యూపీలో బీజేపీకి షాక్‌

ABN , First Publish Date - 2022-01-12T08:19:57+05:30 IST

: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లోని కీలక మంత్రి స్వామిప్రసాద్‌ మౌర్య తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి.. సమాజ్‌వాది పార్టీ(ఎస్పీ)లో చేరారు. తన వెంట 15మంది ఎమ్మెల్యేలు కూడా వస్తా రని ప్రకటించారు....

యూపీలో బీజేపీకి షాక్‌

మంత్రి పదవికి స్వామి మౌర్య రాజీనామా

సమాజ్‌వాది పార్టీలో చేరిక

అదే దారిలో మరో నలుగురు ఎమ్మెల్యేలు

యూపీలో అఖిలేశ్‌తో, గోవాలో కాంగ్రెస్‌,

తృణమూల్‌తో కలిసి ఎన్సీపీ పోటీ: పవార్‌ 

ఢిల్లీలో బీజేపీ అగ్రనేతల కీలక సమావేశం

తొలి విడతకు అభ్యర్థుల ఎంపికపై చర్చ

 

లఖ్‌నవ్‌/న్యూఢిల్లీ, జనవరి 11: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లోని కీలక మంత్రి స్వామిప్రసాద్‌ మౌర్య తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి.. సమాజ్‌వాది పార్టీ(ఎస్పీ)లో చేరారు. తన వెంట 15మంది ఎమ్మెల్యేలు కూడా వస్తా రని ప్రకటించారు. అన్నట్లుగానే గంటల వ్యవధిలోనే నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు రోషన్‌లాల్‌ వర్మ, బ్రిజేశ్‌ ప్రజాపతి, భగవతి సాగర్‌, వినయ్‌ శక్య ఆ పార్టీని వీడారు. మౌర్య ఎక్కడుంటే తామూ అక్కడే ఉంటామ న్నారు. పీటీఐ మాత్రం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మౌర్య వెంట వెళ్లినట్లు పేర్కొంది. కాగా, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, బలమైన ఓబీసీ నేతగా పేరున్న స్వామిప్రసాద్‌ మౌర్య 2016లో బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) నుంచి బీజేపీలో చేరారు. ఆ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్ని కై యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే సీఎం యోగితో తనకు సిద్ధాంతపరమైన వైరుధ్యాలున్నా మంత్రివర్గంలో అంకిత భావం తో పని చేశానని, కానీ.. ప్రభుత్వం దళితుల పట్ల, ఓబీసీలు, రైతులు, నిరుద్యోగులు, చిన్న వ్యాపారుల పట్ల అణచివేత ధోరణి అవలంభించిందని మౌర్య ఆరోపించారు. అందుకే తాను వైదొలగుతున్నట్లు ట్విటర్‌లో ప్రకటించారు. తానేంటో బీజేపీకి ఈ ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. కాగా, మౌర్యను బుజ్జగించేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని సమాచారం. ఇక ఎస్పీలోకి స్వామిప్రసాద్‌ మౌర్య రాకను ఆ పార్టీ అధినేత అఖిలేశ్‌యాదవ్‌ స్వాగతించారు. ఈ మేరకు అఖిలేశ్‌ను మౌర్య కలిసిన ఫొటోను ఆ పార్టీ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. అయితే స్వామిప్రసాద్‌ మౌర్య ఇంకా ఏ పార్టీలోనూ చేరలేదని ఆయన కుమార్తె, బీజేపీ ఎంపీ సంఘమిత్ర మౌర్య ప్రకటించారు. రెండు రోజుల తరువాతే ఆయన నిర్ణయాన్ని వెల్లడిస్తారని ఆమె పేర్కొన్నారు. 


అఖిలేశ్‌తో పవార్‌ పొత్తు..

యూపీలో తమ పార్టీ సమాజ్‌వాది పార్టీతో కలిసి పోటీ చేస్తుందని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ మంగళవారం ముంబయిలో ప్రకటించారు. గోవాలోనూ కాంగ్రెస్‌, టీఎంసీతో కలిసి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే గోవాలో టీఎంసీతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుంటుందన్న వార్తలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఖండించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. యూపీ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో మంగళవారం బీజేపీ అగ్రనేతల కీలక సమావేశం జరిగింది. యూపీ తొలి విడత ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు నిర్వహించిన ఈ భేటీలో హోం మంత్రి అమిత్‌షా, సీఎం యోగి ఆదిత్యనాథ్‌, డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్‌ మౌర్య, యూపీ బీజేపీ చీఫ్‌ స్వతంత్రదేవ్‌ సింగ్‌ పాల్గొన్నారు. కరోనా సోకడంతో ఐసోలేషన్‌లో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్‌గా హాజరయ్యారు. సమావేశంలో అభ్యర్థుల ఎంపికతోపాటు రాజీనామాల అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రచారం ప్రారంభించింది. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో ఇంటింటి ప్రచారం చేస్తోంది. 


ఎస్పీయే ప్రత్యామ్నాయం: అఖిలేశ్‌

బీజేపీకి ప్రత్యామ్నాయం సమాజ్‌వాది పార్టీయేనని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని ప్రజలే ఓడిస్తారన్నారు. మంగళవారం ఎస్పీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎస్పీ అధికారంలోకి వస్తే విద్యుత్తును 300 యూనిట్ల దాకా ఉచితంగా అందిస్తామని, యువతకు ఉచిత ల్యాప్‌టా్‌పలు ఇస్తామని, రైతులకు పంటలసాగు కోసం ఉచితంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. 


యోగి 80-20పై ప్రియాంక ఆగ్రహం..

యూపీ ఎన్నికలు 80ు, 20ుకు మధ్య జరగను న్నాయని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల నుంచి యువత దృష్టిని పక్కదోవ పట్టించేందుకే యోగి ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలను విద్య, ఉద్యోగాల అంశంగా మార్చాలన్నారు.


బీజేపీకి గిఫ్టుగా తాళం 

పంపిన ఎస్పీ నేత 

యూపీలో ఎన్నికల వాతావర ణం హీటెక్కుతోంది. మంత్రి స్వామిప్రసాద్‌ మౌర్య, నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ పార్టీ కార్యాలయానికి ఇక తాళం వేసుకోవాల్సిందేనని సమాజ్‌వాది పార్టీ ప్రతినిధి ఐపీ సింగ్‌ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి తాళాన్ని బహుమతిగా పంపించారు.


పోటీకి మాయావతి దూరం..

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజనసమాజ్‌ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి పోటీ చేయడంలేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్‌సీ మిశ్రా తెలిపారు. తాను కూడా పోటీ చేయడంలేదన్నారు. తమ పార్టీ మాత్రం 403 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించుతుందన్నారు. మిశ్రా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మాయావతి ఎమ్మెల్యే కాదు.. ఎంపీ కాదు.

Updated Date - 2022-01-12T08:19:57+05:30 IST