బిల్లుల కోసం.. పడిగాపులు!

ABN , First Publish Date - 2021-07-21T05:30:00+05:30 IST

మూడేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ నిధులను అనుసంధానం చేసి పెద్దఎత్తున సిమెంట్‌ రోడ్ల పనులు చేపట్టింది.

బిల్లుల కోసం..   పడిగాపులు!

జిల్లాలలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు రూ.400 కోట్లు పెండింగ్‌

కొత్తగా రూ.800 కోట్లతో నిర్మాణ పనులు

గతంలో రావలసిన బకాయిల కోసం ఎదురుచూపులు  

కొత్త పనులు చేయటానికి ముందుకు రాని కాంట్రాక్టర్లు

పనులు పూర్తి చేయాలని పీఆర్‌ ఇంజనీర్లపై ప్రభుత్వం ఒత్తిడి


 

నాలుగేళ్ల కిందట ఉపాధి పనులు చేయించాం... గ్రామాభివృద్ధి కోసమే కదా అనుకుని సొంత డబ్బు వెచ్చించాం... ఇంతవరకు ఆ బిల్లులు మంజూరు కాలేదు.. కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలి తం లేదు.. అప్పులపాలయ్యాం.. ఇదీ గతంలో ఉపాధి పనులు చేయించిన కాంట్రాక్టర్లు, అప్పటి ప్రజాప్రతినిధుల ఆవేదన. జిల్లాలో దాదాపు రూ.400 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఆ బిల్లులు చెల్లించకుండానే కొత్తగా రూ.800 కోట్లతో ప్రభుత్వం వివిధ నిర్మాణాలను ఉపాధి పనుల కింద చేపట్టింది. గత అనుభవాల ను దృష్టిలో ఉంచుకుని అనేక మంది ఈ పనులు చేయించడానికి ముందుకు రావడం లేదు. 


                   (గుంటూరు - ఆంధ్రజ్యోతి)

మూడేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ నిధులను అనుసంధానం చేసి పెద్దఎత్తున సిమెంట్‌ రోడ్ల పనులు చేపట్టింది. దీంతో పాటు పలు అభివృద్ధి పనులు కూడా ఈ పథకం ద్వారా నిర్వహించారు. అప్పట్లో కాంట్రాక్టర్లు, ప్రజా ప్రతినిధులు పోటీపడి మరీ ఈ పనులు చేపట్టారు. జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు రూ.400కోట్లు చెల్లించాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చింది. వారికి రావలసిన బిల్లులు ఇంతవరకు చెల్లించలేదు. దీంతో ఆ బిల్లులు ఎప్పుడు వస్తాయా అని వారంతా ఎదురుచూస్తున్నారు. గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ముందుకొచ్చిన నేతలు బిల్లులు రాకపోవటంతో అప్పులపాలయ్యారు. కోర్టు ఆదేశించినా బిల్లులు ఇవ్వకపోగా.. ఆ పనుల్లో నాణ్యత లేదనే సాకుతో ప్రభుత్వం విజిలెన్స్‌ దర్యాప్తు చేయిస్తోందని పలువురు వాపోతున్నారు. బిల్లులు ఇవ్వకుండా రాజకీయ కక్షతో కాలయాపన చేస్తున్నారని అంటున్నారు. 


రూ.800 కోట్లతో కొత్త పనులు..

ఇదిలా ఉంటే జిల్లాలో ప్రభుత్వం కొత్తగా రూ.800 కోట్లతో ఉపాధిహామీ పనులు మంజూరు చేసింది. డిజిటల్‌ లైబ్రరీలు, గ్రామ సచివాలయాలు, వెల్‌నెస్‌ భవనాలు, రైతుభరోసా కేంద్రాలు, జగనన్న హౌసింగ్‌ కాలనీలు, ఇళ్ళస్థలాలను మెరక చేయటం తదితర పనులు చేపట్టారు. పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఈ పనులను పర్యవేక్షిస్తోంది. గతంలో చేసిన పనులకు బిల్లులు రాకపోవటంతో అధికార పార్టీనేతలు, కాంట్రాక్టర్లు కూడా ఈ పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. మరోవైపు పనులు వేగవంతం చేయాలని ఉన్నతాధికారులు పీఆర్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ఒత్తిడి తట్టుకోలేక పీఆర్‌ ఇంజనీర్లు జిల్లాలో మూకుమ్మడి సెలవలకు కూడా సిద్ధమయ్యారు.

  

40 శాతం మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధులేవి ?

ఉపాదిహామీలో కూలీల పనులు పెరిగితేనే మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింది కేంద్రం ఇతర పనులకు ఉపాధి హామీని అనుసంధానం చేస్తుంది. ఈ పనుల్లో 60 శాతం కూలీలు, 40 శాతం మెటీరియల్‌ కింద మంజూరు చేస్తారు. ప్రస్తుతం జిల్లాలో పాతబకాయిలు రూ.400 కోట్లు ఉండగా ప్రస్తుతం రెగ్యులర్‌గా చేసిన కూలీల బిల్లులు సుమారు రూ.150 కోట్లు చెల్లించాల్సి వుంది. మరో వైపు కొత్తగా రూ.800 కోట్ల పనులు మంజూరు చేశారు. గతంలో మెటీరియల్‌ కాంపొనెంట్‌ బిల్లులు జిల్లాలో లేనప్పుడు ఇతర జిల్లాల నుంచి మళ్లించి బిల్లులు ఇచ్చిన సందర్భాలున్నాయని అధికారులు గర్తుచేస్తున్నారు. కొత్తగా చేపట్టిన పనులకు బిల్లులు ఇవ్వాలంటే 40శాతం మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద విడుదల కావాలంటే సుమారు రూ.2వేల కోట్ల విలువైన పనులు పూర్తి చేస్తే కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. వీటిన్నింటిని అధ్యయనం చేసిన క్షేత్రస్థాయిలో నేతలు ఉపాధి హామీ పనులంటేనే వద్దంటున్నారు.  

 

నాలుగేళ్ళ క్రితం పనులు చేశాం..

గ్రామంలో ఉపాధిహామీ పథకంలో నాలుగేళ్ళ క్రితం శ్మశానం మరమ్మతులు చేశాం. రూ.12 లక్షలు విడుదల చేయలేదు.  బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ఇప్పుడు ఇచ్చే బిల్లు వడ్డీకి సరిపోతుంది. అప్పులపాలయ్యాం.. భవిష్యత్‌లో ప్రభుత్వ పనంటే మాకొద్దు బాబో అనే విధంగా తయారైంది.

 - రావిపాటి కోటేశ్వరరావు, డీసీఎంఎస్‌ పాలకవర్గ మాజీ సభ్యుడు   

 

  రూ.80 లక్షలు రావాలి..

గ్రామ సర్పంచ్‌గా సిమెంట్‌ రోడ్లు వేయించా. 2017-18 నుంచి రూ.80 లక్షలు విడుదల చేయలేదు. హైదరాబాద్‌లో చిన్నకంపెనీ పెట్టుకొని జీవిస్తున్నా. నా హయాంలో గ్రామాన్ని అభివృద్ధి చేయాలని భావించా. అభివృద్ధి చేశానని తృప్తిచెందినా బిల్లులు రాకపోవటంతో అప్పులపాలయ్యా.

 - దరువూరి శ్రీనివాసరావు, ఇరుకుపాలెం మాజీ సర్పంచి 


 

Updated Date - 2021-07-21T05:30:00+05:30 IST