ఉపా చట్టాన్ని రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-03-01T06:31:34+05:30 IST

ప్రశ్నించే గొంతుకను నొక్కేందుకే ప్రభుత్వాలు ఉపా చట్టాన్ని ప్రయోగిస్తున్నాయని, దాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ సంస్థ నాయకులు డిమాండ్‌ చేశారు.

ఉపా చట్టాన్ని రద్దు చేయాలి

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, ఫిబ్రవరి 28 : ప్రశ్నించే గొంతుకను నొక్కేందుకే ప్రభుత్వాలు ఉపా చట్టాన్ని ప్రయోగిస్తున్నాయని, దాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ సంస్థ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ చట్టాన్ని ఉపయోగించి అనేకమంది మేధావులను నిర్భందించి మానసిక క్షోభకు గురిచేస్తున్నారన్నారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో ఓపీడీఆర్‌ పౌరహక్కుల సంఘం, మానవహక్కుల వేదిక, సీపీఎం, కులనిర్మూలన పోరాట సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఓపీడీఆర్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకుమార్‌ మాట్లాడుతూ.... రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటనా స్వేచ్ఛను ఉపా చట్టం కాలరాస్తోందని మండిపడ్డారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు క్రాంతిచైతన్య మాట్లాడుతూ.... వరవరరావు, వికలాగుండైన ప్రొఫెసర్‌ సాయిబాబా తదితర మేధావులును ఈ చట్టాలతో జైలు పాలు చేశారన్నారు. అరెస్టులు చేసిన వారందరిని వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌ రజాక్‌, మానవహక్కుల వేదిక తెలుగు రాష్ర్టాల సమన్వయ కమిటీ సభ్యులు చంద్రశేఖర్‌, సీపీఎం జిల్లా నాయకులు నల్లప్ప, ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఇండ్ల ప్రభాకర్‌ రెడ్డి, కులనిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు, ప్రజాకళామండలి జిల్లా అధ్యక్షురాలు రత్నమ్మ, ఓపీడీఆర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2021-03-01T06:31:34+05:30 IST