కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

ABN , First Publish Date - 2021-11-27T04:49:39+05:30 IST

జిల్లాలో భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.

కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
కలెక్టరేట్‌లో మధ్యాహ్నం వేళ చెట్ల కింద భోజనం చేస్తున్న ప్రజావాణి ఫిర్యాదుదారులు (ఫైల్‌)

- పరిష్కారం కాని భూ సమస్యలు

- ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం

- ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు

గద్వాల క్రైం, నవంబరు 26 : జిల్లాలో భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. కలెక్టరే ట్‌లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజవాణికి వచ్చే ఫిర్యాదుల్లో భూసమస్యలకు సంబంధించినవే ఎక్కు వగా ఉంటున్నాయి. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా, రోజుల తరబడి తిరుగుతున్నా ఫలితం ఉండడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను అమలుల్లోకి తెచ్చి ఏడాది దాటినా పెద్దగా ఫలితం కన్పించడం లేదు. ప్రధానంగా పాసుబుక్కులో పేర్ల మార్పిడి, పొరపాటుగా నమోదు కావడం, ఇంటి నెంబర్ల మార్పు, కొత్త పాసు పుస్తకాలు అందకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. వాటిని సరిదిద్దుకునేందుకు రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. అయినా పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


మళ్లీ మొదటికే...

గతంలో రైతులకు భూ సమస్యలు వస్తే తహసీ ల్దార్‌ కార్యాలయంలోనే వీఆర్వోల ద్వారా పరిష్కారం అయ్యేవి. అక్కడ కాకపోతే తహసీల్దార్‌ ద్వారా పరిష్కారం లభించేంది. అక్కడ కూడా ఫలితం లేకపోతే ఆర్డీవో కార్యాలయంలో ఊరట లభించేంది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి కన్పించడం లేదు. ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన అనంతరం సమస్యల పరిష్కారం కష్టసాధ్యమవుతుందని రైతులు ఆరో పిస్తున్నారు. ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహి స్తున్న ప్రజావాణిలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఆ ఫిర్యాదులను తహసీల్దార్‌ కార్యాలయానికే పంపిస్తుండడంతో సమస్య మళ్లీ మొదటికి వస్తోందని చెప్తున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం చాలా సమస్యలు పరిష్కారం అవుతున్నట్లు తెలుస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రజావాణికి మొత్తం 5,735 ఫిర్యాదులు రాగా, 5,331 పరిష్కారమయ్యాయి. మరో 404 పెండింగ్‌లో ఉన్నాయి. మ్యుటేషన్‌కు సంబంఽధించి 6,077 ఫిర్యాదులకు గాను 5,986 పరి ష్కారం కాగా, 91 పెండింగ్‌లో ఉన్నాయి. 

మూడు సంవత్సరాల నుంచి..

ఖలీమ్‌, గద్వాల : గద్వాల శివారులోని సర్వే నెంబర్‌ 99, 100, 1077, 1081 సర్వే నంబర్లలో మాకు 31 ఎకరాల భూమి ఉంది. కొత్త పాసుపుస్తకాల కోసం మూడు సంవత్సరాలుగా తిరుగుతున్నా, పని కావడం లేదు. ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి.


ఇనామ్‌గా నమోదు చేశారు

సలీమ్‌, వేముల, ఇటిక్యాల మండలం : మాకు ఇటిక్యాల మండలంలోని వేముల గ్రామంలోని సర్వే నెంబర్‌ 27/బి 17.36 ఎకరాల భూమి ఉంది. రెండేళ్ల క్రితం భూమికి సంబంధించిన పట్టా పాసుపుస్తకంలో ఇనామ్‌గా నమోదయ్యింది. ఈ విషయంపై వక్ఫ్‌బోర్డు అధికారి లెటర్‌ఇచ్చినా కూడా సమస్యను పట్టించుకోవడంలేదు. ధరణిలో పలుమార్లు ఫిర్యాదు చేశాను. 


సమస్యల పరిష్కారానికి చర్యలు

ప్రజావాణిలో వచ్చిన ధరణి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాం. ధరణి  సమస్యలను పరిష్కరించేందుకు ప్రతీ రోజు తహసీల్దార్లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నాం. ఏ రోజు వచ్చిన సమస్యలను ఆ రోజే పరిష్కరించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశాం. ఇప్పటివరకు చాలా సమస్యలను పరిష్కరించాం. ఇది నిరంతర ప్రక్రియ. సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. 

- రఘురామ్‌శర్మ, అదనపు కలెక్టర్‌

Updated Date - 2021-11-27T04:49:39+05:30 IST