UP Election Result 2022: Yogi పోటీ చేసిన చోట పరిస్థితేంటి..? Akhilesh పై కేంద్రమంత్రి గెలుస్తారా..?

ABN , First Publish Date - 2022-03-10T13:51:59+05:30 IST

సీఎం అభ్యర్థి అంటే సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారు. అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. ఎందుకంటే సీఎం అభ్యర్థికి ప్రజల్లో ఉండే ఇమేజ్ అలాంటిది. అయితే, యూపీలో మాత్రం దీనికి భిన్నం.

UP Election Result 2022: Yogi పోటీ చేసిన చోట పరిస్థితేంటి..? Akhilesh పై కేంద్రమంత్రి గెలుస్తారా..?

సీఎం అభ్యర్థి అంటే సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారు. అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. ఎందుకంటే సీఎం అభ్యర్థికి ప్రజల్లో ఉండే ఇమేజ్ అలాంటిది. అయితే, యూపీలో మాత్రం దీనికి భిన్నం. ఇంతకుముందు సీఎంగా చేసిన అఖిలేష్ యాదవ్‌, ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇద్దరూ గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎమ్మెల్సీలుగా ఉంటూనే ముఖ్యమంత్రులుగా తమ ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే, ఈసారి మాత్రం ఇద్దరూ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తుండటం విశేషం. యోగి ఈసారి కూడా బీజేపీ సీఎం అభ్యర్థికాగా, అఖిలేష్ సమాజ్‌వాదీ పార్టీ సీఎం అభ్యర్థిగా ఉన్నారు. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇద్దరి గెలుపు అంచనాలు ఎలా ఉన్నాయి? 


యోగి.. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ

ఉత్తర ప్రదేశ్ సీఎంగా కొనసాగుతున్న యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. గతంలో గోరఖ్‌పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచిన యోగి, ఈసారి అదే నియోజకవర్గ పరిధిలోని గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే శాసనసభలో లేక శాసన మండలిలో సభ్యత్వం ఉండాలనే సంగతి తెలిసిందే. దీంతో ఆయన గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినా, తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఎమ్మెల్సీగా కొనసాగుతున్న యోగి ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే, ఎమ్మెల్యేగా తొలివిజయాన్ని అందుకుంటారు.


గోరఖ్‌పూర్ ఎందుకు..

ఈ నియోజకవర్గం యోగికి బాగా అచ్చొచ్చిన నియోజకవర్గం. ఇంతకుముందు ఆయన గోరఖ్‌పూర్ ప్రాంతం నుంచే 1998-2014 వరకు వరుసగా ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. 2017లో యూపీలో బీజేపీ అధికారంలోకి రావడంతో సీఎం పదవిచేపట్టి, తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో ఇక్కడ సమాజ్‌వాదీ పార్టీ గెలిచినా, తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో తిరిగి బీజేపీ అభ్యర్థి ఎంపీగా గెలిచారు. దీంతో ఇక్కడ యోగికి, బీజేపీకి మంచి పట్టు ఉంది. అందుకే ఆయన గోరఖ్‌పూర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని గోరఖ్‌పూర్ అర్బన్ స్థానాన్ని ఎంచుకున్నారు. ఈ స్థానం నుంచి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీ అభ్యర్థి డా.రాధా మోహన్ దాస్ అగర్వాల్ గెలుపొందారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థిపై 60,730 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2002 నుంచి వరుసగా నాలుగుసార్లు ఆయన ఇక్కడినుంచే ఎమ్మెల్యేగా గెలవడం విశేషం. ఈసారి మాత్రం యోగి పోటీ చేశారు.


గెలుపు ఖాయం

గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి యోగి గెలుపు లాంఛనమే. మెజారిటీ ఎంతన్నదే కీలకం. మాజీ ఎంపీగా, సీఎంగా ఇక్కడ యోగికి ఉన్న ఇమేజ్ ఆయనకు విజయాన్ని సులభంగానే అందిస్తుంది. యోగికి ప్రత్యర్థులుగా ఆజాద్ సమాజ్ పార్టీ నుంచి చంద్రశేఖర్ ఆజాద్ రావణ్, ఎస్పీ నుంచి సభావతి శుక్లా, కాంగ్రెస్ నుంచి చేతనా పాండే పోటీ చేశారు. అయితే వీరెవ్వరూ యోగి ఇమేజ్‌కు సరితూగరు. పైగా ఇక్కడి నుంచి బీఎస్పీ నుంచి అభ్యర్థి లేకపోవడం కలిసొచ్చే అంశం.


అఖిలేష్ యాదవ్ గెలిచేనా?

సమాజ్‌వాదీ పార్టీ సీఎం అభ్యర్థి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తొలిసారిగా ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2019 నుంచి ఆజాంఘర్ ఎంపీగా కొనసాగుతున్న అఖిలేష్, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అంతకుముందు ఆయన ఎమ్మెల్సీగా చేశారు.


గెలుపు అవకాశాలు

కర్హాల్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం శోభారన్ సింగ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థిపై 38,405 ఓట్ల మెజారిటీతో గెలిచారు. శోభారన్ ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు గెలవగా, అందులో మూడుసార్లు ఎస్పీ నుంచే గెలవడం విశేషం. అయితే, ఇప్పుడు అఖిలేష్ ఇక్కడ్నుంచి పోటీ చేయడంతో, శోభారన్ తప్పుకోవాల్సి వచ్చింది. తాజా అంచనాల ప్రకారం అఖిలేష్ యాదవ్ గెలుపు ఖాయంగానే కనిపిస్తోంది. ఇక్కడ అఖిలేష్‌కు ప్రత్యర్థిగా బీజేపీ నుంచి సత్యపాల్ సింగ్ భాగెల్ పోటీ చేశారు. ఆయన మోదీ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. 


సత్యపాల్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆగ్రా నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి గెలిచారు. ఈసారి కర్హాల్ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అయితే, సత్యపాల్‌తో పోలిస్తే, అఖిలేష్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువ. అఖిలేష్ ఇమేజ్‌తోపాటు, ఎస్పీకి ఈ ప్రాంతంలో మంచి పట్టు ఉండటం కలిసొచ్చే అంశం. దీంతో ఈసారి అఖిలేష్ ఇక్కడ్నుంచి గెలిచి అసెంబ్లీకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

Updated Date - 2022-03-10T13:51:59+05:30 IST