ఉపపోరుకు కాంగ్రెస్‌ సై

ABN , First Publish Date - 2022-08-05T05:42:14+05:30 IST

రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక ఖరారైంది. సాధారణ ఎన్నికల ముందు జరిగే ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

ఉపపోరుకు కాంగ్రెస్‌ సై
చండూరులో సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

చండూరులో నేడు సభ

హాజరుకానున్న రేవంత్‌, జానా, ఉత్తమ్‌

ఎంపీ వెంకటరెడ్డి హాజరయ్యేనా?

రాత్రికి చౌటుప్పల్‌లో కీలక నేతలతో రేవంత్‌ భేటీ

నేడు కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్న చెరుకు సుధాకర్‌

నల్లగొండ, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతిప్రతినిధి): రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక ఖరారైంది. సాధారణ ఎన్నికల ముందు జరిగే ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నిక కాంగ్రెస్‌ భవిష్యత్తుకు చావో రేవోగా మారడంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భారీ స్కెచ్‌తో రంగంలోకి దిగుతున్నారు. దిగ్గజాల జిల్లా, తాను జోక్యం చేసుకోవడం సరికాదని ఇంతకాలం వేచి చూసిన ఆయన కోమటిరెడ్డి బ్రదర్స్‌ వ్యహారంతో మునుగోడు ఎన్నిక కేంద్రంగా జిల్లా కాంగ్రెస్‌ రాజకీయాల్లో ఆయన పూర్తిగా తలదూర్చాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే డాక్టర్‌ చెరుకు సుధాకర్‌కు రేవంత్‌ కాంగ్రెస్‌ కండువా కప్పారు. మునుగోడులో బలమైన అభ్యర్థిని బరిలో నిలపనున్నారు. ఈ క్రమంలోనే అందరికంటే ముందుగా ఉపపోరులో చండూరులో బహిరంగ సభ పేరుతో ఎన్నికల యుద్ధంలోకి దిగారు.

నేడు కాంగ్రెస్‌ సభ

కీలక నేత సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో బలమైన నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ఒక్కసారిగా దిక్కులేని పరిస్థితిలోకి వెళ్లింది. పార్టీ పదవుల్లో అంతా రాజగోపాల్‌ అనుచరులే ఉండ టం వారు సైతం ఆయన వెంట నడుస్తుండటం, ఉన్నవారు ఆర్థికంగా ఎన్నికలను ఎదుర్కొనే స్థితిలో లేకపోవడంతో రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగారు. రాజగోపాల్‌ రాజీనామా సమాచారంతో వెనువెంటనే తనకు అనుకూలురైన స్థానిక నేతలను రంగంలోకి దింపారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకు భరోసా కల్పించే కార్యక్రమం చేపట్టారు. ఆరు మండలాల అధ్యక్షులను సస్పెండ్‌ చేసి త్రీమెన్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. మునుగోడు ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు ఐదుగురు సభ్యులతో వ్యూహ, ప్రచార కమిటీని ఖరారు చేశారు. మునుగోడులో బలంగా ఉన్న గౌడ సామాజికవర్గాన్ని దృష్టిలో పెటుకొని కీలక నేత మధుయాష్కీ గౌడ్‌ను చైర్మన్‌గా, రెడ్డి, స్థానిక నేత ప్రాతిపదికన దామోదర్‌రెడ్డి, గిరిజనుల ఓట్లను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే సీతక్క, బలరాంనాయక్‌, యాదవ్‌, ఎస్సీల ఓట్ల నేపథ్యంలో అంజన్‌కుమార్‌యాదవ్‌, సంపత్‌కుమార్‌, బీసీల ప్రాతినిధ్యం కోసం మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్‌కుమార్‌లతో కమిటీని ఏర్పాటు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక బాధ్యతను రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి అప్పగించినట్టు పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి గురువారం చండూరులో ప్రకటించారు. కాగా సభకు ఆరు మండలాల నుంచి 25వేల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చండూరులో మధ్యాహ్నం 2గంటలకు సభ ప్రారంభంకానుంది. జనసమీకరణకు మండలాల వారీగా పాల్వాయి స్రవంతి, పున్న కైలాస్‌, పల్లె రవి, చలిమెల కృష్ణారెడ్డికి బాధ్యతలు అప్పగించారు.

