ఇంటర్నెట్ లేకుండానే డిజిటల్ చెల్లింపులు త్వరలో : ఆర్బీఐ

ABN , First Publish Date - 2021-12-09T00:07:14+05:30 IST

ఫీచర్ ఫోన్లలో ఇంటర్నెట్ అవసరం లేకుండానే డిజిటల్

ఇంటర్నెట్ లేకుండానే డిజిటల్ చెల్లింపులు త్వరలో : ఆర్బీఐ

న్యూఢిల్లీ : ఫీచర్ ఫోన్లలో ఇంటర్నెట్ అవసరం లేకుండానే డిజిటల్ చెల్లింపులు చేసే సదుపాయం త్వరలో రాబోతోంది. ఈ వివరాలను భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం వెల్లడించారు. ద్రవ్య విధాన కమిటీ ద్వైమాసిక సమావేశం వివరాలను మీడియాకు తెలిపిన సందర్భంగా శక్తికాంత దాస్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఆధారిత ఉత్పత్తులను ఫీచర్ ఫోన్లలో అందుబాటులోకి తెస్తామన్నారు. 


అభివృద్ధి, నియంత్రణ విధానాలపై ప్రకటనలో ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం, చిన్న మొత్తాల లావాదేవీల ప్రక్రియను సులభతరం చేసే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. యూపీఐ చెల్లింపులకు జనాదరణ పెరిగేలా చేయాలనే లక్ష్యంతో ఫీచర్ ఫోన్ల ద్వారా  ఈ లావాదేవీలకు అవకాశం కల్పిస్తారు. ఆర్బీఐ రిటెయిల్ డైరెక్ట్ స్కీమ్, అదేవిధంగా ఐపీఓ ఆఫరింగ్ అప్లికేషన్లకు యూపీఐ చెల్లింపుల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతారు. ఈ స్కీమ్ ద్వారా వ్యక్తులు ఆర్బీఐ వద్ద గిల్ట్ సెక్యూరిటీస్ అకౌంట్‌ను తెరచి, ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టవచ్చు. 


వాలెట్లు, కార్డులు, యూపీఐ ద్వారా చెల్లింపుల విధానంలో వసూలు చేసే ఛార్జీలపై డిస్కషన్ పేపర్‌ను విడుదల చేయనున్నట్లు శక్తికాంత దాస్ చెప్పారు. 


Updated Date - 2021-12-09T00:07:14+05:30 IST