మరణంలోనూ వీడని బంధం..

ABN , First Publish Date - 2021-12-20T13:15:12+05:30 IST

మరణంలోనూ వీడని బంధం..

మరణంలోనూ వీడని బంధం..

  • కామారెడ్డి ప్రమాద మృతదేహాలకు అంత్యక్రియలు   
  • బస్తీల్లో విషాద ఛాయలు

హైదరాబాద్‌ సిటీ/చాదర్‌ఘాట్‌ : మహమ్మద్‌ హుస్సేన్‌, మహమ్మద్‌ అమీర్‌ చిన్ననాటి స్నేహితులు. ఏటా ఇరువురి కుటుంబాలూ కాన్‌దర్గా దర్గా దర్శనానికి వెళ్లి వస్తుంటాయి. ఈ ఏడు కూడా వెళ్లి కామారెడ్డిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ఆ ప్రమాదంలో మృతి చెందిన వారి అంత్యక్రియలు నగరంలో ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయా బస్తీల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. 


కామారెడ్డిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహ్మద్‌ అమీర్‌ తాజ్‌ (28), భార్య సనా పర్వీన్‌ ఫాతిమా (24), ఏడాదిన్నర వయసున్న హనీయా ఫాతిమా, నాలుగు నెలల వయసున్న హన్నా ఫాతిమా మృతదేహాలు ఆదివారం చాదర్‌ఘాట్‌ ప్రాంతానికి చేరుకున్నాయి. మరో కుటుంబానికి చెందిన మహ్మద్‌ హుస్సేన్‌ (35), అతని భార్య తస్లీమా బేగం (28), హదీ(6) మృతదేహాలు ఫలక్‌నుమా, తీగల్‌కుంటలో ఉన్న హుస్సేన్‌ అత్తగారింటి వద్దకు తీసుకొచ్చారు. ఆయా బస్తీల్లో నల్ల జెండాలు ప్రదర్శించిన బస్తీ వాసులు బాధిత కుటుంబీకులకు సంతాపం ప్రకటించారు. మలక్‌పేట్‌ ఎమ్మెల్యే అహ్మద్‌ బలాలా, స్థానిక కార్పొరేటర్లు మృతుల కుటుంబీకులను పరామర్శించారు. సాయంత్రం 7 గంటలకు చాదర్‌ఘాట్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.


ఈ పిల్లలకు దిక్కెవరు..?

హుస్సేన్‌ దంపతులకు ఐదుగురు సంతానం. వారిలో ఓ కుమార్తె వారితో పాటు ప్రమాదంలో మృతి చెందింది. మిగిలిన నలుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు ఆ పిల్లల ఆలనాపాలనా చూసేవారెవరని కుటుంబీకులు చేస్తున్న రోదనలు పలువురి హృదయాలను కలిచివేస్తున్నాయి. అలాగే చిన్ననాటి స్నేహితులైన అమీర్‌, హుస్సేన్‌లు చావులోనూ విడిపోలేదని స్థానికులు కన్నీటిపర్యంతం అవుతున్నారు.

Updated Date - 2021-12-20T13:15:12+05:30 IST