సభకు వెంకట్‌రెడ్డి వచ్చేనా?

చండూరు సభకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌, సీనియర్‌ నేత జానారెడ్డి హాజరుపై స్పష్టత ఉన్నా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరవుతారా లేదా? అనే సందేహం ఉంది. సభకు ఆయన దూరంగా ఉంటరాని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. తనను అవమానించేలా కామెంట్‌ చేసిన రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని ఎంపీ వెంకటరెడ్డి డిమాండ్‌ చేయగా రేవంత్‌ స్పందించలేదు. వెంకట్‌రెడ్డి మునుగోడు ప్రచారానికి దూరంగా ఉంటారని, ఆది నుంచి ప్రచారంలో ఉంది. ఆయన అనారోగ్యం కారణంతో అమెరికా వెళ్లే అవకాశం ఉందన్న చర్చ స్థానికంగా జోరుగా సాగుతోంది.

చౌటుప్పల్‌లో నేతలతో సమావేశంకానున్న రేవంత్‌

మునుగోడు నియోజకవర్గానికి చెందిన కీలక నేతలతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ చౌటుప్పల్‌లో శుక్రవారం రాత్రి 8గంటలకు భేటీకానున్నారు. ఈ సమావేశంలో ఉప ఎన్నిక వ్యూహాన్ని ఖరా రు చేయనున్నారు, నేతలతోనే రేవంత్‌ భోజనం చేయనున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఈ షెడ్యూల్‌ ఖరారైంది.

కాంగ్రెస్‌లోకి చెరుకు సుధాకర్‌

తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు. చెరుకు కాంగ్రె్‌సలో చేరికకు సంబంధించి ఏఐసీసీలో కీలక నేత కొప్పుల రాజుతో ఆరు నెలల క్రితమే చర్చలు పూర్తయి ఓ అవగాహనకు వచ్చారు. అయితే సుధాకర్‌ దూకుడు తత్వం, సామాజిక కోణం బలంగా ఉండటం వంటి అంశాల నేపథ్యంలో జిల్లాకు చెం దిన కాంగ్రెస్‌ దిగ్గజాలు ఒకరిద్దరు విముఖత వ్యక్తం చేయడంతో ఆయన చేరికకు బ్రేక్‌పడింది. తాజాగా, కోమటిరెడ్డి రాజగోపాల్‌ పార్టీనీ వీడటం, వెంకట్‌రెడ్డి, రేవంత్‌ మధ్య వైరం పెరగడంతో చెరుకు చేరికకు మార్గం సుగమమైంది. ఆయనకు పీసీసీ నుంచి పిలుపు రావడంతో గురువారం ఢిల్లీలో రేవంత్‌తో కలిసి సుదీర్గంగా చర్చించారు. పీసీసీ అధ్యక్షుడి చేతుల మీదుగా ఢిల్లీలో కాంగ్రెస్‌ కండువా కప్పుకొని ఆయనతోపాటు నేరుగా చండూరు సభకు శుక్రవారం ఉదయం రానున్నారు. నకిరేకల్‌ మాత్రమే కాదు.. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులు, సామాజిక కోణంలో అందరినీ కాంగ్రె్‌సవైపు మళ్లించి, కష్టకాలంలో పార్టీ బలోపేతం కోసం పనిచేయడానికి ఎలాంటి అడ్డుంకులు ఉండవు.. మీకు తోడుగా ఉంటానని రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చినట్టు సుధాకర్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ బలంగా ఉన్నా, ఆర్థికంగా బలమున్న నాయకుడు లేకుండా పోయారు. ఉప ఎన్నిక ఎదుర్కోవాలంటే కోట్ల రూపాయల వ్యవహారం కావడంతో నారాయణపురం మండలానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు చెలిమెల కృష్ణారెడ్డిని పీసీసీ అధ్యక్షుడు తెరపైకి తెచ్చినట్టు సమాచారం. కృష్ణారెడ్డి రెండు రోజులుగా చండూరు సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.



Updated Date - 2022-08-05T05:42:14+05:30 IST