వలస కార్మికులకు ఉపాధి కల్పనకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందాలు

ABN , First Publish Date - 2020-05-30T21:28:15+05:30 IST

కరోనా వైరస్ మహమ్మారిపై యుద్దం కోసం అమలు చేస్తున్న అష్ట దిగ్బంధనం

వలస కార్మికులకు ఉపాధి కల్పనకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందాలు

లక్నో : కరోనా వైరస్ మహమ్మారిపై యుద్దం కోసం అమలు చేస్తున్న అష్ట దిగ్బంధనం వల్ల ఉపాధి కోల్పోయి, స్వరాష్ట్రానికి తిరిగి వచ్చిన లక్షలాది మంది వలస కార్మకులకు ఉపాధి కల్పించేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చురుగ్గా చర్యలు చేపడుతోంది. దాదాపు 18 లక్షల మంది వలస కార్మికుల నైపుణ్యాలకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకుంది. వీరికి రాష్ట్రంలోనే ఉపాది కల్పించేందుకు కృషి చేస్తోంది. 


ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం నాలుగు సంస్థలతో అవగాహన పత్రాలు (ఎంఓయూ)పై సంతకాలు చేశారు. ఇండస్ట్రీస్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ), లఘు ఉద్యోగ్ భారతి, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌లతో ఈ ఎంఓయూలు కుదుర్చుకున్నారు. 


యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల నుంచి ఉత్తర ప్రదేశ్‌కు తిరిగి వచ్చినవారికి ఉపాధి కల్పించేందుకు తన ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కార్మికుల నైపుణ్యానికి అనుగుణంగా ఉపాధి కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది కార్మికులు ఉన్నారని, వలస కార్మికులు తమ రాష్ట్రానికి గొప్ప సంపద వంటివారని తెలిపారు. ఇంత కాలం వీరు తమ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడ్డారని, ఇకపై నూతన ఉత్తర ప్రదేశ్ నిర్మాణం కోసం కృషి చేస్తారని తెలిపారు. 18 లక్షల మంది వలస కార్మికుల నైపుణ్యాల వివరాలను నమోదు చేయడం పూర్తయినట్లు తెలిపారు. 




Updated Date - 2020-05-30T21:28:15+05:30 IST