యూపీ ఎన్నికలు : గోరఖ్‌పూర్ నుంచి యోగి ఆదిత్యనాథ్ నామినేషన్... అమిత్ షా హాజరు...

ABN , First Publish Date - 2022-02-04T19:27:32+05:30 IST

ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కోసం బీజేపీ నేత, ముఖ్యమంత్రి యోగి

యూపీ ఎన్నికలు : గోరఖ్‌పూర్ నుంచి యోగి ఆదిత్యనాథ్ నామినేషన్... అమిత్ షా హాజరు...

లక్నో : ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కోసం బీజేపీ నేత, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో అమిత్ షా, బీజేపీ అగ్ర నేతలు పాల్గొన్నారు. అంతకుముందు గోరఖ్‌నాథ్ దేవాలయంలో యోగి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


యోగి ఆదిత్యనాథ్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మరికొందరు ఉన్నత స్థాయి బీజేపీ నేతలు హాజరయ్యారు.  శాసన సభ ఎన్నికల్లో యోగి పోటీ చేయడం ఇదే తొలిసారి. గతంలో ఆయన ఐదుసార్లు గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 


ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరుగుతాయి. గోరఖ్‌పూర్ అర్బన్ శాసన సభ నియోజకవర్గానికి పోలింగ్ మార్చి 3న జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడతాయి. 


యోగి నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ఆయనతోపాటు అమిత్ షా ఓ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, రాజ్యాంగంలోని అధికరణ 370ని బీజేపీ  నేతృత్వంలోని ప్రభుత్వం రద్దు చేసిందని, అదేవిధంగా అయోధ్యలో రామాలయం నిర్మాణం కలను వాస్తవంగా సాకారం చేసిందని చెప్పారు. 2017లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగింట మూడొంతుల ఆధిక్యంతో గెలిచిందన్నారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహాకూటమిని బీజేపీ ఓడించిందని చెప్పారు. గడచిన ఐదేళ్ళలో ఉత్తర ప్రదేశ్ అద్భుతంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. తన ప్రభుత్వ విధానాల వల్ల అన్ని వర్గాలు లబ్ధి పొందాయన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై ఎవరూ వేలెత్తి చూపలేరని చెప్పారు. 


అమిత్ షా మాట్లాడుతూ, యూపీ శాసన సభ ఎన్నికల్లో బీజేపీకి 300కుపైగా స్థానాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రాన్ని మాఫియా నుంచి విముక్తి చేశారన్నారు. యోగి-మోదీ ప్రభుత్వాలు పేదల చెంతకు అభివృద్ధిని తీసుకొచ్చాయన్నారు. 


Updated Date - 2022-02-04T19:27:32+05:30 IST