Abn logo
Mar 3 2021 @ 00:44AM

పరిమితులు లేని పరోక్ష ఉపాధి

తెలంగాణ రాష్ట్రం విషయంలో, ఆ మాటకొస్తే యావద్భారతదేశంలో కానీ, ప్రపంచంలో కానీ, ఉపాధి కల్పన లేదా ఉద్యోగాల నియామకం పట్ల మేధావుల్లో, మేధావేతరులలో ఉన్న భావనపై పునరాలోచన చేయాల్సిన, పునర్నిర్వచించాల్సిన తరుణమాసన్నమయింది. కేవలం గణాంకాల, గుణాంకాల ఆధారంగా ప్రభుత్వశాఖల్లోనూ, ప్రభుత్వేతర లేదా ప్రభుత్వరంగ సంస్థలలో చేపట్టిన, పూర్తిచేసిన నియామకాలు, ఉద్యోగాలు మాత్రమే ఉద్యోగాలు కాదని, సద్విమర్శకులు, కువిమర్శకులు గ్రహించాలి. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ఒకటి కాదు వంద విధాల జీవనోపాధికి మార్గం సుగమం చేసే క్రమంలో, తద్వారా అసలు-సిసలైన ఉద్యోగభద్రత సృష్టించే క్రమంలో తెలంగాణలో అనేకానేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అమలు చేశారు. చేస్తున్నారు. తద్వారా ప్రజల నెలవారీ, వార్షిక ఆదాయం పెంపొందించడంతో వారిలో భద్రత, భరోసా పెంచి తమ కాళ్ల మీద తాము నిలబడగలిగేట్లు చేసింది కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం.


తెలంగాణ సమాజానికి ఏం కావాలి? వాటిని ఎలా సమకూర్చాలనే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి, ఇంకా చెప్పాలంటే రాష్ట్రసాధన ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నప్పటి నుంచి సంపూర్ణ అవగాహన, ఆలోచన ఉన్నాయి. ప్రజలందరి సంపద, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని దానిని ఏ రకంగా పెంపొందించాలి అని ఆయన నిరంతరం ఆలోచిస్తూ, అధ్యయనం చేస్తూ, ఆ దిశగా నిర్వచిస్తూ, రూపకల్పన చేస్తూ, వృద్ధి చేస్తూ, అమలుపరుస్తూ, తదనుగుణమైన సలహాలు, సూచనలిస్తూ పకడ్బందీ ప్రణాళికతో విజయపథాన ముందుకు సాగుతున్నారు. 


కేసీఆర్ ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్సుపై శ్రద్ధ వహిస్తూ, దీర్ఘకాలిక ప్రయోజనాలే ధ్యేయంగా సంపద సృష్టి కోసం ఆయా పథకాలకు రూపకల్పన చేశారు. ఆయన రూపొందించిన పథకాలన్నీ ఒకవైపు తక్షణ ప్రయోజనాలు సమకూరుస్తూనే, మరోవైపు శాశ్వతంగా, స్వయంచాలకంగా ఉపాధి కల్పనకు బాటలు వేశాయి. ఉద్యోగాలు ఇవ్వడం అనేదాన్ని ఇటీవలికాలంలో కొందరు చాలా తప్పుగా నిర్వచించడం దురదృష్టం. సంపద సృష్టి, సామాజిక భద్రతతోపాటు ప్రజల్లో జీవించగలమన్న ధీమా కలిగించడం, తెలంగాణ రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా వనరులను సద్వినియోగం చేయడం, ఎవరికాళ్ల మీద వారు నిలబడే విధంగా చేయడం ముఖ్యం కానీ, ఏదో చదువుకున్న కొందరికి మాత్రమే కొన్ని ఉద్యోగాలు ఇచ్చి, అదే ఉపాధి కల్పన అనడం సరైనది కాదు. సమాజంలో ఉన్న అన్నిరకాల వారికి, -వారు చదువుకున్నా, చదువుకోకపోయినా, ఉపాధి కలిగించడమే లక్ష్యంగా ఉండాలి. సరిగ్గా ఇదే జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో.


ప్రపంచంలోని ఏ దేశమూ, దేశంలోని ఏ రాష్ట్రమూ ప్రభుత్వ రంగంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగే పని కాదు. ఆయా రాష్ట్ర పరిస్థితులను బట్టి, ప్రభుత్వానికి అవసరమైన కొన్ని వేల ఉద్యోగాలను మాత్రమే ఇవ్వడానికి వీలున్నది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సంపదను సృష్టించి, తద్వారా ప్రతివారూ తమకనుకూలమైన ఉపాధిని తామే సమకూర్చుకునే వీలు కలిగించడమే సరైన ప్రత్యామ్నాయం. ఇపుడు తెలంగాణలో కూడా అదే జరుగుతున్నది. 


