ఇది నా ఆదేశం, యుద్ధం ఆపండి: యూపీ సాధువు హుకుం

ABN , First Publish Date - 2022-03-04T21:16:29+05:30 IST

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య భయంకరమైన యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో..

ఇది నా ఆదేశం, యుద్ధం ఆపండి: యూపీ సాధువు హుకుం

లక్నో: రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య భయంకరమైన యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఓ సాధువు ఆ రెండు దేశాలకు హుకుం జారీ చేశారు. ''యుద్ధం ఆపండి'' అంటూ ఆయన పేర్కొన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్ల ఘాటుగా స్పందిస్తున్నారు. ఇతను అయోధ్యకు చెందిన ఓ సాధువని పేర్కొంటూ గౌరవ్ సింగ్ సెంగార్ అనే నెటిజన్ ట్విట్టర్‌లో వీడియోను షేర్ చేశారు. మతపరమైన రంగు దుస్తులు ధరించిన సాధువు తీవ్రమైన చూ పులతో కెమెరా వైపు చూస్తూ, యుద్ధం చేస్తున్న రెండు దేశాలకు ఘాటైన సందేశం ఇచ్చారు.


''నేను భారతదేశ ధర్మాచార్యుడిని. నా పేరు తపస్వి ఛావని పీఠాదీశ్వర్ జగత్ గురు పరమ హంస్ ఆచార్య. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆపాలి. రష్యాకు ఉక్రెయిన్ క్షమాపణ చెప్పాలి. ఇది నా ఆదేశం! స్టాప్ వార్'' అంటూ ఆయన హుకుం జారీ చేయడం వీడియోలో కనిపిస్తోంది. ''రష్యా గొప్పది, యుద్ధాన్ని ఆపాలి. ఉక్రెయిన్ తప్పు చేసింది. ఇందువల్ల ఉక్రెయిన్ క్షమాపణ చెప్పాలి. ఇందువల్ల అందరికీ మేలు జరుగుతుంది. అప్పుడే మహావినాశనం ఆగుతుంది'' అని పరమహంస్ ఆచార్య వీడియో చివర్లో తన శాంతిసందేశం ఇచ్చారు. ఆయన సందేశంపై నెజిటన్లు వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. సాధువు ఆదేశాలు విడ్డూరంగా, నవ్వుతెప్పించేలా ఉన్నాయని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించగా, కొందరు మీమ్స్‌తో సమాధానాలిచ్చారు. ఈ వీడియోకు ఇంతవరకూ 1.72 లక్షల వ్యూస్, 5,000 లైక్స్, 1,470 రీట్వీట్లు వచ్చాయి.

Updated Date - 2022-03-04T21:16:29+05:30 IST