పవిత్ర జలం.. ఎలా చల్లుకోగలం!

ABN , First Publish Date - 2021-02-25T06:42:53+05:30 IST

ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే అతి ప్రాచీన పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయం. ఆరేళ్ల కిందట టీటీడీ ఈ ఆలయాన్ని స్వాధీనపర్చుకుంది.

పవిత్ర జలం.. ఎలా చల్లుకోగలం!
ఉపమాక క్షేత్రంలో నాచుపట్టి ఉన్న పుష్కరిణి

 ఉపమాక క్షేత్ర పుష్కరిణిలో అడుగు పెట్టలేని దుస్థితి

 చెరువంతా నాచు పట్టి, నీరు దుర్వాసన

  ఇప్పటికీ స్వామివారి అభిషేకం, తీర్థానికి ఇవే జలాలు

 టీటీడీ పట్టించుకోవడం లేదంటూ భక్తులు ఆవేదన 


నక్కపల్లి, ఫిబ్రవరి 24 : ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే అతి ప్రాచీన పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయం. ఆరేళ్ల కిందట టీటీడీ ఈ ఆలయాన్ని స్వాధీనపర్చుకుంది. అప్పటి నుంచి ఆలయంలో కొన్ని శాశ్వతమైన పనులు చేపట్టినప్పటికీ, భక్తులకు, స్వామివారికి నిత్యం ఉపయోగపడే అభివృద్ధి పనులను విస్మరించిందని భక్తులు వాపోతున్నారు. ఇందుకు ఉదాహరణంగా దేవస్థానానికి ఆనుకుని వున్న స్వామివారి పుష్కరిణినే ఉదాహరణగా చూపుతున్నారు. ఇప్పటికీ ప్రతి రోజూ ఈ పుష్కరిణి జలాలనే కొండపై వున్న స్వామివారి మూలవిరాట్‌ అభిషేకానికి, భక్తులకు ఇచ్చే తీర్థానికి వినియోగిస్తారు. రోజూ తెల్లవారుజామునే అర్చకస్వాములు తీర్థపు బిందెతో ఈ చెరువు నుంచి జలాలను తీసుకెళ్లడం పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తోంది. 2018, 2019 సంవత్సరాల్లో ఈ చెరువు దాదాపు నీరు లేక ఇంకిపోయే స్థితికి చేరింది. చెరువులో కాలు పెడితే మోకాళ్ల లోతు బురద అంటుకునేది. ఈ సమయంలో చెరువు పూడిక పనులు చేపట్టి, దుర్వాసన కొడుతున్న నీటిని తొలగించాలంటూ పలుమార్లు టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి గ్రామస్థులు తీసుకు వెళ్లినా ఫలితం లేకపోయింది. 2020 ద్వితీయార్థంలో కురిసిన తుఫాన్‌కు ఇప్పుడు చెరువంతా పుష్కలమైన నీటితో నిండి ఉంది. చెరువు అభివృద్ధి పేరుతో  గట్టు చుట్టూ పటిష్టమైన పెన్సింగ్‌ను  ఏర్పాటు చేస్తున్నారు. చెరువులో పవిత్ర స్నానాలు చేసే యోగ్యం లేకుండా పోయిందని, చెరువును శుభ్రం చేయకుండా పెన్సింగ్‌ ఎందుకని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలావుంటే మెట్లు నాచుపట్టి, అడుగు పెట్టగానే జారిపోయేలా తయారయ్యాయి. మరో నెల రోజుల్లో ఉపమాక వెంకన్న కల్యాణోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికైనా టీటీడీ అధికారులు స్పందించాలని భక్తులంతా కోరుతున్నారు.

Updated Date - 2021-02-25T06:42:53+05:30 IST