లౌడ్‌స్పీకర్లపై యోగి ఆదేశాల అమలు

ABN , First Publish Date - 2022-04-26T19:05:24+05:30 IST

మత సంబంధిత స్థలాల ప్రాంగణాలను దాటి లౌడ్‌స్పీకర్ల శబ్దం

లౌడ్‌స్పీకర్లపై యోగి ఆదేశాల అమలు

లక్నో : మత సంబంధిత స్థలాల ప్రాంగణాలను దాటి లౌడ్‌స్పీకర్ల శబ్దం వినిపించకూడదని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జారీ చేసిన ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. ఈ ఆదేశాలను రాష్ట్రంలోని దాదాపు 17,000 దేవాలయాలు, ఇతర ప్రార్థనా స్థలాల నిర్వాహకులు తమంతట తామే అమలు చేస్తున్నారు. ఈ వివరాలను ఉత్తర ప్రదేశ్ పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ (శాంతిభద్రతలు) ప్రశాంత్ కుమార్ చెప్పారు. 


దేవాలయాలు, ప్రార్థనా స్థలాల్లో లౌడ్‌స్పీకర్లను వినియోగించవచ్చునని, అయితే వీటిని వినియోగించడానికి అనుమతి తీసుకోవాలని, ప్రాంగణాలకు బయటకు వినిపించకుండా వాటిని వాడుకోవాలని యోగి ఆదిత్యనాథ్ ఇటీవల ఆదేశించారు. దీంతో దాదాపు 17,000 దేవాలయాలు, ప్రార్థనా స్థలాల నిర్వాహకులు స్పందించారు. తమంతట తామే లౌడ్‌స్పీకర్ల శబ్దాన్ని తగ్గించారు. 125 స్థలాల్లోని లౌడ్‌స్పీకర్లను తొలగించారు. 


ప్రశాంతంగా నమాజు చేయడానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతి సంఘాల సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 37,344 మంది మత పెద్దలతో పోలీసులు చర్చలు జరిపారు. 


మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి నుంచి ప్రతి రోజూ ఉదయం గంటన్నర సేపు మతపరమైన శ్లోకాలను వినిపించేవారు. ఇక్కడి నుంచి లౌడ్‌స్పీకర్లను తొలగించారు. గోరఖ్‌నాథ్ దేవాలయంలో లౌడ్‌స్పీకర్ల వాల్యూమ్‌ను తగ్గించారు. 



Updated Date - 2022-04-26T19:05:24+05:30 IST