తుఫాను అనంతర అశాంతి!

ABN , First Publish Date - 2020-09-06T06:15:12+05:30 IST

ఈభూమి మీద జీవవైవిధ్యాన్ని మనుషులు విధ్వంసం చేసిన ఫలితమే కొత్తగా వస్తున్న జబ్బులు, వైరస్‌లు అని చాలా మంది పరిశోధకులు అంటున్నారు. తనను ధ్వంసించిన మనుషుల...

తుఫాను అనంతర అశాంతి!

ఈభూమి మీద జీవవైవిధ్యాన్ని మనుషులు విధ్వంసం చేసిన ఫలితమే కొత్తగా వస్తున్న జబ్బులు, వైరస్‌లు అని చాలా మంది పరిశోధకులు అంటున్నారు. తనను ధ్వంసించిన మనుషుల మీద ప్రకృతి పగ తీర్చుకుంటుందని వారు చెబుతున్నారు. పగ అనేది మనిషికి సంబంధించిన లక్షణం అయినప్పటికీ, కనీసం సమతౌల్యం సృష్టించేందుకు ప్రకృతి ప్రయత్నిస్తుందని అయినా ఒప్పుకోవాలి. కొద్దికాలంగా సార్స్‌, బర్డ్‌ప్లూ, ఎబోలా, మెర్స్‌, ఇప్పుడు కరోనా లాంటి వైరస్‌లు మనిషి మీద దాడి చేస్తున్నాయి. ప్రతి సందర్భంలోనూ మొత్తంగా అంతమయ్యే విపత్కర స్థితి నుంచి వాక్సిన్‌ల వల్ల మానవాళి తృటిలో తప్పించుకుంటోంది. ఇకముందు అన్ని రకాల వైరస్‌లను అరికట్టటానికి వాక్సిన్‌లు తయారుచేయటం సాధ్యమవుతుందని చెప్పలేం. ఇప్పటిదాకా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమవుతూ వస్తున్న వైరస్‌లు ఇవ్వాళ కరోనా వల్ల విశ్వవ్యాప్తం అయ్యాయి. రాబోయే మరిన్ని సంక్షోభాలకు కరోనా నాంది అనిపిస్తోంది. కళ్ళముందే మనుషులు పిట్టల్లా రాలిపోతుంటే చేయగలిగిందేమీ లేకుండాపోయింది. 


వైరస్‌ వల్ల వచ్చే చాలా మార్పులు జంతువుల నుంచి మనుషులకు పాకుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న కొవిడ్‌తో పాటు అంతకుముందు నిపా, సార్స్‌, జిక లాంటివి కూడా జంతువుల నుంచి మనుషులకు చేరాయి. 1960 నుంచి 2004 మధ్య కాలంలో మనుషులకు సోకిన 325 జబ్బులలో 60% జంతువుల నుంచి వచ్చాయని Scientific American పత్రిక వెల్లడించింది. అడవుల నరికివేత, గనుల్లో జరుగుతున్న తవ్వకాలు, అడవుల నుంచి రోడ్లు వేయటం మొదలైన పర్యావరణ విధ్వంసక చర్యల ఫలితంగా ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. విపరీతంగా పెరిగిపోతున్న నగరీకరణ ఫలితంగా అంతకుముందు ఎప్పుడు లేనంతగా మనుషులకు, మిగతా జంతువులకు మధ్య దూరం తగ్గిపోయింది. ఫలితంగా నగరాలకు దగ్గర ఉన్న అడవుల్లో నివసించే జీవజాలం మరింత వేగంగా వైరస్‌లను వ్యాప్తి చేయగలదంటున్నారు. 


సమాజంలో వచ్చే ప్రతి ఉపద్రవం కొంతకాలం తరువాత తిరోగమిస్తుంది. ఇది మన చారిత్రక అనుభవం. కరోనా విషయంలోనూ అదే జరుగుతుంది. మనుషులు ఆ మహమ్మారికి భయపడుతున్నారు. వారి జీవనశైలిలో మౌలిక మార్పులు అనివార్యంగా వస్తాయి. ఈ సందర్భంలో ఇవ్వాళ తాత్త్విక రంగంలో ప్రముఖంగా వినిపిస్తున్న యువల్‌ నో హరారి మాటల్ని ఉదాహరించటం అవసరం. “In this time of crisis, we face two particularly important choices. The first is between totalitarian surveillance and citizen empowerment. The second is between nationalist isolation and global solidarity”.


