యూపీ ఎన్నికలు : కులతత్వ మీడియాపై మాయావతి ఆగ్రహం

ABN , First Publish Date - 2022-02-02T21:57:23+05:30 IST

బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) అధినేత్రి మాయావతి ఉత్తర ప్రదేశ్

యూపీ ఎన్నికలు : కులతత్వ మీడియాపై మాయావతి ఆగ్రహం

ఆగ్రా : బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) అధినేత్రి మాయావతి ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కోసం తొలి బహిరంగ సభలో బుధవారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా మీడియాను కూడా విమర్శించారు. తాను కనిపించడం లేదని కులతత్వ మీడియా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 


బీజేపీ, కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టాయని, వాటిని తిరస్కరించాలని ప్రజలను మాయావతి కోరారు. తాను కనిపించడం లేదని కులతత్వ మీడియా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బీఎస్‌పీ నేతలు కనిపించడం లేదంటూ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. కోవిడ్-19 పరిస్థితి మెరుగుపడిన తర్వాత తాను లక్నో వచ్చానన్నారు. లక్నో నుంచే తాను పని చేస్తున్నానని చెప్పారు. తన తల్లి మరణించడంతో తాను రెండు రోజులపాటు ఢిల్లీ వెళ్ళానన్నారు. తాను ఇతర రాష్ట్రాల కోసం లక్నో నుంచి పని చేస్తున్నానని తెలిపారు. తనకు నిన్న (మంగళవారం) తీరిక దొరికిందని, నేడు (బుధవారం) రాష్ట్రానికి దళిత రాజధాని అయిన ఆగ్రా ప్రజలను కలుసుకునేందుకు వచ్చానని చెప్పారు. 


శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు బీఎస్‌పీకే ఓటు వేయాలని కోరారు. మీడియా వెల్లడిస్తున్న  ప్రీ-పోల్ సర్వేలు, ఒపీనియన్ పోల్స్ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని పార్టీ మద్దతుదారులను కోరారు. ఈ సర్వేలన్నీ విఫలమవుతాయన్నారు. బీఎస్‌పీ అధికారంలో ఉన్నపుడు అద్భుతంగా పని చేసినట్లు తెలిపారు. బీఎస్‌పీ అమలు చేసిన కార్యక్రమాలను, పధకాలను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీలు కాపీ కొట్టాయన్నారు. అన్ని కులాలు, వర్గాల సంక్షేమం కోసం బీఎస్‌పీ ప్రభుత్వాన్ని మళ్లీ తీసుకురావాలని కోరారు. ఓట్లు వేసేటపుడు కోవిడ్-19 మహమ్మారి నిరోధక నిబంధనలను పాటించాలని కోరారు. 


ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. 


Updated Date - 2022-02-02T21:57:23+05:30 IST