వదలని వాన...వీడని కష్టాలు

ABN , First Publish Date - 2020-09-20T09:58:58+05:30 IST

నగరాన్ని వర్షం వదలడం లేదు. నాలుగు రోజులుగా ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తూనే ఉంది...

వదలని వాన...వీడని కష్టాలు

పగటి సమయంలోనే కమ్మేసిన మేఘాలు

శివారు ప్రాంతాల్లో భారీగా వర్షం

లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన వరద నీరు


హైదరాబాద్‌ సిటీ నెట్‌వర్క్‌, సెప్టెంబర్‌ 19 (ఆంధ్రజ్యోతి) : 

నగరాన్ని వర్షం వదలడం లేదు. నాలుగు రోజులుగా ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తూనే ఉంది. శనివారం పగటి సమయంలోనే మేఘాలు కమ్మేశాయి. చీకటిగా మారి కుండపోతగా వర్షం కురిసింది. దీంతో నగరవాసులు  ఇళ్లలో నుంచి బయటకు రాలేదు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. ఇళ్లలోకి సైతం నీళ్లు చేరాయి. రోడ్లన్నీ వరద కాలువలుగా మారాయి.


శివారు ప్రాంతాలైన ఉప్పల్‌, కుషాయిగూడ, ఎల్‌బీనగర్‌, హయత్‌నగర్‌, బోడుప్పల్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, అల్వాల్‌, మల్కాజిగిరి, జవహర్‌నగర్‌లలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కీసరలో 10.10 సెంటీమీటర్ల వర్షం కురవగా,  చర్లపల్లిలో 7.25 సెంటీమీటర్లు, ఉప్పల్‌లో 5.75 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా సరూర్‌నగర్‌లో 2.25 వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. 


చెరువుల్లో ఉధృతంగా నీరు

అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల శివారు గ్రామాలు తడిసిముద్దయ్యాయి. ఎక్కడ చూసినా చెక్‌డ్యాంలు, అలుగులు ఏరులై పారుతున్నాయి. చింతల చెరువు, జాఫర్‌గూడ, పెద్దచెరువు, పాతకుంట, బైరాన్‌ఖాన్‌చెరువు, మంగలోనికుంట, బాటచెరువు, ఈదుల చెరువు, కార్ఖానాకుంట, బొమ్మల చెరువులో వరద నీరు ఉధృతంగా పారుతోంది. పెద్దఅంబర్‌పేట్‌ ఔటర్‌ రింగు రోడ్డు కత్వా పొంగిపొర్లుతోంది. లష్కర్‌గూడ మలుపు వద్ద వంతెన పూర్తిగా మునిగిపోయింది. బాటసింగారం-మజీద్‌పూర్‌ మధ్యలో ఉన్న చిన్న ఏరు వంతెనను వరదనీరు ముంచెత్తింది. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసుల సహకారంతో నీరు ప్రవహిస్తున్న వంతెనల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు బంద్‌ చేయించారు. 


నిండిన కుమ్మరికుంట చెరువు

వర్షాలకు హయత్‌నగర్‌లోని కుమ్మరికుంట చెరువు నిండి జలకళ సంతరించుకుంది. అలుగు ద్వారా నీరు బాతుల చెరువుకు వెళుతోంది. వర్షం మరోరోజు కురిస్తే బాతుల చెరువు కూడా నిండే అవకాశం ఉంది. 15 ఏళ్లుగా రెండు చెరువులకు నీరు రాక వెలవెలబోయాయి. స్థానిక కార్పొరేటర్‌ సామ తిరుమల్‌రెడ్డి చెరువును నింపాలని మూడు దిక్కులా పైపు లైన్లు వేయించారు. అయినా చెరువు నిండకపోవడంతో సామనగర్‌ నుంచి వర్షం నీటి పైపు లైనును వేయించడానికి ప్రతిపాదనలు పంపారు. 


