యూపీ పోలీసులకు యోగి షాక్

ABN , First Publish Date - 2021-09-30T19:05:15+05:30 IST

తీవ్ర నేరాల్లో చిక్కుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని సర్వీస్ నుంచి

యూపీ పోలీసులకు యోగి షాక్

లక్నో : తీవ్ర నేరాల్లో చిక్కుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని సర్వీస్ నుంచి డిస్మస్ చేస్తూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు ఇచ్చారు. కళంకిత అధికారులను పోలీసు వ్యవస్థలో ప్రధాన పదవుల్లో నియమించరాదని ఆదేశించారు. కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఈ వివరాలను వెల్లడించింది. 


ఇలాంటివారికి పోలీసు శాఖలో స్థానం లేదని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. రుజువులతో సహా ఇటువంటివారిని గుర్తించి, ఓ జాబితాను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. నిబంధనల ప్రకారం ఈ అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


ముఖ్యమంత్రి ఆగ్రహానికి కారణం సెప్టెంబరు 28న జరిగిన సంఘటన. ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఓ హోటల్‌పై పోలీసులు సెప్టెంబరు 28న దాడి చేశారు. ఈ సమయంలో కాన్పూరు వ్యాపారి మనీశ్ గుప్తా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆరుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ సంఘటనపై ఎస్‌పీ నార్త్ దర్యాప్తు చేస్తారని గోరఖ్ పూర్ ఎస్ఎస్‌పీ విపిన్ చెప్పారు.


Updated Date - 2021-09-30T19:05:15+05:30 IST