హరారి అభిప్రాయం ప్రకారం చరిత్రలో మొదటిసారిగా ఇవ్వాళ సాంకేతిక పరిజ్ఞానం ప్రతి వ్యక్తి మీద నిఘా పెట్టగలుగుతోంది. యాభై సంవత్సరాల క్రితం కేవలం 24 కోట్ల మంది మీద పూర్తిగా నిఘా పెట్టటం అనేది సోవియట్‌ యూనియన్ ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. వాళ్ళు ఎక్కువగా గూఢచారుల మీద ఆధారపడి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూఉండేవాళ్ళు. ఇవ్వాళ ఆ అవసరం లేదు. పకడ్బందీగా రూపొందించుకున్న సాంకేతిక నిఘా వ్యవస్థల సహాయంతో ప్రపంచ జనాభా మొత్తం మీద నిఘా పెట్టి సమాచారాన్ని రాబట్టటం నేడు చాలా సులువయింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రభుత్వాలు ఈ నిఘా కార్యక్రమాన్ని ఇప్పటికే చాలా చోట్ల శక్తిమంతంగా అమలు చేస్తున్నాయి. చైనా ఈ నిఘా కార్యక్రమాలలో సహజంగానే ముందు ఉంది. నిఘా సాంకేతిక పరికరాలను, స్మార్ట్‌ ఫోన్లను, ముఖాల్ని గుర్తించే కెమేరాలను వాడి కరోనా బాధితుల్ని గుర్తించటమే కాదు, వాళ్ళ కదలికల్ని, వాళ్ళని కలిసేవాళ్ళను గురించి కూడా నిఘా పెట్టటం జరుగుతోంది. ఇక ఇజ్రాయిల్‌ అయితే టెర్రరిస్ట్‌లను track చేయటానికి వాడే నిఘా సాంకేతిక పరికరాలన్నంటినీ కరోనా బాధితుల్ని గుర్తించటానికి వాడుతోంది. వీటి పర్యవసానాల్ని గురించి మనం ఆలోచించటం అవసరం. ఎందుకు? కరోనా విపత్తు అంతమైన తరువాత కూడా వాటి వాడకం కొనసాగుతుంది. అప్పుడది వేరే పద్ధతులలో, వేరే లక్ష్యాల కోసం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే వాటి వాడకం సర్వసాధారణమవుతుంది.


హరారి మాటల్లో చెప్పాలంటే ప్రభుత్వాలు ‘over skin’ నిఘా నుంచి ‘under skin’ నిఘా వైపు ప్రయాణించాయి. ఒక వ్యక్తి శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవటాన్నించి మెదడులో ఏ ఆలోచనలు ఉన్నాయో తెలుసుకునే దాకా నిఘా సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తుందని హరారి అంటాడు. ఒక దశాబ్దం క్రితం వరకూ మనం కేవలం సైన్స్‌ ఫిక్షన్‌లో మాత్రమే చదివిన సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వాళ వాస్తవరూపంలో అందుబాటులోకి వస్తోంది. త్వరలో ప్రభుత్వాలు ప్రజలందరికీ గుర్తింపు కార్డులిచ్చినట్లుగా చేతులకు biometric bracelets ఇచ్చి ఆ తరువాత వ్యక్తుల కదలికల్నే కాక వాళ్ళ మనస్థితుల్ని అవగతం చేసుకునే, నియంత్రించే స్థాయికి ఈ నూతన సాంకేతికత ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రభుత్వాలు తీసుకునే ఈ చర్యలు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కోసమే అంటే ప్రజలు అంగీకరించక తప్పని పరిస్థితి ఉంటుంది. నవీన సాంకేతికతలు ఇప్పటికే చరిత్రలో ప్రజలకు రక్షణ కల్పించే నెపంతో వాళ్ళ స్వేచ్ఛను హరించాయి, పరిమితం చేశాయి. భవిష్యత్తులో ప్రభుత్వాలు ప్రజలకు ఏకాంతం కావాలా అంటే ప్రజలు అనివార్యంగా ఆరోగ్యమనే అంటారు. ఇక ఆ తరువాత ప్రభుత్వాలు ప్రజల్ని కీలుబొమ్మలు చేసి ఆడిస్తాయి. కరోనా లాంటి మహమ్మారి వచ్చిన సందర్భంలో ప్రభుత్వాలు కొత్త కొత్త చట్టాలను తీసుకువస్తాయి. ఆ మహమ్మారులు అంతమయిన తరువాత ఆ చట్టాలను ఎత్తివేయటం మాత్రం జరగదు. అత్యవసర పరిస్థితిలో ముందుకు వచ్చిన ఆ చట్టాలు ఆ తరువాత కూడా అలానే కొనసాగుతాయి. ఇంగ్లీషువాళ్ళు భారతదేశంలో చాలా ప్రాంతాలలో తమ కాలంలో విధించిన సెక్షన్‌ 144 ఇంకా ఇప్పటికీ కొనసాగుతున్న నేపథ్యంలో ఇది ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. 


