యోగి ఆదిత్యనాథ్ పోటీపై సస్పెన్స్‌కు తెర

ABN , First Publish Date - 2022-01-15T19:54:42+05:30 IST

ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ నేత, ముఖ్యమంత్రి యోగి

యోగి ఆదిత్యనాథ్ పోటీపై సస్పెన్స్‌కు తెర

లక్నో : ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ నేత, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోటీపై సస్పెన్స్‌కు బీజేపీ తెర దించింది. గోరఖ్‌పూర్ సిటీ నుంచి యోగి పోటీ చేస్తారని తెలిపింది. ఆయన అయోధ్య లేదా మధుర నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు చెలరేగిన సంగతి తెలిసిందే. 


యోగి ఆదిత్యనాత్ గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1998 నుంచి 2017 వరకు ఐదుసార్లు వరుసగా గెలిచారు. ఆయన శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. ఆయన గోరఖ్‌పూర్ సిటీ స్థానం నుంచి పోటీ చేస్తారని బీజేపీ ప్రకటించింది. 


2017లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేసింది. యోగి ప్రస్తుతం విధాన సభ సభ్యుడు (ఎంఎల్‌సీ)గా ఉన్నారు. 


ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాగ్‌రాజ్‌లోని సిరతు నుంచి పోటీ చేస్తారని బీజేపీ ప్రకటించింది. ఫిబ్రవరి 10, 14 తేదీల్లో మొదటి, రెండో విడత పోలింగ్ జరిగే స్థానాలకు అభ్యర్థులను బీజేపీ శనివారం ప్రకటించింది. మొదటి దశలో 58 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి కాగా బీజేపీ 57 మంది అభ్యర్థులను ప్రకటించింది. రెండో దశలో ఎన్నికలు జరిగే 55 స్థానాలకుగానూ, 48 మంది అభ్యర్థులను ప్రకటించింది. అదనంగా యోగి, మౌర్య అభ్యర్థిత్వాలను కూడా ప్రకటించింది. 


ఉత్తర ప్రదేశ్‌లో ఏడు దశల్లో శాసన సభ ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.


Updated Date - 2022-01-15T19:54:42+05:30 IST