Ramatheertham ఘటనలో అశోక్ గజపతిపై పోలీసులకు ఫిర్యాదు.. అరెస్ట్ చేస్తారా..!?

ABN , First Publish Date - 2021-12-23T14:55:00+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం బుధవారం నాడు మరోసారి ఉద్రిక్తంగా...

Ramatheertham ఘటనలో అశోక్ గజపతిపై పోలీసులకు ఫిర్యాదు.. అరెస్ట్ చేస్తారా..!?

విజయనగరం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం బుధవారం నాడు మరోసారి ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. తనకు సమాచారం లేకుండా బోడికొండపై రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయం తీసుకోవడంపై దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దేవదాయ శాఖ అధికారులపై, అధికార పక్షంపైనా తీవ్రంగా మండిపడి.. స్టీలు రేకు శిలాఫలకాన్ని విసిరేశారు. దీంతో ఆయనకు, వైసీపీ నాయకులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఒకానొక దశలో కొండపై గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ వ్యవహారం అంతా బుధవారం హాట్ టాపిక్‌గానే నడిచింది. తప్పంతా అశోక్‌దేనని వైసీపీ.. చేసిందంతా వైసీపీ మంత్రులేనని టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.


అరెస్ట్ చేస్తారా..!?

అయితే.. ఈ ఘటనపై ఆలయ ఈవో ప్రసాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంఖుస్థాపన ఏర్పాట్లు వద్ద తమ విధులకు ఆటంకం కలిగించారని ఈవో ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అశోక్ గజపతితో పాటు మరికొందరిపైన కేసు నమోదు చేసుకున్నారు. అయితే.. ఆలయ అనువంశిక ధర్మకర్తగా అశోక్ గజపతికి ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని కూడా ఈవో ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అశోక్‌ను అరెస్టు చేసే అవకాశం ఉందని జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలోనే ఈవోతో పాటు పలువురు ఆలయ అధికారులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదులో ఏమున్నది అనే విషయం పోలీసులు బయటికి చెప్పకపోగా.. గురువారం నాడు ఇదంతా బయటికొచ్చింది.


అసలు ప్రభుత్వానికి సంబంధం ఏంటి..?

కోదండరాముని ఆలయం వ్యవహారం పూర్తిగా మాన్సాస్‌ ట్రస్టుకు సంబంధించిన అంశమని, ప్రభుత్వానికి ఏ రకంగానూ సంబంధం లేదని ట్రస్టు చైర్మన్ అశోక్‌గజపతిరాజు స్పష్టం చేశారు. బోడికొండపై ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఆలయ శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తిచేసిన తరువాత తనకు చెప్పడం బాధాకరమన్నారు. అది తమ పూర్వీకులు 400 సంవత్సరాల కిందట నిర్మించిన ఆలయమని గుర్తు చేశారు. గతంలో తాను విరాళం ఇచ్చిన చెక్కును కూడా ఈవో స్వీకరించలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆయన వెంట పార్టీ నాయకులు కర్రోతు నరసింగరావు, బొద్దల నరసింగరావు, గేదెల రాజారావు తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-12-23T14:55:00+05:30 IST