తొలగని కష్టాలు

ABN , First Publish Date - 2021-09-18T06:24:04+05:30 IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అతలాకుతలమైంది. జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. వరదనీటితో జలమయమైన సిరిసిల్ల కోలుకున్నా మరమగ్గాల కార్ఖానాల్లో మాత్రం వరద కష్టాలు తొలగడం లేదు.

తొలగని కష్టాలు
వరద నీటికి పాడైన పవర్‌లూం కార్ఖానా

- భారీ వర్షాలకు వస్త్ర పరిశ్రమ అతలాకుతలం

-  కార్ఖానాల్లోకి వరద నీరు 

- రూ.37 లక్షల నష్టంగా ప్రాథమిక అంచనా

- తడిసిన బతుకమ్మ చీరలు 

 

 (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అతలాకుతలమైంది.  జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. వరదనీటితో జలమయమైన సిరిసిల్ల కోలుకున్నా మరమగ్గాల కార్ఖానాల్లో మాత్రం వరద కష్టాలు తొలగడం లేదు. జిల్లా కేంద్రంలో బతుకమ్మ చీరల ఉత్పత్తి లక్ష్యాన్ని పూర్తి చేసే దిశగా కార్మికులు నిరంతరం శ్రమిస్తూ ఉపాధి పొందుతున్న క్రమంలో పది రోజుల క్రితం కురిసిన వర్షాలకు అనేక కాలనీలు నీటమునిగాయి. కార్మికుల ఇళ్లలోని సామగ్రి కొట్టుకుపోయింది. పవర్‌లూం కార్ఖానాల్లో బురదతో కూడిన వరదనీరు చేరింది. బట్ట తడిసిపోగా, మోటార్లలోకి నీళ్లు చేరి కాలిపోయాయి. కార్ఖానాల్లో చేరిన బురద తొలగించడమే కష్టంగా మారింది. కొన్ని కార్ఖానాలు తిరిగి ప్రారంభించడం సాధ్యంకాని పరిస్థితి నెలకొంది. సిరిసిల్లలోని వెంకంపేట,  సర్దార్‌నగర్‌, శాంతినగర్‌, పద్మనగర్‌, ప్రగతినగర్‌, బీవైనగర్‌, గణేష్‌నగర్‌, శివనగర్‌ ప్రాంతాల్లోని కార్ఖానాల్లోకి భారీగా నీరు చేరింది. జిల్లాలోని 35 వేల మరమగ్గాలకు  చేనేత జౌళి శాఖ సర్వే ప్రకారం 137 కార్ఖానాలు, 1516 మరమగ్గాలు దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.37 లక్షల నష్టం కలిగినట్లు నివేదికలు పంపించారు. కార్ఖానాల్లో అంతకంటే ఎక్కువగానే నష్టం వాటిల్లిందని పవర్‌లూం ఆసాములు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5వేలకు పైగా మరమగ్గాలు దెబ్బతిన్నట్లు ఆసాములు చెబుతున్నారు.  వీటితోపాటు వార్ఫిన్‌, డైయింగ్‌  యూనిట్లు దెబ్బతిన్నాయి. బట్ట తడిసిపోయింది. బురదను తొలగించుకోలేక పవర్‌లూం ఆసాములు, ఇబ్బందులు పడుతున్నారు. భారీగా నష్టాన్ని చవి చూశారు. బతుకమ్మ చీరల ఉత్పత్తి లక్ష్యం సాధించే క్రమంలో వర్షాలతో దాదాపు 1.30 కోట్ల మీటర్ల బట్ట ఉత్పతికి విఘాతం కలిగింది. 


ప్రభుత్వానికి నివేదిక 

- సాగర్‌ జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి 

భారీ వర్షాలతో పవర్‌లూం కార్ఖానాల్లోకి వరద నీరు చేరింది. నష్టంపై సర్వే చేయించాం. 137 యూనిట్లలో రూ.37 లక్షల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. నివేదికలను ప్రభుత్వానికి పంపించాం. తడిసిన  2 లక్షల మీటర్ల బతుకమ్మ చీరల బట్టను తీసుకున్నాం.  సమగ్రంగా ప్రభుత్వానికి నివేదించాం. 


 పరిశ్రమల్లోకి నీరు 

- బోగ వెంకటేశం, యజమాని, శాంతినగర్‌, 

సిరిసిల్ల పట్టణం శాంతినగర్‌లో భారీ వర్షానికి   మరమగ్గాలు, వార్ఫిన్‌ పరిశ్రమల్లోకి వరద నీరు  చేరింది.  మరమగ్గాలతోపాటు వార్ఫిన్‌యంత్రాలు, కరెంట్‌ మోటార్లు కాలిపోయాయి.  బతుకమ్మ చీరలకు సంబంధించిన యారన్‌ పూర్తిగా మట్టితో నిండిపోయింది. ఆ యారన్‌ పనికి రాకుండా పోవడంతో రూ.20లక్షల వరకు నష్టం వాటిల్లింది. చేనేత జౌళిశాఖ అధికారులు స్పందించాలి. నష్టపరిహారం అందించి ఆదుకోవాలి.


మరమగ్గాలు పని చేయడం లేదు

- మండల బాలరాజు, యజమాని, శాంతినగర్‌, సిరిసిల్ల 

పట్టణంలోని శాంతినగర్‌లో ఉన్న మా మరమగ్గాల పరిశ్రమల్లోకి వరద నీరు వచ్చింది. షెడ్‌లో ఉన్న 32 మరమగ్గాలు నీట మునిగిపోయాయి. వాటికి ఉన్న కరెంట్‌ మోటార్లు, ఇతర సామగ్రి కాలిపోయాయి. మరమగ్గాలు పని చేయడం లేదు. 2 లక్షల యారన్‌ పూర్తిగా తడిపోయింది. వరదతో రూ.5 లక్షల నష్టం వాట్లిలింది. 


పనులు లేవు

- వేముల శ్రీకాంత్‌ వార్ఫిన్‌ కార్మికుడు, శాంతినగర్‌

శాంతినగర్‌లోని పరిశ్రమల్లోకి వరద నీరు చేరడంతో వార్ఫిన్‌ యంత్రాలు, మరమగ్గాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. 15 రోజులుగా పనులు లేకుండా పోయాయి. దీంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 


Updated Date - 2021-09-18T06:24:04+05:30 IST