరద జలాలను తీసుకోవాలని రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్‌కు రూపకల్పన చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, ఎస్‌ఆర్‌ఎంసీ, ఎస్‌ఆర్‌బీసీ, జీఎన్‌ఎ్‌సఎ్‌స వరద కాలువ సామర్థ్యం పెంపు, కుందూ నది విస్తరణ కోసం దాదాపు రూ.33 వేల కోట్లతో వివిధ ప్రాజెక్టులకు సిద్ధం చేశారు. ఇప్పటికే కర్నూలు, కడప జిల్లాలో రూ.10,448.58 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు టెండర్లు కూడా పిలిచారు. పలు నూతన ఎత్తిపోతల పథకాలకు డీపీఆర్‌లు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. కానీ, కాస్త నిధులతో లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉన్న పాత ప్రాజెక్టులను విస్మరించడం విమర్శలకు తావిస్తోంది. 


గండికోటలో పూర్తి సామర్థ్యం 26.85 టీఎంసీలు నిల్వ చేయడానికి తాళ్లప్రొద్దుటూరు, కొండాపురం రైతులను కన్నీళ్లు పెట్టించారు. ‘ఆరు నెలలు గడువివ్వండి.. మేమే ఊళ్లు ఖాళీ చేసి వెళ్తాం’ అంటూ కాళ్లావేళ్ల పడి బతిమలాడినా, రోడ్డెక్కి ఆందోళన చేసినా ఏలికలు కనికరించలేదు. కొంచెంకొంచెంగా నీటిని నింపి ఊళ్లు ముంచేశారు. ఇళ్లు నీటమునిగి గొడ్డుగోద, పిల్లపాపలతో రైతులు రోడ్డున పడ్డారు. 


జలాశయాల్లో అనేక టీఎంసీల నీరుంది. వాటిని పొలాలకు మళ్లించి కరువు నేలను సస్యశ్యామలం చేద్దామంటే సరైన పంట కాలువలు లేవు. మళ్లీ వర్షాలు కురిసే వరకు ఆ నీరంతా ఆ జలాశయాల్లోనే ఆవిరైపోవాల్సిందే. భారీ వర్షాలు కురిస్తే, వరదలను నివారించడానికి ఆ జలాశయాల్లోని నీటిని దిగువకు వదిలేసి, కొత్తగా వచ్చే నీటితో మళ్లీ జలశయాలను నింపుతారు. అంతే, తప్ప ఆ నీరు పంట పొలాలకు గానీ, తాగు నీటికిగానీ ఉపయోగపడే పరిస్థితి లేదు. సీఎం జగన్‌ సొంత జిల్లా కడపలో రైతుల దయనీయ పరిస్థితి ఇదీ. 


తెలుగుగంగ క‘న్నీటి’ వ్యథ

ఎన్టీఆర్‌ తెలుగుగంగ ప్రాజెక్టు బ్రహ్మంసాగర్‌ కుడి, ఎడమ ప్రధాన కాలువలు, మైనర్‌, సబ్‌ మైనర్‌ కెనాల్స్‌, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణాల కోసం 2004-05లో రూ.210 కోట్లతో ప్యాకేజీ-2, రూ.198 కోట్లతో ప్యాకేజీ-3 కింద మట్టి పనులు, మరో రూ.232 కోట్లతో 2010-11లో సీసీ లైనింగ్‌ చేపట్టారు. మొత్తం రూ.602 కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరా ఆయకట్టుకు నీళ్లివ్వలేని దుస్థితి. కాంట్రాక్ట్‌ సంస్థలు చేతులెత్తేస్తే ప్రభుత్వం ప్రీక్లోజర్‌కు ఆమోదం తెలిపింది. అసంపూర్తి(బ్యాలెన్స్‌) పంట కాలువలు, డ్రాపులు, అక్విడెక్ట్స్‌, వంతెనలు, మైనర్‌, మేజర్‌ డిస్ట్రిబ్యూటరీలు.. మొత్తం 135 నిర్మాణాలకు బద్వేలు డివిజన్‌లో రూ.36 కోట్లు, పోరుమామిళ్ల డివిజన్‌లో రూ.11 కోట్లు అవసరమని నివేదిక పంపి నెలలు గడుస్తున్నా నిధుల ఊసేలేదు. ఆ పనులు పూర్తి చేస్తే ఎన్టీఆర్‌  టీజీపీ కింద 1.56 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చని ఓ ఇంజనీరు చెప్పారు. నిర్మించిన కాలువలు వినియోగంలోకి రాక శిథిలమవుతున్నాయి.

Updated Date - 2021-04-11T09:44:44+05:30 IST