తిరుగులేని బీజేపీ ప్రామాణికత

ABN , First Publish Date - 2021-04-13T06:42:21+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఘట్టం పూర్తయి ఫలితాలు వెలువడక ముందే ఆ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ ఘన విజయం ఖాయమని తృణమూల్ కాంగ్రెస్...

తిరుగులేని బీజేపీ ప్రామాణికత

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఘట్టం పూర్తయి ఫలితాలు వెలువడక ముందే ఆ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ ఘన విజయం ఖాయమని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలే అంగీకరించినట్లు స్పష్టమవుతోంది. తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొంతమంది జర్నలిస్టులు, న్యాయవాదులతో చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. తన మాటల్ని పూర్తిగా ప్రచారం చేయలేదని వాదిస్తున్న ప్రశాంత్ కిషోర్ ఎంత బుకాయించినప్పటికీ కొన్ని విషయాలను స్పష్టం చేశారు. అవి: ఒకటి- ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బెంగాల్‌లో అమితమైన ప్రజాదరణ ఉన్నది. కొంతమందికి మోదీ దేవుడితో సమానం మొత్తం దేశంలోనే మోదీ పట్ల ప్రజల్లో ఆరాధనా భావం నెలకొన్నది; రెండు- 27 శాతం దళితులు పూర్తిగా మోదీ వైపే మొగ్గు చూపుతున్నారు; మూడు- వామపక్షాలనుంచి వచ్చిన అనేకమంది కార్యకర్తలు బిజెపికోసం అంకిత భావంతో కృషి చేస్తున్నారు; నాలుగు- పెద్ద ఎత్తున హిందువులు బిజెపిని బలపరుస్తున్నారు.


ఈ నాలుగు అంశాలు చాలు, ఇవాళ దేశంలో మోదీ సారథ్యంలో బిజెపికి తిరుగులేదని స్పష్టం చేయడానికి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3 అసెంబ్లీ సీట్లు సాధించిన భారతీయ జనతాపార్టీలో ఇవాళ బెంగాల్ ప్రజలు తమ భవిష్యత్ ను చూస్తున్నారంటే దేశంలో బిజెపి అతి వేగంగా విస్తరిస్తోందని, మొత్తం దేశ ప్రజలకు మోదీ ఒక ఆశాదీపంగా కనిపిస్తున్నారని అర్థమవుతుంది. మోదీ పేద ప్రజలకు, రైతులకు అనుకూల నేత కాదని, ఆయన సంపన్నులకు పెద్ద పీట వేస్తారని 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఆయన వ్యతిరేకులు దుష్ప్రచారం చేస్తూనే వచ్చారు. 2019 ఎన్నికలకు ముందు పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ పై జరిగిన వ్యతిరేక ప్రచారం అంతా ఇంతా కాదు, కాని ప్రజలు ఈ ప్రచారాన్ని తిరస్కరించి మోదీ సారథ్యంలో బిజెపికి మరింత మెజారిటీతో పట్టం కట్టారు. ప్రజలు ఛీ కొట్టినప్పటికీ మళ్లీ ప్రతిపక్షాలు తమ దుష్ప్రచారాన్ని ఈ రెండేళ్లలోనే తారస్థాయికి తీసుకువెళ్లాయి. మైనారిటీలను, రైతులను రెచ్చగొట్టాయి. కాని ప్రజలు అమాయకులు కారని అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు, ఇప్పుడు పశ్చిమబెంగాల్ ఎన్నికల్లోనూ అది రుజువు కానున్నది.


బూటకపు ఓటు బ్యాంకు రాజకీయాలతో ప్రజలను మోసపుచ్చకుండా, కుహనా లౌకిక వాదాన్ని ఆశ్రయించకుండా దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను కాపాడే పారదర్శకమైన పవిత్రమైన, అవినీతి రహితమైన, నాణ్యమైన ప్రభుత్వం బిజెపి వల్లనే లభించగలదని, అందువల్లే ఎక్కడ బిజెపి ప్రత్యామ్నాయంగా అవతరిస్తుందో అక్కడ ప్రజల తిరుగులేని ఆదరణ సాధిస్తుందని వర్తమాన చరిత్ర రుజువు చేస్తోంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రజల మనోభావాల్లో ఏర్పడుతున్న మార్పులే అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో కూడా ఏర్పడతాయని ఈ నేపథ్యంలో అర్థంచేసుకోవాల్సి ఉంటుంది. గత ఏడు దశాబ్దాలకు పైగా దేశంలో జరిగిన దుర్మార్గాలతో గత ఆరు సంవత్సరాల్లో మోదీ హయాంలో జరిగిన అభివృద్ధిని దేశంలో అందరు ప్రజలలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా పోల్చి చూసే రోజులు ఆసన్నమయ్యాయి.


