మే 4వరకు పోలీసులకు సెలవుల రద్దు...సీఎం నిర్ణయం

ABN , First Publish Date - 2022-04-19T13:15:33+05:30 IST

పోలీసుల సెలవుల విషయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు....

మే 4వరకు పోలీసులకు సెలవుల రద్దు...సీఎం నిర్ణయం

లక్నో: పోలీసుల సెలవుల విషయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూపీలోని పోలీసు  పరిపాలనా అధికారుల సెలవులను మే 4వతేదీ వరకు రద్దు చేస్తూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. సెలవులో ఉన్న వారందరూ 24 గంటల్లోగా రిపోర్టు చేయాలని సీఎం యోగి కోరారు.రాబోయే పండుగల సందర్భంగా శాంతి భద్రతలను పరిరక్షించేందుకు వచ్చే 24 గంటల్లోగా మత పెద్దలు, ప్రముఖులతో చర్చలు జరపాలని పోలీసు స్టేషన్‌ నుంచి ఏడీజీ స్థాయి వరకు అధికారులను సీఎం ఆదేశించారు. మతపరమైన ప్రదేశాల్లో మైక్‌లను వినియోగించవచ్చని, అయితే వాటి ఏర్పాటుకు కొత్తగా అనుమతి అవసరం లేదని సీఎం పేర్కొన్నారు. 


యూపీలోని సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించాలని, శాంతిభద్రతల పరిస్థితిని గమనించడానికి డ్రోన్లను ఉపయోగించాలని సీఎం సూచించారు. ప్రతీరోజు సాయంత్రం పోలీసు బలగాలు తప్పనిసరిగా ఫుట్ పెట్రోలింగ్ చేయాలని, పోలీసు రెస్పాన్స్ వెహికల్స్ తిరగాలని కోరారు. ‘‘రంజాన్ మాసం జరుగుతోంది. ఈద్ పండుగ, అక్షయ తృతీయ ఒకే రోజున జరిగే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో ప్రస్తుత శాంతియుత వాతావరణాన్ని కాపాడాలి’’ అని సీఎం చెప్పారు.ప్రతి ఒక్కరికీ వారి మత సిద్ధాంతాల ప్రకారం పూజా విధానాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉందని యోగి పేర్కొన్నారు. ‘‘మైక్‌లు ఉపయోగించినప్పటికీ ఆవరణలో శబ్దం రాకుండా చూసుకోండి. ఇతరులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోండి.


కొత్త సైట్లలో మైక్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదు’’ అని సీఎం చెప్పారు. అనుమతి లేకుండా ఎలాంటి మతపరమైన ఊరేగింపులు జరపకూడదు.. అనుమతి ఇచ్చే ముందు శాంతి సామరస్యాలను కాపాడేందుకు నిర్వాహకుల నుంచి అఫిడవిట్ తీసుకోవాలి. సంప్రదాయబద్ధమైన మతపరమైన ఊరేగింపులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని సీఎం కోరారు. లక్నోలోని గుడంబా ప్రాంతంలో బాలికపై వేధింపుల ఘటన నివేదికలో పోలీసుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చిందని సీఎం చెప్పారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, సంబంధిత ఎస్‌హెచ్‌ఓను సస్పెండ్ చేయాలని, సబ్‌ఇన్‌స్పెక్టర్‌, బీట్‌ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదేశాలు జారీ చేశారు.


Updated Date - 2022-04-19T13:15:33+05:30 IST