మే 15వరకు పురాతన ఆలయాల మూత

ABN , First Publish Date - 2021-04-17T06:16:50+05:30 IST

ఒంటిమిట్టలోని కోదండరామాలయాన్ని శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కేంద్ర పురావస్తు శాఖ సిబ్బంది మూసివేశారు. కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో కేంద్ర పురావస్తు శాఖ దేశవ్యాప్తంగా

మే 15వరకు  పురాతన ఆలయాల మూత
కోదండరామాలయాన్ని మూసివేస్తున్న ఆర్కియాలజికల్‌ సిబ్బంది

పురావస్తు కట్టడాలు కూడా..

కొవిడ్‌ కేసులు పెరుగుతుండడమే కారణం


కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ఆలయాలను మే 15వ తేది వరకు మూసివేయాలంటూ ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామాలయం, సౌమ్యనాధస్వామి ఆలయం, పుష్పగిరి చెన్నకేశవ స్వామి ఆలయంతో పాటు మొత్తం 21 ఆలయాలు, పలు చారిత్రక కట్డడాలను మూసివేశారు. ఈ మేరకు ఆ యా కట్టడాల గేట్లకు శుక్రవారం తాళాలు వేసి మూసివేస్తున్నట్టు కాపీలను గోడలకు అతికించారు.


కోదండరామాలయం మూసివేత

ఒంటిమిట్ట, ఏప్రిల్‌16 : ఒంటిమిట్టలోని కోదండరామాలయాన్ని శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కేంద్ర పురావస్తు శాఖ సిబ్బంది మూసివేశారు. కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో కేంద్ర పురావస్తు శాఖ దేశవ్యాప్తంగా ఆలయాలు, మ్యూజియం, పార్కులను మూసివేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మే 15వ తేది వరకు ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఉండే అన్ని ఆలయాలను మూసివేస్తున్నామని సంబంధిత సిబ్బంది తెలిపారు. ఇందులో భాగంగా కోదండరామాలయం ప్రధాన ద్వారాన్ని మూసివేశారు.


బ్రహ్మోత్సవాల నిర్వహణపై సందిగ్ధం

కరోనా విజృంభణ నేపథ్యంలో అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కోదండరాముని బ్రహ్మోత్సవాల నిర్వహణపై టీటీడీ అధికారుల్లో సందిగ్ధత నెలకొంది. గత సంవత్సరం బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించడంతో ఈసారైనా వైభవంగా నిర్వహించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే రామాలయం, కల్యాణ వేదిక ప్రాంతాల్లో విద్యుత దీపాలంకరణ పనులు చేపట్టారు. కల్యాణోత్సవం రోజున భక్తులకు సౌకర్యంగా ఏర్పాట్లను నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారా లేక వాయిదా వేస్తారా అనే దానిపై టీటీడీ ఉన్నతాధికారులు అత్యవసరంగా తిరుపతిలోని సభాభవనంలో శుక్రవారం ఈవో జవహర్‌రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అధికారులతో పాటు స్థానిక అధికారులతో చర్చించినట్టు సమాచారం. టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులతో సుదీర్ఘంగా బ్రహ్మోత్సవాల నిర్వహణపై చర్చించారని టీటీడీ అధికారులు తెలిపారు. వెంటనే అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారని నిర్ణయం ఈ రాత్రికి వెలువడే అవకాశం ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు. 


సౌమ్యనాధస్వామి ఆలయం...

నందలూరు, ఏప్రిల్‌16 : నందలూరులోని సౌమ్యనాధస్వామి ఆలయాన్ని శుక్రవారం నుంచి మేనెల 15వ తేదీ వరకు మూసివేస్తున్నామని ఆలయ చైర్మన అరిగెల సౌమిత్రి చంద్రనాథ్‌ తెలిపారు. పురావస్తు శాఖ, దేవదాయ శాఖ ఆదేశాల మేరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు. ఆలయం మూసివేసినా నిత్యం స్వామివారికి పూజా కార్యక్రమాలు భక్తులు లేకుండా ఏకాంతంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ అధికారి సుబ్బారెడ్డి, ఆలయ అర్చకులు సునీల్‌శర్మ పాల్గొన్నారు. 


పుష్పగిరి ప్రధాన ఆలయం..

వల్లూరు, ఏప్రిల్‌ 16: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొవిడ్‌ నివారణలో భాగంగా మే నెల 15వ తేది వరకు వల్లూరు మండలంలోని పుష్పగిరి చెన్నకేశవ ఆలయం, కామాక్షి వైద్యనాథస్వామి ఆలయం, ఇంద్రనాథేశ్వర స్వామి ఆలయాలను మూసివేస్తున్నామని ఆలయ ఈవో మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. రోజువారి పూజలు, కైంకర్యాలు జరుగుతాయని, అయితే భక్తులకు ప్రవేశం ఉండదని వివరించారు. ఈ మేరకు శుక్రవారం పుష్పగిరి ప్రధాన ఆలయాన్ని మూసివేశారు.


సిద్దవటం కోట..

సిద్దవటం/జమ్మలమడుగు రూరల్‌, ఏప్రిల్‌ 16: సిద్దవటం కోటలోకి మేనెల 15వ తేది వరకు పర్యాటకులకు అనుమతి లేదని సిద్దవటం పురావస్తు శాఖ సహ సంరక్షకులు రాజయోగేష్‌ తెలిపారు.  కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ ఆదేశాల మేరకు కొవిడ్‌ వ్యాధి నివారణకు శుక్రవారం నుంచి  కోట తలుపులను మూసి వేస్తున్నామని, ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు. అలాగే గండికోట సందర్శనకు మేనెల 15వ తేది వరకు పర్యాటకులకు అనుమతి నిరాకరించారని పురావస్తు శాఖకు చెదిన గండికోట సరంక్షణ ఉద్యోగులు తెలిపారు. ఈ మేరకు కేంద్ర పురావస్తుశాఖవారు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

Updated Date - 2021-04-17T06:16:50+05:30 IST