‘పినాక’ పరిధి మరింత పెంపు.. వరుస పరీక్షలు విజయవంతం

ABN , First Publish Date - 2021-12-11T21:29:27+05:30 IST

భారత అమ్ములపొది మరింత బలోపేతం కానుంది. అత్యాధునిక సాంకేతికను ఉపయోగించి పరిధిని మరింత విస్తృత

‘పినాక’ పరిధి మరింత పెంపు.. వరుస పరీక్షలు విజయవంతం

న్యూఢిల్లీ: భారత అమ్ములపొది మరింత బలోపేతం కానుంది. అత్యాధునిక సాంకేతికను ఉపయోగించి పరిధిని మరింత విస్తృత పరిచిన పినాక-ఈఆర్ రాకెట్ వ్యవస్థ పరీక్షలు విజయవంతమయ్యాయి. ఫోఖ్రాన్‌లో గత మూడు రోజులుగా జరుగుతున్న పరీక్షలు విజవంతమైనట్టు రక్షణ శాఖ తెలిపింది.


ఆర్మీతో కలిసి డీఆర్‌డీవో నిర్వహించిన ఈ పరీక్షల్లో సంతృప్తికర ఫలితాలు వచ్చాయని, మొత్తంగా 24 రాకెట్లను వివిధ వార్‌హెడ్‌ల సామర్థ్యంతో, పలు రేంజ్‌లలో పరీక్షించినట్టు వివరించింది. ఈ పరీక్షలతో పినాక-ఈఆర్ (పరిధి విస్తరించిన) ఉత్పత్తికి సిద్ధమైనట్టేనని తెలిపింది. 


ప్రస్తుతం అందుబాటులో ఉన్న పినాక పరిధిని పెంచి పినాక-ఈఆర్‌గా తీర్చిదిద్దారు. ఇవి గత దశాబ్దకాలంగా ఆర్మీ అమ్ములపొదిలో ఉన్నాయి. ప్రస్తుతం వీటి పరిధి 45 కిలోమీటర్లు కాగా, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి పరిధిని 70 కిలోమీటర్లకు పెంచారు. పినాక అనేది అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ సమర్థంగా పనిచేసే బహుళ బ్యారెల్ రాకెట్ వ్యవస్థ. ఇది శత్రు సైన్యంపై 44 సెకన్లలో 72 రాకెట్లను ప్రయోగించగలదు. 


గతేడాది మేలో లడఖ్ వద్ద ఘర్షణ వాతావరణం ఏర్పడినప్పుడు చైనా సరిహద్దులో పినాక రాకెట్ వ్యవస్థను మోహరించారు. డీఆర్‌డీవో-అర్మామెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏఆర్‌డీఈ), పూణె, హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లేబరేటర (హెచ్‌ఈఎంఆర్ఎల్) పూణె కలిసి సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశాయి.

Updated Date - 2021-12-11T21:29:27+05:30 IST