వారణాసి, అయోధ్యలో బీజేపీని వెనక్కి నెట్టేసిన సమాజ్‌వాది పార్టీ

ABN , First Publish Date - 2021-05-04T18:53:27+05:30 IST

ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ సారథ్యంలో సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పీ) సత్తా..

వారణాసి, అయోధ్యలో బీజేపీని వెనక్కి నెట్టేసిన సమాజ్‌వాది పార్టీ

వారణాసి: ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ సారథ్యంలో సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పీ) సత్తా చాటుకుంది. వారణాసిలోని 40 జిల్లా పంచాయతీ సీట్లలో 15 సీట్లలో ఎస్‌పీ గెలుపొందింది. బీజేపీ కేవలం 8 సీట్లు సాధించింది. రాజకీయపరంగా వారణాసి, అయోధ్యలను ప్రధాన పార్టీలు కీలకంగా భావిస్తుంటారు. ఈ రెండు జిల్లాలు అభివృద్ధి పరగంగా, రెలిజియస్ టూరిజం పరంగా యోగి కీలకంగా తీసుకున్నవి కావడం విశేషం. అయోధ్యలో 40 జిల్లా పంచాయతీ సీట్లకు గాను 24 సీట్లు సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకోగా, బీజేపీ కేవలం 6 సీట్లకు పరిమితమైంది. తక్కిన 10 సీట్లలో మాయావతి సారథ్యంలోని బీఎస్‌పీ 5, ఇండిపెండెంట్లు 5 గెలుచుకున్నారు.


కారణాలపై ఆత్మపరిశీలన చేసుకుంటాం...

ఎన్నికల ఫలితాలపై బీజేపీ ప్రతినిధి ఒకరు ఆచితూచి వ్యాఖ్యానించారు. పార్టీకి ఊహించని ఫలితాలు రావడానికి కారణాలపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉందని అన్నారు. పార్టీ క్యాడర్‌ ఆగ్రహంతో ఉండటం, తిరుగుబాటు అభ్యర్థుల సంఖ్య కూడా పార్టీ ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపించినట్టు పార్టీ సీనియర్ కార్యకర్త ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు చాలాకాలంగా సమస్యలు వినిపిస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని, తాజా ఫలితాలు ఒక హెచ్చరిక సంకేతమని ఆయన అన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందే వీటిని పార్టీ పరిష్కరిచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ దయనీయ ఫలితాలకు వారణాసిలోని స్థానిక మంత్రులు కారణమని పేరు చెప్పడానికి ఇష్టపడని బీజేపీ కార్యకర్త ఒకరు వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తలతో మంత్రులు మమేకం కావడం లేదని, నేతలు, కార్యకర్తల మధ్య ఏర్పడిన అగాధమే తాజా ఫలితాలకు కారణమన్నారు.


కాగా, యూపీ గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. మొత్తం 3,050 సీట్లలో బీజేపీ బలపరచిన అభ్యర్థులు 918 సీట్లలో లీడింగ్‌లో ఉండగా, ఎస్‌పీ నేతలు 504 సీట్లలో అధిక్యంలో ఉంన్నారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థుల్లో 132 మంది, కాంగ్రెస్ నుంచి 62 మంది, ఇతరులు 608 సీట్లలో ముందంజలో ఉన్నారు.

Updated Date - 2021-05-04T18:53:27+05:30 IST