UAE లో ఆ నేరానికి రూ.కోటి వరకు జరిమానా.. 10ఏళ్ల జైలు!

ABN , First Publish Date - 2022-05-22T15:56:20+05:30 IST

UAE ప్రభుత్వం ఆన్‌లైన్ బ్లాక్‌మెయిలింగ్‌పై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

UAE లో ఆ నేరానికి రూ.కోటి వరకు జరిమానా.. 10ఏళ్ల జైలు!

అబుదాబి: UAE ప్రభుత్వం ఆన్‌లైన్ బ్లాక్‌మెయిలింగ్‌పై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కోవలోని నేరాలకు భారీ జరిమానాతో పాటు జైలు శిక్షను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా యూఏఈ Public Prosecution కీలక ప్రకటన చేసింది. ఆన్‌లైన్ ద్వారా బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడేవారికి 5 లక్షల దిర్హమ్స్(రూ.1.05కోట్లు) వరకు జరిమానా ఉంటుందని ప్రకటించింది. ఇలాంటి కేసుల్లో దోషిగా తేలితే కనిష్టంగా 2.50 లక్షల దిర్హమ్స్(రూ.52.96లక్షలు) నుంచి 5లక్షల దిర్హమ్స్(రూ.1.05కోట్లు) వరకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. ఉల్లంఘనలకు పాల్పడితే గరిష్టంగా 2ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా ఉంటుందని పేర్కొంది. 


2021 నాటి ఫెడరల్ డిక్రీ లా నం. 34లోని ఆర్టికల్ 42 ప్రకారం ఎలక్ట్రానిక్ నేరాలు, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ జరిమానాలు విధిస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా మరో వ్యక్తిని బ్లాక్‌మెయిల్ చేయడం లేదా బెదిరించడం, వారి ఇష్టానికి వ్యతిరేకంగా ఆన్‌లైన్‌లో ఏదైనా చేయమని అతని/ఆమెపై ఒత్తిడి తెస్తే శిక్షార్హులు అవుతారు. సోషల్ మీడియా ద్వారా ఇలా వేధింపులకు పాల్పడేవారికి ఈ శిక్షలు తప్పవని ఈ సందర్భంగా Public Prosecution హెచ్చరించింది. అంతేగాక వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించేలా బెదిరింపులకు పాల్పడేవారికి జైలు శిక్ష పదేళ్ల వరకు కూడా ఉంటుందని తెలిపింది. 

Updated Date - 2022-05-22T15:56:20+05:30 IST