కరోనా నేపథ్యంలో మనుషులు పరాయి (other)ని లేక ఇతరులను మనుషులుగా చూడటం మానేశారు. ప్రతి ఒక్కరినీ అనుమానంతో చూడటం మొదలైంది. మనిషి ఏకపార్శ్వ మానవుడుగా మార్చబడ్డాడు. తను తప్ప ఇతరులు లేరు. ప్రతి రెండవ వ్యక్తి ఒక ఆగంతకుడే. ఆగంతకుల పట్ల సందేహం, భయం ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ప్రతి వ్యక్తి రెండవ వ్యక్తిని మృత్యుసదృశంగా చూస్తున్నాడు. సార్త్ర్‌ భాషలో చెపితే other నిజంగానే నరకప్రాయమే అనిపిస్తుంది. సామాజిక జీవితంలో ఇది అత్యంత అమానవీయ సందర్భం. చరిత్రలో ఇటువంటి సన్నివేశాలు ఈ స్థాయిలో ఎక్కడా కన్పించవు. యుద్ధాలు దేశాల మధ్య, కొట్లాటలు సామాజిక బృందాల మధ్య జరుగుతాయి. యుద్ధమంటే విద్వేషమే. ఇవ్వాళ కరోనా విలయంలో అటువంటి విద్వేషం దాని సూక్ష్మరూపంలో కనిపిస్తోంది. ఈ విద్వేషానికి అనివార్యంగా దీర్ఘకాలిక పర్యవసానాలు ఉంటాయి. కరోనా సోకిన వ్యక్తిని క్వారెన్‌టైన్ లోకి పంపి ఆ వ్యక్తిని మొత్తం సామాజిక సంపర్కం నుంచి దూరం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటి బహిష్కృత జీవితం గడిపిన వ్యక్తి స్వస్థత పొంది బయటకు వచ్చిన తరువాత తన సన్నిహితులలో, కుటుంబ సభ్యులలో సాధారణ సంబంధాన్ని కొనసాగిస్తాడని ఊహించలేం. (కనీసం కొంతకాలం) గాయపడ్డ మనస్సు, గాయం చేసిన మనస్సు రెండూ అసహనాన్ని, అనుమానాన్ని తమ అచేతనంలో మోస్తూ ఉంటాయి. దాన్ని కడగటానికి ఏ శానిటైజర్ ఉండదు. మనిషికి ఉండే phobia లలో అత్యంత లోతుగా మనిషి గాయపర్చేది తనను అందరూ కష్టకాలంలో ఒంటరిగా వదిలివేశారనే భావన. ఎయిడ్స్‌, లైంగిక సంబంధాలలో వినాశనాన్ని తెచ్చిపెట్టిందని ఫ్రెంచి తాత్త్వికుడు బార్రిలార్డ్‌ అంటాడు. తాత్కాలికంగానయినా కరోనా మానవ సంబంధాలలో సంక్షోభాన్ని సృష్టిస్తోంది. 


ప్రతి సంక్షోభం, సంక్షోభ నివారణకు అనేక ప్రత్యామ్నాయాలను ముందుకుతెస్తుంది. ఈ సందర్భంలో జాన్‌ బొర్రిలార్డ్‌ మాటల్ని జ్ఞప్తికి తెచ్చుకోవటం అవసరం. ‘ఆధునికత, ప్రతి జీవన రంగంలో మానవునికి విముక్తిని ప్రతిపాదించింది. రాజకీయ విముక్తి, లైంగిక విముక్తి, ఉత్పత్తి శక్తుల విముక్తి, విధ్వంస శక్తుల విముక్తి, స్త్రీ విముక్తి, పిల్లల విముక్తి, అచేతన వాంఛల విముక్తి, కళల విముక్తి అని అన్నిరకాల విముక్తులను ఆధునికత ప్రబోధించింది. తద్వారా సమాజంలో ఒకానొక ఉన్మత్త ప్రమోద (orgy) స్థితిని ముందుకు తెచ్చింది. ఇప్పుడు మళ్ళీ మన ముందు రెండు ప్రత్యామ్నాయాలు ప్రముఖంగా కన్పిస్తున్నాయి. ఈ రెండు కూడా చరిత్ర జల్లెడ పట్టి పక్కకు పెట్టినవి. అవి, లోపాల్ని సరిదిద్దుకొని కొత్త రూపంలో ముందుకు రానున్న నయా ఉదారవాదం (neo libaralism) అలాగే Zizek ప్రతిపాదిస్తున్న కొత్త కమ్యూనిజం, ప్రజల పట్ల, సైన్స్‌ పట్ల నమ్మకంతో రూపొందబోయే కమ్యూనిజం. చరిత్ర గురించి మార్క్స్‌ నుడివిన -‘The first time as tragedy and the second time as farce’ అన్న సత్యాన్ని మనం విస్మరించకూడదు. ఈ సందర్భంలో మనం తీసుకునే నిర్ణయాలకు తీవ్ర పర్యవసానాలుంటాయి కాబట్టి ఏ నిర్ణయమయినా బాధ్యతాయుతంగా ఉండాలి.

ప్రొఫెసర్ బి.తిరుపతిరావు 

ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం

Updated Date - 2020-09-06T06:15:12+05:30 IST