ఓటర్ల జాబితా నవీకరణ

ABN , First Publish Date - 2022-08-18T05:54:27+05:30 IST

జిల్లాలో ఓటర్ల జాబితా నవీకరణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఓటర్ల జాబితా నవీకరణ

మొదలైన ఇంటింటి సర్వే

ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం

పాఠశాలల మూసివేతతో పోలింగ్‌ కేంద్రాల్లోనూ మార్పులు

కేంద్రంలో 1500 మంది ఓటర్లు

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 17: జిల్లాలో ఓటర్ల జాబితా నవీకరణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఓటర్ల జాబితాలో పేరున్నవారి ఆధార్‌ నెంబర్లను సేకరించి ఓటరు కార్డుకు అనుసంధానం చేసే ప్రక్రియ చేపట్టారు. వచ్చే ఏడాది మార్చి ఆఖరు వరకు కొనసాగే ఈ కార్యక్రమం.. గత వారం ప్రారంభమైంది.  ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్వో) పాత పద్ధతిలోనే ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తారు. ఈ సర్వేలో భాగంగా ఓటర్ల ఆధార్‌ నెంబరు అడుగుతారు. ఆధార్‌ నెంబరు ఇవ్వడమనేది ఓటరు ఇష్టం. ఇందులో ఎలాంటి బలవంతం లేదు. ఓటర్లకు సంబంధించిన ఆధార్‌ కార్డును గోప్యంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశాలివ్వడంతో ఈ నియమాన్ని పాటించాలని జిల్లా ఎన్నికల సంఘం బీఎల్వోలకు ఆదేశాలు జారీచేసింది. 

మారిన దరఖాస్తు ఫారాలు

ఓటర్ల జాబితాలో మార్పులు- చేర్పులకోసం అందించే దరఖాస్తులను ఈసారి మార్చారు. ఓటరుగా చేరేందుకు ఫారం 6తో పాటు, ఫారం 6బిని కూడా పూర్తిచేసి జతచేసి ఇవ్వాలి. ఓటర్ల జాబితాలో సవరణలు, మార్పులకు ఫారం -8 అందించాలి. గతంలో మార్పులు, సవరణలకోసం ఫారం-8ని ఇవ్వాల్సివచ్చేది. ఓటరు జాబితానుంచి పేరును తొలగించేందుకు ఫారం-7ను ఇస్తే సరిపోతుంది.

నిబంధనలు ఇవీ 

ఇకనుంచి ప్రతి పోలింగ్‌ కేంద్రంలో 1500 మంది ఓటర్లకు మించకూడదని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎక్కడైనా 1500మంది కంటే ఎక్కువ ఉంటే మరో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. గతంలో భార్యాభర్తలు వేర్వేరు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు వేయాల్సివచ్చేది. ఇకపై ఒక కుటుంబంలోని వారు, ఒకే వీధిలోని ఓటర్లు ఒకే పోలింగ్‌ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా జాబితాలను సవరిస్తారు. ఇదే అంశాన్ని గతవారం రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో కలెక్టర్‌ హరినారాయణన్‌ స్పష్టం చేశారు. ఓటరు ఇంటి నుంచి 2 కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్‌ కేంద్రం ఉండేలా చూస్తారు. మృతి చెందిన ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగిస్తారు. ఓటర్ల జాబితాల్లో ఒకే ఓటరు పేరు రెండుమూడు సార్లు నమోదైవుంటే ఈ వివరాలు సేకరించి అతడి అభీష్టం మేరకు ఏదేని ఒకచోటే ఉంచుతారు. మిగిలిన చోట్ల పేరు తొలగిస్తారు. 

మూతపడిన పాఠశాలలతో.. 

ఇటీవల జిల్లాలో 496 పాఠశాలలను 3 కిలోమీటర్ల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో ప్రభుత్వం విలీనం చేసింది. సంబంధిత పాఠశాల భవనాలు గతంలో పోలింగ్‌ కేంద్రాలుగా ఉండేవి. ప్రస్తుతం అవి ఆయా యాజమాన్యాల ఆధీనంలోకి వెళ్లాయి. వీటిలో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తారా? లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారా? అనే అంశాన్ని ఇటీవల జరిగిన సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. ఈ తరహా ప్రాంతాల్లో వేరే పోలింగ్‌ కేంద్రాలను గుర్తిస్తామని కలెక్టర్‌ చెప్పారు. 

జిల్లాలో ఓటర్లు...!

జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 14,61,269 మంది ఓటర్లు ఉన్నారు. వీరికోసం 31 మండలాల్లో 1642 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా ఓటర్లు.. పుంగనూరులో 2,36,781, అత్యల్పంగా నగరిలో 1,19,654, గంగాధరనెల్లూరులో 2,03,340, చిత్తూరులో 2,02,007, పూతలపట్టులో 2,17,897, పలమనేరులో అత్యధికంగా 2,60,543, కుప్పంలో 2,21,047 మంది ఉన్నారు. 

17 ఏళ్లు నిండుతుంటే.

గతంలో 18 ఏళ్లు నిండినవారు ఓటరుగా పేరు నమోదు చేసుకోవడానికి ఏడాదికి ఒకసారి మాత్రమే అవకాశం ఉండేది. అది కూడా జనవరిలో మాత్రమే. ఇప్పుడు నిబంధనలు మార్చారు. జనవరి, ఏప్రిల్‌, జూలై, అక్టోబరు ఒకటో తేది నాటికి 17 ఏళ్లు పూర్తయ్యేవారు ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరి దరఖాస్తు ప్రాసె్‌సలో మాత్రమే ఉంటుంది. 18 ఏళ్లు నిండిన తర్వాత ఆటోమేటిక్‌గా వారు ఓటరుగా నమోదవుతారు. 


Updated Date - 2022-08-18T05:54:27+05:30 IST