నిరుపయోగంగా విలువైన స్థలాలు

ABN , First Publish Date - 2022-01-23T04:32:31+05:30 IST

గిద్దలూరు పట్టణంలో కోట్ల రూపాయల విలువైన మున్సిపల్‌ ఆస్తులు నిరుపయోగంగా ఉన్నాయి.

నిరుపయోగంగా విలువైన స్థలాలు
స్టేషన్‌ రోడ్డులో ఖాళీగా ఉన్న మహిళా బ్యాంక్‌ స్థలం

ఇప్పటికే కొన్ని ఆక్రమణలో

మేల్కొంటే లక్షల్లో ఆదాయం 

షాపింగ్‌ కాంప్లెక్స్‌ల ద్వారా చిరు వ్యాపారులకు ఊరట

గిద్దలూరు, జనవరి 22 : గిద్దలూరు పట్టణంలో కోట్ల రూపాయల విలువైన మున్సిపల్‌ ఆస్తులు నిరుపయోగంగా ఉన్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు ముందు చూపుతో వ్యవహరించి ఆ స్థలాల్లో అటు ప్రభుత్వ కార్యాలయాలు గానీ, ఇటు షాపింగ్‌ కాంప్లెక్స్‌లు గానీ ఏర్పాటు చేస్తే నెలకు లక్షల్లో ఆదాయం వస్తుంది. ఈ అద్దెలతో నెలకు ఒక వీధిలో సిమెంటు రోడ్డు, మురికినీటి కాలువలను సైతం నిర్మించుకోవ చ్చు. లేదా ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించవచ్చని పలువురు భావిస్తున్నారు. అయినా ఏ ఒక్క అధికారికీ చిత్తశుద్ధి లేదు.  పైగా ఖాళీ స్థలాల పరిరక్షణపై నిర్లక్ష్యం కారణంగా అడుగు అడుగు చొప్పున మొత్తం స్థలాలన్నీ ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉంది. పట్టణం నడిబొడ్డున గ్రంథాలయం చుట్టూ కోట్ల రూపాయల విలువైన స్థలం ఉన్నది. ఈ ప్రాంతంలో సెంట్‌ భూమి కోటి రూపాయలు ధర పలుకుతోంది. ఈ స్థలం ఆక్రమణలకు గురికాకుండా చిరువ్యాపారులకు కేటాయించడంతో వారు బంకులు, పాకలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు.  రైల్వేస్టేషన్‌ రోడ్డులో గతంలో మహిళా బ్యాంక్‌ నిర్మించిన స్థలం ఖాళీగా ఉన్నది. అదిడశిథిలావస్థకు చేరుకుని బ్యాంక్‌ భవనం పడిపోగా ప్రస్తుతం ఈ స్థలం ఖాళీగా ఉన్నది. కాలేజీ రోడ్డులో చిన్న మసీదు వెనుక ఉన్న దిగుడు బావి స్థలం, వీరన్న బావి, జువ్విళ్ల బావి స్థలాలు కూడా ఖాళీగా ఉన్నాయి.  అటవీశాఖ కార్యాలయం పక్కన ఉన్న కోట్ల రూపాయల విలువైన స్థలంలో గతంలో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మితం కాగా ఇంకా దాని ముందు కొంతమేర మున్సిపల్‌ స్థలం మిగిలి ఉన్నది. రాచర్ల రోడ్డులో సాయిబాబా దేవాలయం వెనుక వైపున, ఇంకా పలు ముఖ్యమైన ప్రాంతాలలో మున్సిపల్‌ స్థలాలన్నీ ఖాళీగా పడిఉన్నాయి. ప్రస్తుతం మున్సిపల్‌ కార్యాలయానికి ఇరువైపులా, అటవీ శాఖ కార్యాలయం ఎదురుగా, స్టేషన్‌ రోడ్డులో, పాత బందెలదొడ్డి ప్రాంతాలలో రూములు, షెడ్‌లను నిర్మించి అద్దెలకు ఇవ్వడంతో అద్దె రూపంలో మున్సిపాలిటీ ప్రతినెలా పొందుతున్నది. ఈ విధంగానే కోట్ల రూపాయల విలువైన స్థలాలు ఖాళీగా ఉండి వాటిపై ఆక్రమణదారుల కన్నుపడి కబ్జాకు గురవుతున్నాయి.  ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఉన్న స్థలాలను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. ప్రధాన సెంటర్లలో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు లేదా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తే ప్రతి నెలా లక్షల రూపాయల్లో అద్దెలుగా మున్సిపాలిటీకి ఆదాయం లభించే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆమేరకు చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా వందలాది మంది చిరువ్యాపారులు రోడ్ల మీద కాకుండా చిన్న చిన్న షాపులలో వ్యాపారాలు చేసుకునేలా కూడా చేసుకునేలా వెసులుబాటు కలుగుతోంది. దానివల్ల పట్టణాన్ని పీడిస్తున్న ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. 

షాపుల నిర్మాణానికి పరిశీలిస్తున్నాం

రామకృష్ణయ్య, మున్సిపల్‌ కమిషనర్‌

పట్టణంలో నిరుపయోగంగా పడివున్న మున్సిపల్‌ స్థలాల విషయమై కమిషనర్‌ వద్ద ఆంధ్రజ్యోతి ప్రస్తావించింది. ఈ స్థలాల్లో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మించి చిరు వ్యాపారులకు అద్దెకు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నాం. ఆమేరకు ఎమ్మెల్యే అన్నా రాంబాబు దృష్టికి, మున్సిపల్‌ పాలకవర్గం దృష్టికి తీసుకు వెళ్లనున్నాం.  పట్టణంలోని చాలా సచివాలయాలు అద్దె భవనాలలో నడుస్తుండడం వలన లక్షల్లో అద్దె చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఖాళీగా ఉన్న మున్సిపల్‌ స్థలాల్లో కింద షాపులు నిర్మించి పైన సచివాలయాలను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. స్టేషన్‌రోడ్డులో, బందెలదొడ్డి స్థలంలో ఇలాగే కొందరు షాపులను వారే నిర్మించుకుని ప్రతినెలా మున్సిపాలిటీకి అద్దె కట్టిన విధంగా మిగతా స్థలాల్లో కూడా ఇటు షాపులు, దానిపై సచివాలయాలు నిర్మించుకుంటే అటు అద్దె రావడమే కాకుండా ఎంతో మందికి ఉపాధి కూడా లభిస్తుంది. ఆమేరకు చర్యలు తీసుకుంటాం. 




Updated Date - 2022-01-23T04:32:31+05:30 IST