లఖ్‌నవూ: అందరూ అనుకున్నట్లుగానే మత, సాంస్కృతిక పరమైన అంశాలకు ఉత్తరప్రదేశ్ బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. కాశీ విశ్వనాథ్, అయోధ్య ఆలయాల అభివృద్ధి సహా 2025లో నిర్వహించబోయే మహా కుంభమేళాకు ఈ బడ్జెట్ నుంచే కసరత్తు ప్రారంభించారు. 6 లక్షల కోట్ల రూపాయలతో రూపొందించిన 2022-23 ప్రతిపాదిత బడ్జెట్‌లో మహా కుంభమేళా ఏర్పాట్ల కోసం ఈ బడ్జెట్‌లోనే 100 కోట్ల రూపాయలను కేటాయించారు. అయోధ్య, కాశీ, వింద్యా, చిత్రకోట్ ధాం ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అభివృద్ధికి 50 లక్షల రూపాయలు కేటాయించారు. పీడబ్ల్యూడీ (Public Works Department)కి 500 కోట్ల రూపాయలు కేటాయించగా, ఈ నిధులతో వారణాసిలో దర్శన్ అనే రహదారిని నిర్మించనున్నట్లు యోగి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో పేర్కొంది. కాశీతో పాటు అయోధ్యకు సైతం సమ ప్రాధాన్యం కల్పించారు. ఆలయ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, పర్యాటక అభివృద్ధి చర్యలకు నిధులు సమకూర్చే విషయంలో ఇరు ప్రాంతాలకు పెద్ద పీట వేశారు. కాశీలో చేసిన అభివృద్ధి పనుల వల్ల లక్ష మందికి పైగా భక్తులు, పర్యాటకులు పెరిగారని, అందుకే నగరంలో మెట్రో అభివృద్ధితో పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపుతోందని యూపీ సీఎం యోగి అన్నారు.
ఇవి కూడా చదవండి