Uphaar Fire tragedy: అన్సాల్ సోదరుల విడుదలకు ఢిల్లీ కోర్టు ఆదేశం

ABN , First Publish Date - 2022-07-20T00:49:13+05:30 IST

ఉపహార్ సినిమా థియేటర్‌లో దారుణ అగ్నిప్రమాద ఘటనకు సంబంధించిన కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారనే..

Uphaar Fire tragedy: అన్సాల్ సోదరుల విడుదలకు ఢిల్లీ కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: ఉపహార్ (Uphaar) సినిమా థియేటర్‌లో దారుణ అగ్నిప్రమాద ఘటనకు సంబంధించిన కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారనే కారణంగా జైలుశిక్ష అనుభవిస్తున్న అన్సాల్ సోదరులు (Ansal brothers) గోపాల్, సుశీల్ అన్సాల్‌కు ఎట్టకేలకు విముక్తి లభించింది. వారి విడుదలకు ఢిల్లీ కోర్టుకు మంగళవారంనాడు ఆదేశించింది. ఇప్పటికే సోదరులిరువురు కొంత శిక్షాకాలం పూర్తి చేసుకోవడం, వయోభారం దృష్టిలో ఉంచుకుని వారిని విడుదల చేస్తున్నట్టు కోర్టు తీర్పుచెప్పింది. అయితే, వారిపై విధించిన 2.25 కోట్ల జరిమానాను కోర్టు ధ్రువీకరించింది.


ఈ కేసులో తమ విముక్తి కల్పించాలంటూ గత సోమవారంనాడు అన్సాల్ సోదరులు చేసుకున్న విజ్ఞప్తిని జిల్లా కోర్టు తోసిపుచ్చింది. దీంతో వారు పాటియాలా హౌస్ కోర్టును ఆశ్రయించగా, వారి జైలుశిక్షపై వాదోపవాదనలు జరిగాయి. దోషుల వయస్సును కోర్టు దృష్టిలో పెట్టుకుని, కొంత శిక్షాకాలం కూడా పూర్తి చేసినందున కేసులోని నలుగురు నిందితులను విడుదల చేస్తున్నట్టు పాటియాలా కోర్టు తీర్పునిచ్చింది.


1997లో దుర్ఘటన...

ఢిల్లీలోని ఉపహార్ సినిమా థియేటర్‌లో 1997లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 59 మంది సజీవ దహనమయ్యారు. సుషీల్ అన్సాల్, గోపాల్ అన్సాల్‌ యాజమాన్యంలో ఈ థియేటర్ నడుస్తోంది. ఈ కేసులో కొన్ని కీలక సాక్ష్యాలను వారు తారుమారు చేశారని,  ఫైల్స్‌లోని కొన్ని పేజీలను తొలగించారని కోర్టు నిర్ధారించింది. 2021లో ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని దోషులుగా కోర్టు ప్రకటిస్తూ, ఏడేళ్లు చొప్పున జైలుశిక్ష విధించింది.

Updated Date - 2022-07-20T00:49:13+05:30 IST