ఉప్పెనలా..

ABN , First Publish Date - 2021-05-09T07:35:39+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ కేసులు ఉప్పెనలా వచ్చిపడుతున్నాయి.

ఉప్పెనలా..

జిల్లాలో నాలుగు రోజుల్లో పది వేల కేసులు నమోదు

ఈనెల 4న 1.50 లక్షల పాజిటివ్‌లు.. 8వ తేదీకి 1,60 లక్షలకు చేరిక

తాజాగా శనివారం జిల్లాలో 2,370 మందికి వైరస్‌ నిర్ధారణ

అంతకంతకూ బెడ్ల కొరత.. పోటెత్తుతున్న వేలాది మంది బాధితులు

అటు ఆక్సిజన్‌ కోసం ప్రైవేటు ఆసుపత్రులు అగచాట్లు

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కొవిడ్‌ కేసులు ఉప్పెనలా వచ్చిపడుతున్నాయి. అంచనా లకు అందనిరీతిలో లెక్కకుమిక్కిలి నమోదవుతున్నాయి. ఊరూరా,పల్లెపల్లెనా మహమ్మారి జడలు విరుచుకుని విస్తరించేస్తోంది. కర్కశంగా మారి కన్నెర్రచేస్తోంది. దీంతో వేలాదిమంది బాధితులుగా మారుతున్నారు. అటు ఆసుపత్రులన్నీ నిండిపోయి బెడ్‌లు దొరక్క రోదిస్తున్నారు. ఇప్పటికే పడకలు నిండిపోయి వాటికోసం అగచాట్లు ఒకపక్క.. మరోపక్క రోజువారీ వేలల్లో కేసులు మరోపక్క ఆసుపత్రుల్లో పరిస్థితులను జఠిలం చేస్తున్నాయి. ఫలితంగా వైద్యశాఖ మొదలు జిల్లా అధికారుల వరకు విపత్తును ఎదుర్కోవడం తలకుమించిన భారంగా మారుతోంది. మరోపక్క జనం వైరస్‌ బారిన పడి కన్నుమూస్తున్నవారు కొందరైతే మంచంపై రోదిస్తున్నవారు మరికొందరు అన్నట్టు పరిస్థితి తయారైంది. దీంతో కొవిడ్‌ మహమ్మరి వ్యాప్తి ఎప్పటికి తగ్గుతుందనే నిస్సహాయ స్థితిని కల్పిస్తున్నాయి. కాగా జిల్లాలో పాజిటివ్‌ల వేగం మరింత ఊపందుకుంది. అసలే ఏప్రిల్‌లో వందల నుంచి వేలల్లోకి పాజిటివ్‌లు పెరిగిపోయానే ఆందోళనతో ఉంటే ఇప్పుడు మేలో పరిస్థితి ఇంకాస్త భయానకంగా మారింది. ఏకంగా నాలుగు రోజుల్లో కేసులు పదివేలు నమోదవడం తీవ్రతకు అద్దం పడుతోంది. ఈనెల 4న జిల్లావ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌లు 1,50,281గా నమోదయ్యాయి. తిరిగి శనివారం నాటికి అంటే 8వ తేదీకి ఏకంగా 1,60,349కి చేరాయి. అంటే నాలుగు రోజుల వ్యవధిలో పది వేల మార్కు కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఈ నాలుగు రోజుల్లో అత్యధికంగా ఒకేరోజులో ఆరో తేదీన ఏకంగా 3,531 పాజిటివ్‌లు వచ్చాయి. దీంతో వైరస్‌ వేగంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా జిల్లాలో శనివారం 2,370 పాజిటివ్‌లు నమోదయ్యా యి. దీంతో యాక్టీవ్‌ కేసుల సంఖ్య 22,248కి చేరింది. ఇందులో వేలాది మంది వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 2,900 మంది బాధితులు ఆక్సిజన్‌ బెడ్లపై ఉన్నారు. అటు మరణాలు తొమ్మిదిగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కొవిడ్‌ మరణాల సంఖ్య 762కు చేరింది. ఇదిలాఉంటే రోజురోజుకు పాజిటివ్‌లు పెరిగి బాధితులు ఆసుపత్రులకు పోటెత్తుతుండడంతో ఆక్సిజన్‌ సరఫరా పరి స్థితి అగమ్యగోచరంగా మారుతోంది. దీంతో ఎప్పటికప్పుడు డిమాండ్‌కు సరిపడా సరఫరా అయ్యేలా చూడడం అసాధ్యంగా మారుతోం ది. దీంతో వచ్చిన ఆక్సిజన్‌ను తొలుత ప్రభుత్వ ఆసుపత్రులకే అందే లా కలెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు అందించడం సాధ్యం కాదని ఇటీవల ఓ అంతర్గత సమావేశంలో తేల్చి చెప్పారు. దీంతో ఆక్సిజన్‌ లభ్యతపై ప్రైవేటు ఆసుపత్రులు తలలు పట్టుకుంటున్నాయి. కాగా ప్రస్తుతం ఆక్సిజన్‌కు తీవ్రమైన డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో రిలయెన్స్‌ సంస్థ జీజీహెచ్‌కు ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఉచితంగా అందివ్వాలని నిర్ణయించింది. ఈమేరకు రూ.36 లక్షల వ్యయంతో శ్రీసిటీ సెజ్‌ నుం చి కొత్త ప్లాంట్‌ను అందివ్వనుంది. ఇప్పటికే ప్లాంట్‌లో కొన్ని భాగాలు జీజీహెచ్‌కు చేరుకున్నాయి. దీన్ని అమర్చిన తర్వాత ప్లాంట్‌ సొంతం గానే ఆక్సిజన్‌ తయారుచేసుకునే సౌలభ్యం ఉంటుందని రిలయెన్స్‌ ప్రతినిధులు పేర్కొన్నారు.



Updated Date - 2021-05-09T07:35:39+05:30 IST