ఉదాహరణకు ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్న తిరుపతి నియోజకవర్గం భాగంగా ఉన్న రాయలసీమ వెనుకబడిన ప్రాంతం అయినప్పటికీ అధికారం విషయంలో ఎప్పుడూ వెనుకబడిలేదని ప్రజలకు తెలుసు. నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి విభజిత ఆంధ్రప్రదేశ్ వరకూ రాష్ట్రాన్ని ఏలిన పాతిక మంది ముఖ్యమంత్రుల్లో పన్నెండు సార్లు రాయలసీమకు చెందినవారు ఎన్నికయ్యారు. రాయలసీమ ప్రతి జిల్లా నుంచి కనీసం ఒకరు ముఖ్యమంత్రి హోదా నిర్వహించారు. కొందరు సుదీర్ఘకాలం రెండు సార్లు పదవులను అనుభవించారు. కాని ఈ ముఖ్యమంత్రులలో అత్యధికులు తమ కుటుంబాలు, వారసులు, వర్గీయులను ప్రోత్సహించడం పైనే తమ దృష్టి సారించారు తప్ప రాయలసీమలో వెనుకబాటుతనాన్ని,నిరుద్యోగాన్ని నిర్మూలించలేకపోయారు. భారీ పరిశ్రమలను నెలకొల్పలేకపోయారు. 


తిరుపతి నియోజకవర్గంలో అనంతశయనం అయ్యంగార్, సి.దాస్ లనుంచీ ఇప్పటి వరకూ మెజారిటీ ఎంపిలు కాంగ్రెస్ నుంచే గెలుపొందారు. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థిని ఆరు సార్లు ప్రజలు గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గానికి చేసింది ఏమిటి? గతంలో కాంగ్రెస్ ఎంపిలు కానీ, గత ఎన్నికల్లో గెలిచిన వైసీపీ కానీ ఈ నియోజకవర్గానికి చేసినది ఏమీ లేదు. 


గతంలో తిరుపతిలో బిజెపి తరపున ఎంపిగా ఉన్న వెంకటస్వామి తన ఎంపి నిధులతో ఈ ప్రాంత అభివృద్దికి ఎంతో కృషి చేశారన్న విషయం ప్రజలు ఇంకా మరిచిపోలేదు. 2014లో బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఐటి తో పాటు భారత శాస్త్రీయ విద్యా పరిశోధనా సంస్థ, టూరిజం మేనేజ్ మెంట్, కలినరీ ఇనిస్టిట్యూట్, ఓషియన్ టెక్నాలజీ సంస్థలతో పాటు అనేక కేంద్ర సంస్థల్ని తిరుపతిలో ఏర్పాటు చేసింది. తిరుపతిని స్మార్ట్ సిటీగా ప్రకటించి రూ. 2వేల కోట్లతో 62 ప్రాజెక్టులను అమలు చేస్తోంది. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చెందింది మోదీ హయాంలోనే. పారిశ్రామిక సముదాయాలు, మెగా ఫుడ్ ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్లు, జాతీయ రహదారి విస్తరణలు లాంటి భారీ మౌలిక సదుపాయాలు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అమలు అవుతున్నాయి. పవిత్ర పుణ్య స్థలమైన తిరుపతిని మోదీ నియోజకవర్గమైన వారణాసితో సమానంగా అభివృద్ధి పరచడమే లక్ష్యంగా కేంద్రంలో బిజెపి సర్కార్ ఇప్పటికే పనిచేయడం ప్రారంభించింది. 


దిగ్భ్రాంతికర విషయం ఏమిటంటే తిరుమలలో ఒక ప్రధాన అర్చకుడిని ముఖ్యమంత్రి తన ఇంటికి పిలిపించి, తనను విష్ణుమూర్తిగా కొనియాడేలా చేయడం. ఒక నియోజకవర్గంలో గెలిచేందుకు వైసీపీ నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అన్ని వ్యవస్థల్నీ దాసోహం చేసుకుంటారని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. ఈ ప్రధాన అర్చకుడికి ముఖ్యమంత్రి పై అంత భక్తి ఉంటే ఆయన నివాసంలో ఏకాంత సేవ చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు కాని పవిత్రమైన తిరుమలలో వెంకన్న సాన్నిధ్యంలో పనిచేస్తూ ఒక రాజకీయ నాయకుడిని విష్ణుమూర్తిగా అభివర్ణించడం కోట్లాది హిందువుల మనోభావాలను గాయపరిచింది. ‘హరిని కీర్తించే నోట నరుని కీర్తించబోన’ని సాళువ నరసింగరాయని ధిక్కరించిన అన్నమయ్య పుట్టిన ఈ నేలలో రమణ దీక్షితులు లాంటి ప్రధాన పూజారి లాంటి వారు చేసే వ్యాఖ్యలతో సామాజిక రాజకీయ పరిస్థితులు ఎంత దిగజారిపోయాయో అర్థమవుతోంది. అందుకే భారత దేశంలో పవిత్రత, పారదర్శకత, నాణ్యత, సమర్థత అన్న విలువలను ప్రజలు బిజెపిలో చూస్తున్నారంటే ఆశ్చర్యపడనవసరం ఏమీ లేదు.


వై. సత్యకుమార్

బిజెపి జాతీయ కార్యదర్శి

Updated Date - 2021-04-13T06:42:21+05:30 IST