భదోహీ బాహుబలి మధ్య ప్రదేశ్‌లో అరెస్ట్..!

ABN , First Publish Date - 2020-08-15T19:05:40+05:30 IST

పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే, భదోహి బాహుబలి నేత విజయ్ మిశ్రా ఎట్టకేలకు పట్టుబడ్డారు...

భదోహీ బాహుబలి మధ్య ప్రదేశ్‌లో అరెస్ట్..!

వారణాసి: పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే, ‘భదోహీ బాహుబలి’ విజయ్ మిశ్రా ఎట్టకేలకు పట్టుబడ్డారు. శుక్రవారం రాత్రి ఉజ్జయినికి 60 కిలోమీటర్ల దూరంలోని అగార్ మాల్వా వద్ద మధ్య ప్రదేశ్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు ముందు ఉజ్జయినీ మహంకాళి ఆలయం వద్ద ఆయన పూజలు చేసినట్టు సమాచారం. సరిగ్గా రాజస్థాన్‌‌లోకి ప్రవేశిస్తారనగా యూపీ పోలీసులు ఆయన కదలికలపై మధ్య ప్రదేశ్ పోలీసులకు ఉప్పందించారు. దీంతో అగార్ ప్రాంతంలోని తనోడియా గ్రామం వద్ద పోలీసులు మిశ్రాను పట్టుకున్నారు. మిశ్రాపై ఇప్పటి వరకు పలు జిల్లాల్లో 73 క్రిమినల్ కేసులు నమోదయ్యాయనీ.. ఆయనను అరెస్టు చేసి జైలుకు తరలిస్తామని భదోహి ఎస్పీ ఆర్‌బీ సింగ్ తెలిపారు. ఓ కాంట్రాక్టర్‌పై బెదిరింపులకు పాల్పడడంతో గత నెల 18న ఆయనపై గూండా యాక్ట్ కింద కూడా కేసు నమోదైంది. మిశ్రాను తీసుకొచ్చేందుకు యూపీ పోలీసు బృందం మధ్య ప్రదేశ్ వెళ్లింది. 


భదోహిలోని గ్యాన్‌పూర్ నియోజకవర్గం నుంచి నిషాద్ పార్టీ తరపున మిశ్రా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తూర్పు యూపీలో కండలు తిరిగిన నేతగా ఆయన గుర్తింపు పొందారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మిశ్రాకు 2017లో ఆ పార్టీ సీట్ ఇవ్వకపోవడంతో.. నిషాద్ పార్టీ నుంచి పోటీ చేసి నాలుగో సారి ఎన్నికయ్యారు. తాను బ్రాహ్మణ వర్గానికి చెందిన వాడినైనందున పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చంపేస్తారని భయంగా ఉందంటూ రెండ్రోజుల క్రితం సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేసిన ఆయన.. అప్పటి నుంచి అదృశ్యమయ్యారు. మిశ్రా పట్టుబడిన కొద్ది గంటలకే ఆయన భార్య, ఎమ్మెల్సీ రాంలాలి మిశ్రా కూడా కనిపించకుండా పోవడం గమనార్హం. మిశ్రా భార్య, కుమారుడిపైనా క్రిమినల్ కేసులు ఉన్నాయనీ.. వారిని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. కాగా గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే మాదిరిగానే పోలీసులు తన తండ్రిని కూడా ఎన్‌కౌంటర్ చేస్తారేమోనంటూ మిశ్రా కుమార్తె రీమా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కేసుల నుంచి దృష్టి మళ్లించేందుకే సదరు కుటుంబం ఈ ఆరోపణలు చేస్తోందని యూపీ పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - 2020-08-15T19:05:40+05:30 IST