చెక్కు చెదరని మహాత్ముడు

ABN , First Publish Date - 2022-08-12T05:23:38+05:30 IST

స్వాతంత్య్ర పోరాటం అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది మహానీయుడు జాతిపిత మహాత్మాగాంధీ. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఎక్కడికి వెళ్లినా మనకు ఆయన విగ్రహాలు కనిపిస్తాయి. వాటిల్లో బషీరాబాద్‌ మండలం జీవన్గిలోని జాతిపిత విగ్రహానికి ఓ ప్రత్యేకత ఉంది.

చెక్కు చెదరని మహాత్ముడు
జీవన్గిలో గాంధీ విగ్రహం

  • ఆ విగ్రహానికి 40 ఏళ్లు
  • బషీరాబాద్‌ మండలంలో ఒకే ఒక  గాంధీ విగ్రహం
  •  1982లో జీవన్గిలో ఏర్పాటు

బషీరాబాద్‌, ఆగస్టు11 : స్వాతంత్య్ర పోరాటం అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది మహానీయుడు జాతిపిత మహాత్మాగాంధీ. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఎక్కడికి వెళ్లినా మనకు ఆయన విగ్రహాలు కనిపిస్తాయి. వాటిల్లో బషీరాబాద్‌ మండలం జీవన్గిలోని  జాతిపిత విగ్రహానికి ఓ ప్రత్యేకత ఉంది. స్థానికంగా ఆనలుగురి కృషి, పట్టుదల, గ్రామస్తుల సహకారంతో గాంధీ విగ్రహం నెలకొల్పారు. అయితే గాంధీ విగ్రహం ఏర్పాటుకు చేసిన కృషిని స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. బషీరాబాద్‌ మండలం జీవన్గిలో గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి 40 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికి ఈ విగ్రహం చెక్కు చెదరకుండా చూపరులను ఆకట్టుకుంటుంది. పదకొండున్నర ఫీట్ల ఎత్తు గద్దె నిర్మించి,  ఆరున్నర ఫీట్ల గాంధీ విగ్రహాన్ని 1982లో ఏర్పాటు చేశారు. దాని వెనక స్థానికులు  రామని వెంకప్ప, ఎనుముల ఎంకప్ప, మాజీ సర్పంచ్‌ రాములు, చికిలి ఆశప్ప కృషి ఎంతగానో ఉంది. వీరికి మహాత్మాగాంధీపై ఉన్న ప్రేమ, అభిమానమే విగ్రహ ఏర్పాటుకు ముందుకు నడిపించింది. వీరందరూ అప్పట్లో మంత్రిగా ఉన్న స్వర్గీయ ఎం.మాణిక్‌రావును కలిసిగాంధీజీ విగ్రహాన్ని మా ఊరిలో స్థాపిస్తాం.. మీ సహకారం కావాలని పట్టుబట్టారు. దీంతో మాణిక్‌రావు ముందుకొచ్చి సొంతంగా విగ్రహం ఇప్పిస్తానని హమీ ఇచ్చారు. ఇదంతా ఒకెత్తైతే ఇక విగ్రహం ఏర్పాటుకు గద్దె నిర్మించడం వారికి సమస్యగా మారింది. గ్రామస్తుల సహకారంతో సొంతంగా రాతికట్టడం నిర్మించాలని వారు నిర్ణయం తీసుకున్నారు. తాండూరులో గాంధీ విగ్రహం ఏర్పాటు చేసిన తీరును ఆనలుగురు స్వయంగా పరిశీలించి ఫ్లాన్‌  చేశారు. విగ్రహం ఏర్పాటుకు  గద్దే నిర్మాణం కోసం ఒక్కో నాపరాయిని మలిచారు.  3 నెలల పాటు కష్టపడి అందమైన ఎత్తైన గద్దెను నిర్మించారు. అనంతరం మాణిక్‌రావును కలవగా రూ.25 వేలు వెచ్చించి విగ్రహం ఇప్పించారు. దానిని తీసుకొచ్చి స్థాపించినట్లు వారు చెబుతారు. అయితే ఇప్పటి వరకూ బషీరాబాద్‌ మండలంలో  32 గ్రామ పంచాయతీలు ఉండగా, జీవన్గిలో తప్ప  మిగతా పంచాయతీల్లో ఎక్కడా గాంధీ విగ్రహం లేదు. అయితే జీవన్గిలో విగ్రహం ఉన్న ఏరియాను గాంధీచౌక్‌గా పిలుస్తున్నప్పటికీ ప్రతి యేటా స్వాతంత్య్రదినోత్సవం, రిపబ్లిక్‌డే సందర్భంగా జాతీయ పతాకం ఎగురవేయడం అనవాయితీ. ఈ వేడుకల్లో  స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, యువకులు పాల్గొంటారు.

Updated Date - 2022-08-12T05:23:38+05:30 IST