వర్షం తెచ్చిన కష్టాలు

ఏఎస్‌రావునగర్‌లో పలు కాలనీలు, బస్తీలు జలమయం అయ్యాయి. రోడ్లపై వరద నీరు  ఏరులై పారింది. ఈసీఐఎల్‌, రాధికా చౌరస్తాలో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. శ్రీనగర్‌ కాలనీ, విరాట్‌నగర్‌, సౌత్‌ కమలానగర్‌, జై జవాన్‌ కాలనీలలో నీరు వచ్చి చేరింది. 


రామంతాపూర్‌, హబ్సిగూడ డివిజన్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.


కొత్తపేట డివిజన్‌లోని మోహన్‌ నగర్‌ ప్రధాన రహదారి పక్కన గాయత్రీపురం, ఎస్‌ఆర్‌ఎల్‌ కాలనీ, సత్యానగర్‌ రహదారులు, భరత్‌నగర్‌ ప్రధాన రహదారి, కామినేని చౌరస్తా నుంచి సీరీస్‌ దారిలో ఆర్టీసీ కాలనీకి వెళ్లే దారిలో, నాగోల్‌ చౌరస్తాలో వరదనీరు ఉధృతంగా ప్రవహించింది. గాయత్రీపురం వెళ్లే దారిలో మ్యాన్‌హోల్‌ నుంచి వరద నీరు ఎగిసిపడింది. 


నాగోలు డివిజన్‌ బ్లైండ్స్‌ కాలనీలో వరద నీరు ఇళ్లల్లోకి చేరుతోంది. ఆ సమస్యను తీర్చాలని స్థానికులు ఆందోళన చేశారు. 


ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌ డివిజన్‌లోని బండచెరువు లోతట్టు ప్రాంతాలలో వరద నీరు చేరింది. ఎన్‌ఎండీసీ కాలనీ, షిర్డీనగర్‌, రాజనగర్‌, సీఫెల్‌కాలనీ, పీవీఎన్‌కాలనీ, వసంతపురి కాలనీలో వరద  నీరు రహదారులను ముంచెత్తింది. 


అల్వాల్‌లోని శ్రీనివాస్‌నగర్‌ కాలనీ, శ్రీబేకరి జంక్షన్‌, రాజీవ్‌నగర్‌, జోషీనగర్‌,జానకీనగర్‌, శివానగర్‌ సప్తగిరి కాలనీ, ఆనంద్‌రావునగర్‌లలో వరదనీరు పోటెత్తింది. 


మల్కాజిగిరి సర్కిల్‌లోని వినాయకనగర్‌ డివిజన్‌లో ఉన్న ఓపెన్‌ నాలాలు పొంగిపొర్లుతున్నాయి. దీన్‌దయాళ్‌నగర్‌, కాకతీయనగర్‌, సింహాద్రినగర్‌, జేకే కాలనీ, దినకర్‌నగర్‌లలో రోడ్లన్నీ పూర్తిగా జలమయంగా మారాయి.  మోకాలి లోతు నీళ్లు ప్రవహిస్తుండడంతో ఇంటినుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. 

జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌లోని బాలాజీనగర్‌, చెన్నాపురం, అంబేడ్కర్‌నగర్‌ పరిధుల్లో ఉన్న పలు కాలనీలు నీట మునిగాయి. భక్తభావి, పాపయ్యనగర్‌, శివాజీనగర్‌, సంతోష్‌నగర్‌లలో ఓపెన్‌ నాలాలు పొంగి రోడ్లన్నీ పూర్తిగా జలమయంగా మారాయి. కార్పొరేషన్‌లో 80కి పైగా ఉన్న కాలనీల్లో మట్టిరోడ్లు ఉండటంతో బురదమయంగా మారాయి. 


బాలానగర్‌ నర్సాపూర్‌ చౌరస్తా వద్ద ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి పనుల కారణంగా ఏర్పడిన గుంతల్లో వర్షం నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఓల్డుబోయినపల్లి డివిజన్‌లోని ఆర్‌ఆర్‌నగర్‌  రోడ్డు, కల్యాణ్‌ థియేటర్‌ రోడ్డుపై నీరు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. 

Updated Date - 2020-09-20T09:58:58+05:30 IST