కేసీఆర్ ప్రభుత్వంలోని ఏ పథకాన్ని, కార్యక్రమాన్ని తీసుకున్నప్పటికీ సంపదను సృష్టించడానికి దానితో అనుసంధానించటానికీ అవకాశం, ఆస్కారం కనిపిస్తుంది. ఉదాహరణకు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలు తీసుకుంటే, అవి పరిమితి లేనంతగా ఆర్థిక కార్యకలాపాలను అంతర్లీనంగా కలిగి ఉన్నాయనేది స్పష్టం. వివరంగా చెప్పాలంటే, పల్లె ప్రగతి కింద ప్రతి గ్రామ పంచాయతీకి శిథిలాలను, వ్యర్థాలను డంప్ చేయడానికి, మొక్కలకు నీరు పోయడానికి, ట్రాలీ, ట్యాంకర్‌తో కూడిన ఒక ట్రాక్టర్ను సమకూర్చారు. ట్రెయిలర్, ట్యాంకర్‌తో ప్రతీ ట్రాక్టర్ కార్యాచరణ వల్ల కనీసం ముగ్గురు వ్యక్తులకు ఉపాధి అవకాశాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కేవలం 84 గ్రామ పంచాయతీలకు మాత్రమే ఈ ట్రాక్టర్లు ఉండేవి. కానీ, స్వరాష్ట్రంలో ఈ రోజు వందకు వందశాతం 12,769 గ్రామాలకు ట్రాలీ, ట్యాంకర్‌తో కూడిన ట్రాక్టర్లను సమకూర్చుకున్నాం. దీనివల్ల అన్ని గ్రామాల్లో కలిపి ఎన్ని వేల మందికి ఉపాధిని సృష్టించారు. దీన్ని మనం ఉద్యోగ కల్పనగా పరిగణించకూడదా? వీరందరికీ ఉద్యోగం ఇచ్చినట్లా.. ఇవ్వనట్లా?


అదేవిధంగా వంశపారంపర్య వృత్తులను సాధికారపరచడానికి ఉద్దేశించిన కార్యక్రమాలను తీసుకుందాం. అవి గొర్రెల పెంపకం, చేపల పెంపకం, పండ్ల తోటలు, పాడి పరిశ్రమకు ఇచ్చే ప్రోత్సాహకాలు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక సెలూన్లు (క్షౌరశాలలు) తెరవడానికి సహాయం చేయడం, స్వర్ణకారులే తమ వర్క్‌షాప్ ద్వారా అమ్మకపు దుకాణాన్ని పెట్టుకోవడానికి సహాయం చేయడం వంటివి కొత్త ఉపాధి అవకాశాలను కలిగించాయి. అనేక నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా జలాశయాల్లో చేపల సంపదను అభివృద్ధి చేశారు. తెలంగాణ రాష్ట్రం మాంసం, చేపలను ఇతర రాష్ట్రాలకు దేశాలకి ఎగుమతి చేయడం ప్రారంభించే రోజు చాలా దూరంలో లేదు. ఇవన్నీ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆర్థిక కార్యకలాపాలను పెంచుతాయి, ఇది వ్యక్తిగత సంపదను, మార్కెట్ సంపదను రెండింటినీ సృష్టిస్తుంది. దీన్ని మనం ఉద్యోగ-ఉపాధి కల్పనగా పరిగణించకూడదా?


రైతులకు ప్రభుత్వమే పంట పెట్టుబడి సాయం అందించే రైతుబంధు వంటి మరో ప్రధాన పథకాన్ని తీసుకోండి. ప్రతి రైతుకు సంవత్సరంలో రెండు పంటలకు కలిపి ఎకరానికి రు.10,000 ఇచ్చే పంటసాయం వల్ల అతడు తన వ్యవసాయ పనుల్లో భాగంగా మరికొందరిని పనుల్లోకి తీసుకుని మరింత పంట పండిస్తాడు. ఇలా ప్రతి రైతుకు అదనంగా వ్యక్తులు అవసరమే కదా. ఇలా అంచనా వేస్తే అదంతా ఉపాధికల్పన కిందకు రాదా? ఇది ఉపాధి, ఉద్యోగాలను సమకూర్చడం కాదా? భారీ, మధ్య, చిన్న నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం కూడా ఎక్కువ మంది ఉద్యోగులకు అవకాశం కల్పించే జాబితాలోనే చేరుతుంది. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత, వాటిని నిర్వహించడానికి మనకి పెద్ద మానవ శ్రమశక్తి అవసరం. వ్యవసాయరంగంలో యాంత్రీకరణ కూడా ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది. ఇది ఉపాధి కాదా? రైతు బీమా ఒక సామాజిక ధీమా. ఈ పథకం కింద అర్హులైన రైతులు ఏ కారణంతోనైనా సరే మరణిస్తే, 10 రోజుల్లో ఆ రైతుల కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సొమ్ము అందుతున్నది. 


రాష్ట్ర ఆర్థిక పరిపుష్టి కోసం ఏదైనా మూల్యాంకనం కోసం, తలసరి లెక్కింపు వాస్తవ స్థానాన్ని సూచిస్తుంది. తెలంగాణలో గరిష్ట డిమాండ్‌తో పాటు విద్యుత్ వినియోగం కూడా అంతకంతకూ పెరుగుతున్నది. 2014లో తెలంగాణలో 39,866 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగగా, 2019–-20 నాటికి వినియోగం 68,674 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అంటే ఆరున్నరేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో పెరుగుదల 28,808 మిలియన్ యూనిట్లు. అంటే 72 శాతం పెరిగింది. ఇది వ్యక్తి సంపదకు, ఆర్థిక పరిపుష్టికి, బలానికి సూచిక. విద్యుత్‌రంగంలో సంస్కరణలు, పునర్నిర్మాణం.. శాశ్వత విద్యుత్ సంక్షోభం నుంచి విద్యుత్ మిగులు పంచే రాష్ట్రానికి దోహద పడడమే కదా. వేలాది మంది నైపుణ్యం పొందిన, నైపుణ్యం లేని ప్రజలకు లాభదాయకమైన ఉపాధికి ఈ రంగం విస్తారమైన అవకాశాలను కల్పించింది. ఈ విధంగా చూస్తే తెలంగాణాలో సృష్టించబడ్డ సంపద పరోక్షంగా అనేక రంగాల్లో ఉద్యోగ-ఉపాధి కల్పనకు దోహదపడుతుందనడంలో అతిశయోక్తి లేదు. 

వనం జ్వాలా నరసింహారావు

Advertisement
Advertisement
Advertisement